Search
Thursday 15 November 2018
  • :
  • :

బెంగాల్‌లో రాములోరి పెళ్లికి కొత్త ఊపు

Sampadakeeyam-Logoశ్రీ రామచంద్రుడు సద్గుణ సంపన్నుడు, ఆదర్శప్రాయుడైన ఉత్తమ పురుషుడు, సుపరిపాలనకు మారుపేరైన ప్రభువు-దీన్నుంచి వచ్చిందే రామరాజ్యం నానుడి. శ్రీరాముడి గాథకు సంబంధించి తులసీదాస్ ‘రామచరిత మానస్’ వాల్మీకి రామాయణం సుప్రసిద్ధాలు. సీతారాముల కళ్యాణం లోకకళ్యాణంగా కడువేడుకగా జరుపుకుంటారు హిందువులు. ఇది తరతరాలుగా విశ్వాసం ఆధారంగా కొనసాగుతున్న ఆనవాయితీ, ఆచారం. అయితే ఈ ఉత్సవాలు దేశమంతటా ఒకే ఉత్సాహంతో, ఊపుతో జరగవు. భిన్న సంస్కృతులు, జాతులతో కూడిన మనదేశంలో జాతీయ పండగలతోపాటు ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక పండగ ఉంది. మహారాష్ట్రీయులకు గణేశ్ ఉత్సవాలు, కేరళీయులకు ఓనం, కన్నడిగుల కు దసరా, తమిళులు, తెలుగువారికి సంక్రాంతి, ఉత్తరాదివారికి హోలీ, చాత్, బెంగాలీలకు కాళీమాత ఉత్సవాలు వగైరా. అయితే ఈ ప్రత్యేకతలకు అతీతంగా హిందువులు సాధారణంగా జరుపుకునే ఉత్సవాలు శ్రీరామనవమి, వినాయకచతుర్థి, దసరా, దీపావళి. భక్తజనులు భక్తిప్రపత్తు లతో జరుపుకునే శ్రీరామనవమి ఉత్సవాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే లక్షణం విచారకరం, బాధాకరం.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల తదుపరి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి తూర్పున పశ్చిమ బెంగాల్‌పై కన్నువేశాయి. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను ఏకత్రాటిపైకి తెచ్చే వ్యూహం ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి లాభించింది. ముస్లిం జనాభా 30 శాతం దాకా ఉన్న పశ్చిమబెంగాల్‌లో బిజెపి ఎదుగుదలకు అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు విదితమవు తున్నది. రాష్ట్రంలో శ్రీరామనవమి వారోత్సవాలను తొలిసారి పెద్ద ఎత్తున నిర్వహించా లని ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయించటంలో ఉద్దేశం అదేనని ఊహించటం కష్టం కాదు. ఏప్రిల్ 5న మొదలై 11వ తేదీవరకు రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 350 ఊరేగింపులు జరపాలని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వివిధ హిందూ మితవాద గ్రూపులు తలపెట్టాయి. కోల్‌కతా తోపాటు ఐదు జిల్లాలపై కేంద్రీకరించారు. శ్రీరాముడు ఉపయోగించినటు వంటి కత్తులు, త్రిశూలాలు, బాణాలు, విల్లంబులను జిల్లాల్లో ప్రదర్శనలో కార్యకర్తలు చేబూనుతారని నిర్వాహకులు ప్రకటించారు. నవమి కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి దాదాపు 70వేలమంది కార్యకర్తలు గత నెలరోజులుగా పనిచేస్తున్నట్లు చెప్పబడుతున్నది. బిజెపి నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.
బిజెపి ప్రజలను తప్పుత్రోవ పట్టించటానికి, రెచ్చగొట్టటానికి, అసత్యాలు ప్రచారం చేయటానికి సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తోందని విమర్శించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. శాంతి, సామరస్యం పరిరక్షించాలని కోరారు. “రావణుణ్ణి చంపటానికి రాముడికి మతకలహాలు, నిందాప్రచారం అవసరం లేదు” అంటూ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలకు పరోక్షంగా చురక అంటించారు.
రాముణ్ణి రాజకీయ ప్రయోజనాల కొరకు ఉపయోగించుకోవటం కొత్తేమీ కాదు. 1980వ దశకంలో విశ్వహిందూ పరిషత్‌ని ముందుపెట్టి రామజన్మభూమి ప్రచారోద్యమం నిర్వహించటం, అటుతర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని బిజెపి తన ఎజండాలోకి తీసుకోవటం, అది అంతిమంగా 1992 లో ‘రాముడు ఇక్కడే జన్మించాడు-ఇది మా విశ్వాసం’ అంటూ బిజెపి అగ్రనేతల సమక్షంలో కర్‌సేవకులు బాబ్రీమసీదును కూల్చివేయటం, అది హింసకు, మత కలహాలకు దారితీసి వేలాదిమంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. అది ఆ తదుపరి ఎన్నికల్లో బిజెపికి వరమైంది. అయితే హిందువుల్లో అత్యధికులు లౌకికవాదులైనందున ఆ తర్వాత కాలంలో ఆ మంత్రం పనిచేయలేదు. విశాల స్వభావంగల హిందూమతాన్ని సంకుచితంగా, తీవ్రమైన వాదంగా మార్చే హిందూత్వ సిద్ధాంతాన్ని ఎండగట్టటం ద్వారానే దేశ లౌకికవ్యవస్థ కాపాడబడుతుంది. మతవిశ్వాసాల ను రాజకీయంతో పెనవేస్తున్న పెడధోరణులు ప్రమాద సంకేతాలు.

Comments

comments