Home ఆదిలాబాద్ కొత్త జిల్లాలపై కోటి ఆశలు

కొత్త జిల్లాలపై కోటి ఆశలు

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడమంటే ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దగ్గరగా తీసుకు వెళ్లడమే. ఆయా జిల్లాల కేంద్రాలలో అన్ని ఆధునిక హంగులూ ఏర్పడి అవి అభివృద్ధి వేగం పుంజుకోవడానికి రంగం సిద్ధం కావడమే. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న కొత్త రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను గణనీయంగా పెంచనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రకటించినప్పటి నుంచి ఇప్పుడున్న జిల్లాలలోని పలు ప్రాంతాలలో ఆ వైపుగా ఆశలు మొలకెత్తి ఆ క్షణం కోసం ఎదురుతెన్నులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి తాను పాల్గొన్న బహిరంగ సభలలో కొన్ని కొత్త జిల్లా కేంద్రాలను స్వయంగా ప్రకటించి ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ లోలోపల చురుకుగా సాగుతున్నదనే అభిప్రాయం ప్రజలలో నాటుకొన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలు ఎన్ని కొత్త పరిపాలనా విభాగాలుగా ఏర్పాటుకానున్నాయో, అందుకు గల అవకాశాలేమిటో మన తెలంగాణ బృందం సమగ్ర పరిశీలన జరిపింది. కొత్త జిల్లాలుగా అవతరించనున్న ప్రాంతాల్లో ప్రజల ఆకాంక్షలను అడిగి తెలుసుకున్నది. తమ ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉద్యమరూపం దాల్చి, ఊపందుకున్న చోట్ల ఆయా ప్రజల ఆందోళనలు, ఆకాంక్షలపై పరిశోధన జరిపింది. వాటన్నింటినీ ఒకచోట చేర్చి భావి జిల్లాల సమాచారాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాం.

నల్లగొండ…రెండా.. మూడా..!

Surya-petaమన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: నల్లగొండ జిల్లాను ఎన్ని జిల్లాలుగా విభజిస్తారన్న విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సూర్యాపేట కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంగా ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు సూర్యాపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు కానున్నదనటంలో సందేహం లేదు. యాదగిరిగుట్ట(యాదాద్రి) కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీమంత్రి, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు ఇప్పటికే తనదైన శైలిలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అదే పార్టీకి చెందిన మరో పోలిట్‌బ్యూరో సభ్యులు, మాజీమంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి భువనగిరి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని గళమెత్తుతున్నారు. అలాగే మిర్యాలగూడ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తున్నది. మొత్తానికి జిల్లాలోని 12శాసనసభా నియోజకవర్గాలు ఎన్ని జిల్లాలుగా ఆవిర్భవించనున్నాయనే సందేహం జిల్లా ప్రజలను తొలిచివేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇటీవల ఆరు విభాగాలుగా జిల్లా సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి పంపింది. భౌగోళిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక అంశాలను,జనాభాను దృష్టిలో ఉంచుకొని వాటికి అనుగుణంగా జిల్లాలను ఎలా ఏర్పాటు చేయవచ్చనే విషయమై జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విపులీకరించినట్టు తెలుస్తుంది. జిల్లాలో ఉన్న 12శాసనసభ నియోజకవర్గాల్లో ఐదేసి నియోజకవర్గాలను కలిపి రెండు జిల్లాలను ఏర్పాటు చేయాలని, మిగిలిన రెండు నియోజక వర్గాలను హైద్రాబాద్‌లోని వివిధ నియోజకవ ర్గాలతో కలిపి ఏర్పాటు చేయనున్న జిల్లాలో కలుపాలని జిల్లా అధికారయంత్రాంగం ప్రభు త్వానికి అందజేసిన ప్రతిపాదనలో సూచించినట్లు సమాచారం. నల్లగొండ, సూర్యాపేట కేంద్రాలుగా జిల్లాలను ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం స్పష్టం చేసినట్లు తెలు స్తుంది. నల్లగొండ కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాలో నల్లగొండతో పాటు దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలు, సూర్యాపేట కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాలో సూర్యాపేటతో పాటు మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలను ఉంచాలంటూ జిల్లా అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ఏర్పాటు కానున్న జిల్లాలకు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలను కలుపాలని కూడా ప్రతిపాదనలో ప్రభుత్వానికి జిల్లా అధికారులు సూచించినట్లు తెలుస్తున్నది.
గతంలో భువనగిరి జిల్లా కేంద్రమే..
నిజాం కాలంలో భువనగిరి కేంద్రంగా జిల్లా ఉండేది. ఈ విషయాన్ని పరిగ ణనలోకి తీసుకొని తిరిగి భువనగిరి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయ వచ్చని అయితే భువనగిరి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసిన పక్షంలో దానికి ‘యాదాద్రి’గా నామకరణం చేయవచ్చని ప్రభుత్వానికి పంపిన నివేదికలో జిల్లా అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. నల్లగొండ జిల్లాను మొత్తం మూడు జిల్లాలుగా విభజించేందుకు పరిస్థితులు అనుకూలించని నేపథ్యంలో జిల్లాకు ఆరేసి నియోజ కవర్గాల చొప్పున నల్లగొండ, సూర్యాపేట జిల్లాలను ఏర్పాటు చేయాలని, నల్లగొండ జిల్లాలోకి ఆలేరు, భువనగిరి నియోజకవ ర్గాలను చేర్చి, సూర్యాపేట జిల్లా పరిధిలోకి నకిరేకల్ నియోజక వర్గాన్ని చేర్చవచ్చంటూ జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి తన నివేదికలో ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.
ఎవరి వాదనలు వారివే..
తమ తమ నియోజకవర్గాలు, మండలాలు ఏ జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయనే సందేహాలు వివిధ నియోజకవర్గాల ప్రజలను, రాజకీయ పక్షాల నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సూర్యాపేట కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాలో ఉండటానికి తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్, శాలిగౌరారం మండలాల ప్రజలు ఎంతమాత్రం ఆసక్తిని కనబర్చడంలేదు. తమ మండలాలను నల్లగొండ జిల్లాలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మోత్కూర్ మండల ప్రజలు, రాజకీయ నాయకులు తమ మండలాన్ని భువనగిరి, ఆలేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాలో ఉంచాలని అంటూనే ఒకవేళ అలాకాని పక్షంలో తమ మండలాన్ని నల్లగొండ జిల్లాలో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు మండల పరిషత్ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సూర్యాపేట కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాలో విలీనం చేయవద్దని, మిర్యాలగూడ కేంద్రంగా ప్రత్యేక జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతవాసులు, వివిధ రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాని పక్షంలో నల్లగొండ జిల్లాలోనే తమ నియోజవకర్గాన్ని ఉంచాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
‘పేట’ ప్రాంతవాసుల్లో ఆనందం..
నియోజకవర్గ కేంద్రంగా, రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా భాసిల్లుతున్న సూర్యాపేటను మార్చిలోగా జిల్లాకేంద్రంగా మార్చుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో ఆ ప్రాంత వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దసరా పండుగ సందర్భంగా సూర్యాపేటలో రెండు పడకగదుల గృహ సముదాయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి అదేరోజు ఈ ప్రకటనను చేయడం తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రకటన పట్ల సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్‌నగర్, కోదాడ, నియోజకవర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు అయితే తమ కష్టాలు తీరుతాయంటున్నారు. జిల్లాకేంద్రమైన నల్లగొండకు వెళ్లాలంటే ఏ చిన్న పని ఉన్నా ఒక్క రోజంతా వృథా చేసుకోవల్సి వస్తుందని ‘పేట’ జిల్లాగా ఏర్పాటుఅయితే తమకు ఈ కష్టాలు తప్పుతాయని భావిస్తున్నారు. వాణిజ్య, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారడంవలన తమకు పాలనాపరంగా ఇతరత్ర ప్రయోజనాలు కలుగనున్నాయని వారు ఆశాభా వాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మంచిర్యాలకు మహర్దశ

మన తెలంగాణ / మంచిర్యాల ప్రతినిధి: భౌగోళి కంగా ఆదిలాబాద్‌జిల్లా విస్తీర్ణం లో పెద్దది. జిల్లాలోని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లి తిరిగి రావాలంటే ఒక్క రోజులో అసాధ్యమే. అన్ని పనులకు జిల్లా కేంద్రానికి పరుగులు పెట్టాల్సిందే. ఈ నేపథ్యంలో జిల్లాను రెండు భాగాలుగా చేసి తూర్పు ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా జిల్లా ప్రజలు కోరుతున్నారు. జిల్లా కేంద్రం నుండి తూర్పున ఉన్న బెజ్జూర్ లాంటి మండ లానికి చేరుకోవాంటే దాదాపుగా 275కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే. వేమనపల్లి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి తదితర ప్రాంతాలకు 100 నుండి 150 కిలోమీటర్ల దూర ప్రయాణమే. 1970 నుండి రాజకీయంగాను కొత్త జిల్లా ఏర్పాటుపై హామీల జోరు ప్రారంభమైంది. 1982లో ఎన్‌టిఆర్ మంచిర్యాల పర్యటనకు వచ్చిన సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రతిపాదన చేశారు. అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకున్నా హామీ ఆచరణలోకి రాలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలోను, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన అనంతరమూ కెసిఆర్ కొత్త రాష్ట్రంలో ఏర్పడబోయే జిల్లాల్లో మంచిర్యాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని జోడేఘాట్‌లో కొమురంభీం జయంతి దర్బార్‌లో ప్రకటించారు.
ఇదీ కొత్త జిల్లా స్వరూపం
ప్రభుత్వం కొత్త జిల్లాల పునర్ వ్యవ స్థీకరణకు సుముఖత వ్యక్తం చేయడంతో భూ పరిపాలన అధికారుల అదేశానుసారం జిల్లా అధికారులు జిల్లాను రెండు భాగాలుగా విభజించాలని నివేది కలు తయారు చేసి పంపారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 52 మండలా లున్నాయి. మంచిర్యాల కేంద్రంగా ఏర్పడబోయే కొత్త జిల్లాలో 26 మండలాలు 283 గ్రామాలు ఉండేవిధంగా నివేదిక పంపారు. ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచి ర్యాలతో కలిపి 5 రెవెన్యూ డివిజన్లు ఉండగా, కొత్త జిల్లాలో మంచిర్యాల, ఆసిఫాబాద్‌లను ఉంచడంతో పాటు కొత్తగా బెల్లంపల్లిలో కొన్ని గ్రామాలతో మూడవ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను నివేదికలో పేర్కొన్నారు. కొత్త జిల్లా ప్రస్తావన రావడంతోటే బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లలో తమ ప్రాంతాన్నే కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమాలు, నిరాహార దీక్షలు ఊపందుకున్నాయి.

కొత్తగూడెం జిల్లా  

మన తెలంగాణ/ ఖమ్మం ప్రతినిధి : జిల్లాలో ఐదు నియోజక వర్గాలతో కొత్తగూడెం  కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. సత్తుపల్లి, సింగరేణి బొగ్గు గనులు మినహా పారిశ్రామిక ప్రాంతం ఒకటి, రెండు మినహా మిగిలిన గిరిజన మండలాలు అన్ని కొత్తగూడెం జిల్లాలో కలిపే అవకాశం ఉంది. పది నియోజ కవర్గాలు, 41 మండ లాలతో విస్తరించిన ఖమ్మం జిల్లాను రెండుగా విభజిస్తే కొత్తగూడెం కేంద్రంగా జిల్లాఖాయమన్న భావం అందరిలో వుంది. భద్రాచలం చరిత్రాత్మక ప్రదేశమే కాక దేశ వ్యాప్తంగా పేరేన్నిక గన్న పుణ్యక్షేత్రం కావడంతో దానిని కేంద్రంగా చేసుకొని జిల్లాను ఏర్పాటు చేయాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చుట్టూ ఉన్న ప్రాంతమంతా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావడంతో భద్రాచలం నూతన జిల్లా కావడంపై అనుమానాలు రేకెత్తాయి. మధ్యే మార్గంగా భద్రాచలం పేరుతో కొత్తగూడెం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలు, కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. నియోజకవర్గాల విభజన జరిగితే  పాల్వంచ, ఖమ్మం కేంద్రంగా మరో నియోజకవర్గం ఏర్పాటు అయ్యేందుకు వీలుగా  జిల్లాల విభజన జరగ నుంది. కారేపల్లి, ఏన్కూరు, జూలూ రుపాడు మండలాలు, కొణిజర్ల, పెనుబల్లి మండలంలోని కొంతభాగం మినహా మిగిలిన ఏజెన్సీ మండలాలు మొత్తం కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వెళ్లే అవకాశముంది. పాల్వంచ, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, సారపాక, అశ్వాపురం, మొదలైన పారిశ్రామిక ప్రాంతమంతా కొత్త జిల్లాలోనే ఉండే అవకాశం ఉంది. 95 శాతం అటవీ ప్రాంతం కూడా కొత్త జిల్లాలో ఉండే అవకాశం ఉంది. . గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలతో రాష్ట్రంలోనే కొత్తగూడెం కేంద్రంగా ఏర్పడే జిల్లా ప్రత్యేకతను సంతరించుకోనుంది.

మెదక్ జిల్లా మూడు ముక్కలు

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిథి: మెదక్ జిల్లా మూడు ముక్కలు కానున్నది. మెదక్ పేరుతో సంగారెడ్డి కేంద్రంగా ప్రస్తుతం జిల్లా ఉంది. అయితే చాలా రోజులుగా మెదక్ కేంద్రంగా జిల్లాను కొనసాగించాలన్న డిమాండ్ ఉంది. అదే సమయంలో సంగారెడ్డి చాలా దూరంలో ఉన్నందున సిద్దిపేట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మరో డిమాండ్ ప్రబలంగా వినపడుతోంది.  మెదక్ కేంద్రంగా మెదక్, నర్సాపూర్, నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతమున్న జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో జిల్లా ఏర్పడే అవకా శముంది. బాన్సువాడ నియోజక వర్గాన్ని కూడా మెదక్ జిల్లాలో కలపాలని అక్కడి నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగి తిరిగి రామాయంపేట నియోజకవర్గం ఏర్పాటవు తుందన్న ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గం పరిధిలో ఉన్న చేగుంట మండలం వారు తమ ను సిద్దిపేటలో కాకుండా దగ్గరగా ఉన్న మెదక్ పరిధిలో చేర్చాలని కోరు తున్నారు. ఎక్కడో ఉన్న సిద్దిపేట కంటే దగ్గరగా ఉన్న మెదక్ కేంద్రంగా తమకు ఉండాలని అభ్యర్థిస్తున్నారు. ఇక కొత్తగా సిద్దిపేట కేంద్రంగా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు పక్కనే ఉన్న సిరిసిల్ల, జనగామలను కలిపి సిద్దిపేట జిల్లా ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే సిరిసిల్లను సిద్దిపేట జిల్లాలో కలపవద్దని, కరీంనగర్‌లోనే ఉంచాలని ఆ ప్రాంత నేతలు సూచిస్తున్నట్లు తెలు స్తోంది. ఇక సంగారెడ్డి కేంద్రంగా కొత్తగా సంగారెడ్డి జిల్లా ఏర్పాటు కానున్నది. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజక వర్గాలతో ఈ జిల్లా ఉండే అవకాశముంది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఉన్న పటాన్‌చెరులో హైదరా బాద్‌లోని గోల్కొండ పేరుతో ఏర్పాటుచేసే జిల్లాలో కలుపుతారని తెలుస్తోంది. దీనిని పటాన్‌చెరు ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందోల్ నియో జకవర్గాన్ని మెదక్‌లో బదులుగా పక్కనే ఉన్న సంగారెడ్డిలో కొనసాగించాలని, తద్వారా పరిపాలన సౌలభ్యాన్ని పెంచాలని ఆ ప్రాంత వాసులు అంటున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాలు కొన్ని మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో, కొన్ని సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. మెతుకుసీమకు గుండె కాయగా ఉన్న పటాన్‌చెరు నియోజకవర్గాన్ని హైదరాబాద్ పరిధిలోని గోల్కొండ జిల్లాలో కలిపితే అస్తిత్వానికే ముప్పు ఏర్పడే ప్రమాదముందని అంటున్నారు. పునర్విభజన నిర్ణయాల ఆధారంగా ఇక్కడి నేతలు ఉద్యమానికి కూడా సిద్ధమయ్యే అవకాశముంది.

ఆర్‌ఆర్ కూడా మూడే!

మన తెలంగాణ/ ఖమ్మం ప్రతినిధి : పాలనా సౌలభ్యంకోసం జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.  జిల్లాను మొదట పార్లమెంట్ స్థానాల పరంగా విభజిస్తారని అనుకున్నారు. కాని అందుకు భిన్నంగా నివేదికను రూపొంచినట్లు వెల్లడైంది. చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూర్ నియోజకవర్గాలను కలిపి వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో దానిపై స్పష్టత వచ్చింది. జిల్లాలో ఇటీవల కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇబ్రహీంపట్నం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేయడానికి ఆలోచన సాగుతున్నది. నగర శివారులోని ఉప్పల్, ఎల్.బి.నగర్, రాజేంద్రనగర్ నియోజక వర్గాలను కలుపుతూ ఈ కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని దీనికి కేంద్రంగా ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకొని విశాలమైన స్థలాన్ని ఎంపిక చేసి జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆదిభట్ల, బొంగ్లూర్ ప్రాంతాలతో పాటు హయత్‌నగర్ శివారులో ఉన్న ప్రాంతా లను కూడా ఈ జిల్లా పరిధిలోకి స్వీకరిస్తున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలు అన్నీ వికారాబాద్‌లో పోగా తూర్పు ప్రాం తంలోని నియోజ కవర్గాలు ఇందులో రావడానికి అవకా శముంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా భువన గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఇబ్రహీంపట్నం జిల్లా కేంద్రంగా మారితే ఈ ప్రాంత అభివృద్ధికి మరిం తగా దోహద పడుతుంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బూల్లాపూర్, మల్కాజ్‌గిరి, మేడ్చల్ నియోజకవర్గాలను కలుపుకుని మరో జిల్లాగా చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఔటర్ రింగ్‌రోడ్డును పరిగణన లోనికి తీసుకోవడంతో పాటు అంతర్రాష్ట్ర, జాతీయ రహదారులను ఆనుకొని జిల్లా కేంద్రం చేయాలని యోచిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కేంద్రంగా దీనిని ఏర్పాటు చేయాలని “మేడ్చల్ జిల్లా సాధన సమితి” నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో సైతం ఇలాంటి పోరాటం గత కొన్ని రోజులుగా సాగుతోంది.

కామారెడ్డి కేంద్రంగా కొత్త జిల్లా

మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి:కొత్త జిల్లాల పునర్ వ్యవస్థీ కరణ నేపథ్యంలో కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మార్చాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది. కామారెడ్డిని కొత్తగా ఏర్పడే సిద్దిపేట లేదా మెదక్ జిల్లాల్లో కలుపుతారన్న వదంతులు రావడంతో ఈ డిమాండ్ మరింతగా విస్తరిస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒకడుగు ముందుకేసి ఈలోగా అందరినీ సమన్వయపర్చే పనిలో పడ్డారు. కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మార్చాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్‌తో కలిసి కొంతమంది ప్రజాసంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. సిఎం సైతం కామారెడ్డిని జిల్లా కేంద్రంగా మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది.
పుంజుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం…
రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఎక్కడా లేని ఉత్సాహం తొణికిసలాడుతున్నది. ప్రస్తుతం జిల్లా కేంద్రంగా వున్న నిజామాబాద్ పట్టణం లో కూడా ఇంత గా ధరలు లేవు.
నాలుగు నియోజకవర్గాలతో కొత్త జిల్లా
కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కరీంనగర్ జిల్లాలోని గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాలు సైతం ఇందులో కలపనున్నట్లుగా చెపు తున్నారు. అదే విధంగా భీంగల్, సిరికొండ, ధర్పల్లి మండలాలను కూడా కలపవచ్చన్న ఆలోచన కూడా వుంది.

షాద్ నగర్, కల్వకుర్తి

మన తెలంగాణ/పాలమూరు: తెలంగాణ లోనే విస్తీర్ణంలో పెద్దదైన పాలమూరు జిల్లాను విభజించి  రెండు జిల్లాలను ఏర్పాటు చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. షాద్ నగర్, కల్వకుర్తి జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.గద్వాలను జిల్లా కేంద్రం గా ప్రకటిం చాలని ఎమ్మెల్యే డీకే అరుణ ఆందోళన బాట పట్టారు. షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్ కాకున్నా దానికి జిల్లా యోగం పట్టనుందా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. నాగర్ కర్నూల్  లోక్‌సభ నియోజక వర్గంలో కొల్లా పూర్, అచ్చంపేట ప్రధానంగా ఉన్నా యి.  కొత్త జిల్లాల పేర్లలో నాగర్ కర్నూల్ ప్రధానంగా వినవ స్తున్నది. బిజినే పల్లి, పెద్దకొత్తపల్లి, తెల్కపల్లి, మన్ననూర్, లింగాల, బల్మూర్, ఉప్పునుంతల తాడూరు, వంగూరు, ప్రాంతాలు  దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా జిల్లాలో వనపర్తికి ఓ విశిష్ట స్థాన ముంది. వనపర్తి కేంద్రంగా జిల్లాగా ఏర్పడితే గోపాల్‌పేట, పెబ్బేర్, కొత్తకోట, అడ్డాకుల, పెద్దమందడి, మదనా పురం, అలం పూర్ ప్రాంతాలు అందులో వుండే అవకాశాలు మెండు గా ఉన్నాయి.  షాద్‌నగర్ కొత్త జిల్లాగా ఏర్పడితే హైదరా బాద్‌లోని కొన్ని ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, అమీర్‌పేట, రాజేంద్ర నగర్‌లను కలుపుకునే అవకాశాలున్నాయి. కల్వకుర్తి నియోజ క వర్గంలోని కొన్ని ప్రాం తాలను షాద్‌నగర్ జిల్లాలో కలుపుకోక తప్పదన్న భావన ప్రతి ఒక్కరి లో నెలకొంది. ఈకొత్త జిల్లాలో కొత్తూరు, కేశం పేట, బాలా నగర్, కొందుర్గు, తల కొండపల్లి, అమన్‌గల్లు ప్రాంతాలుం టాయని భావిస్తు న్నారు. గతంలో మహబూ బ్‌నగర్ నుంచే కేసీఆర్ ప్రాతినిధ్యం వహించి పాలమూరు వాణిని, తెలంగాణ ఘోషను పార్ల మెంట్‌లో వినిపి ంచారు. జిల్లాకు  యోగ్యమైన షాద్ నగర్‌ను జిల్లాగా ప్రకటించాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్ని ముక్కలో..

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం కరీంనగర్ జిల్లావాసులను గందరగోళానికి గురిచేస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన జగిత్యాల జిల్లాకేంద్రం ఆశలతో ఊగిసలాడుతుండగా రామగుండం, కోరుట్ల ప్రాంతాల్లో మరోజిల్లా కావాలంటూ వాదనలు పుట్టుకొస్తున్నాయి. జిల్లాలో అతి పెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఉన్న జగిత్యాలను జిల్లా కేంద్రం చేస్తానని కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించడంతో ఈ ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జగిత్యాలను కాకుండా కోరుట్లను జిల్లా కేంద్రంగా చేయాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తుండటంతో జగిత్యాల జిల్లా కేంద్రం అవుతుందా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. జగిత్యాలను జిల్లా కేంద్రంగా చేస్తే కొత్త జిల్లా పరిధిలోకి జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలను చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వేములవాడ, ధర్మపురి, కొండగట్టు పుణ్య క్షేత్రాలు జగిత్యాల జిల్లా పరిధిలోకి వస్తాయి. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలను పూర్తిగా జగిత్యాల జిల్లాలో చేర్చడంతో పాటు చొప్పదండిలోని మల్యాల, కొడిమ్యాల, గంగాధర, వేములవాడ నియోజకవర్గం లోని వేములవాడ, చందుర్తి, మేడిపల్లి, కథలాపూర్ మండలాలను చేర్చాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వేములవాడను కొత్తగా ఏర్పడనున్న జగిత్యాల జిల్లాలో కలపవద్దని, తమకు కరీంనగర్ అయితే అందుబాటులో ఉంటుందని అక్కడి వారు ఆందోళనకు దిగుతున్నారు. కాగా జగిత్యాలను జిల్లా కేంద్రంగా చేసే కంటే భౌగోళికంగా సెంటర్‌లో కోరుట్ల ఉన్నందున కోరుట్లను జిల్లాగా చేయాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. మెట్‌పల్లిలోనూ ఇదే డిమాండ్ వ్యక్తమవుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంగా రూపు దిద్దుకుంటే ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, వేము లవాడ, చొప్పదండి నియోజకవర్గంలోని చాల గ్రామాలకు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు దూరభారం తగ్గుతుంది.
తాజాగా రామగుండం ప్రాంతం కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మరోవాదన తెరపైకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణాన్ని కొత్త జిల్లా జాబితాలో చేర్చితే రామగుండం, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంతో పాటు కోల్‌బెల్ట్ ఏరియా అంతా మంచిర్యాల జిల్లాకు పోతుండడంతో రామగుండాన్నే కొత్త జిల్లాగా ప్రకటించాలనే భావన రోజురోజుకూ ఆ ప్రాంత వాసుల్లో పెరిగిపోతున్నది.

ఊపందుకున్న ఉద్యమాలు

మన తెలంగాణ ప్రతినిధి/ వరంగల్: నూతన జిల్లాల ఏర్పాటుపై వరంగల్ జిల్లాలో తీవ్ర గందరగోళం నెలకొంది. జనగామ, మహబూ బాబాద్, ములుగు రెవిన్యూ డివిజన్ కేంద్రా లుగా తమ ప్రాంతాలను జిల్లా లుగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు, దీక్షలు, నిరస నలు సాగుతున్నాయి. గతంలో సిఎం కెసిఆర్ భూపాల్‌పల్లి నియోజకవర్గం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి దివంగత నేత ప్రొఫెసర్ జయశం కర్‌పేరు పెడుతామని ప్రకటించారు.
జనగామ జిల్లా కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జనగామ నియోజకవర్గం పరిధిలోని మండలాలు, స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గంలోని లింగాలఘ నపురం, రఘునాథపల్లి మండ లాలు, పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పుల మండలాల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. ఇందులో కూడా చేర్యాల, మద్దూరు లాంటి ప్రాంతాల వాసులు మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసే సిద్ధిపేటకు, కరీంనగ ర్‌లోని హుస్నా బాద్‌కు దగ్గరగా ఉంటామనే అభిప్రాయం వ్యక్తం మవుతుంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం లోని మిగిలిన ప్రాంతాలు జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంటాయి. ములుగు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకే పరిమితమైంది. ఈ మండలాల వాసులు కోరు తూ ఆందోళనలు చేస్తున్నారు. పక్కనే భూపాల్ పల్లిని జిల్లా కేంద్రం చేయాలనే ప్రతిపాదన ఉండడంతో ఈ నియోజకవర్గ మండలాల నుంచి సానుకూలత వ్యక్తం కావడం లేదు. గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతా లను కలిపి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్‌ను జిల్లాగా చేయాలనే డిమాం డ్‌కు మహబూబాబాద్, డోర్నకల్ నియోజక వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. ఈ జిల్లా ఏర్పాటు కావాలంటే పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలోని మండలాలను చేర్చుకోవాల్సి ఉంటుంది.
భూపాల్‌పల్లి నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా చేయడం పట్ల ఈ నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి సానుకూలత వ్యక్తమ వు తోంది. భూపాల్‌పల్లి, శాయంపేట, మొగు ళ్ళపల్లి, ఘనపురం, చిట్యాల నుంచి సానుకూలత ఉంది.