Search
Saturday 17 November 2018
  • :
  • :

2 నుంచి కొత్త పంచాయతీలు

panchayat

పట్టణాలకు దీటుగా పల్లెలు : మంత్రి జూపల్లి 

మన తెలంగాణ/ హైదరాబాద్ : పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మం త్రి జూపల్లి కృష్ణారావ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేసిన 4383 పంచాయతీలతో ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రజల కల నెరవేరిందన్నారు. కొత్త పంచాయతీలను ఆగస్టు 2న పండుగ వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున పంచాయతీలను ఏర్పాటు చేసిన రాష్ట్రం దేశం లో మరెక్కడా లేదని తెలిపారు. తెలంగాణ గ్రామీణ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇప్పటి వరకు సమస్యల పరిష్కారం కోసం కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వచ్చేదని, ఈ పరిస్థితిని దూరం చేసేందుకే కొత్త పంచాయతీలను ఏర్పాటుచేశామని చెప్పారు. గిరిజన తండాలను కూడా పంచాయతీలుగా చేయడంతో పాటు గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా రాష్ట్ర బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసినప్పటికి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తున్నామన్నారు. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు నిధులు ఇచ్చే విధంగా ఆదేశాలు జారీచేశామన్నారు. మౌళిక సదుపాయాలతో పాటు నూత న పంచాయతీలకు బోర్డులు ఏర్పాటుచేయడం కోసం నిధులు కేటాయించామని చెప్పారు. మంగళవాద్యాలు, మామిడి తోరణాలతో పండగ వాతావరణంలో పంచాయతీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. రెండు,మూడు గ్రామాలకొక కార్యదర్శి ఉండడం వల్ల జనన, మరణ తదితర దృవీకరణ పత్రాలు పొందేందుకు ఇప్పటి వరకు ప్రజలకు సమస్యగా ఉండేదని, దీని నివారణకు ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. కొత్త పంచాయతీల ఏర్పాటు నేపథ్యంలో న్యాయనిపుణులతో, అధికారులతో చర్చించిన తర్వాతే సర్పంచ్‌లను కొనసాగించలేక ప్రత్యేకాధికారులను నియమించామన్నారు. బిసి గణనతో పాటు ఎన్నికలు త్వరగా నిర్వహించేందుకు న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
జాయింట్ ఎకౌంట్స్ తెరవాలి :
పంచాయతీకార్యదర్శి, ప్రత్యేక అధికారులందరు కొత్త పంచాయతీల్లో వెంటనే జాయింట్ ఎకౌంట్స్ తెరవాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడిన అనంతరం మంత్రి జూపల్లి క్రిష్ణారావ్ జిల్లా కలెక్టర్లు, డిపిఒలు, ఆర్డీఒలు, ఇఒపిఆర్‌డిలు, పంచాయతీకార్యదర్శులు, కొత్తగా నియమిస్తున్న ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ భవనాల ఏర్పాటు, మ్యాప్‌లను ఏర్పాటుచేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీతో పాటు ఎల్‌ఇడి వీధి దీపాల ఏర్పాటుకు ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు మేలుచేయడం, అభివృద్ధికి ఆటంకాలు లేకుండా చేయడం ప్రభుత్వ లక్షమన్నారు. ఈ దిశగా ప్రత్యేకాధికారులు పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments