మనతెలంగాణ/మహబూబాబాద్ టౌన్ : ఖరీఫ్ ఆరంభంలోనే రైతులకు ఎరువుల ధరల పిడుగు పడింది. ఒక్కసారిగా ఎరువుల కంపెనీలు ఎరువుల ధరలు పెంచడంతో మహబూబాబాద్ జిల్లా రైతులపై మోయలేని భారం పడుతున్నది. ఇలా ప్రతి యేటా ఎరువుల ధరలు పెంచుతూ పోతే కొనేది ఎలా, పంటలు పండించేది ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాదిలోనే రెండు సార్లు ఎరువుల ధరలు పెరిగాయి. గత ఏడాదిలో డిఎపి బస్తా రూ.1080 ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో దానిని రూ.1150లకు పెంచారు. ప్రస్తుతం ఈ ఖరీఫ్ ఆరంభంలోనే డీఏపి బస్తా ధర రూ..1290 చేరింది. ఒక్క ఏడాదిలేనే ఎరువులకు ధర రూ.210 పెరగడంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులు కూడా రూ.150 పెరగడంతో రైతులు పెట్టబడికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు, కంపెనీలు ఈ విధంగా ధరలు పెంచుతూ పోతే పంటలు పండించడం చాలా కష్టమవుతుందని రైతలు, రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలు పెరగడంతో మహబూబాబాద్ జిల్లాలో ఒక్క డిఎపి పైనే రూ.16.56 కోట్ల భారం పడుతుంది. పంటలు అధిక దిగుబడి కోసం రైతులు అధికంగానే ఎరువులు ఉపయోగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో డిఎపి 39,429 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటాయని వ్యవసాయ అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. కాంపెక్స్ ఎరువులు 47,315 మెట్రిక్ టన్నులు అవసరమున్నాయి. ఈ పెరిగిన ధరలతో తలలు పట్టుకుంటున్నారు.
పాత స్టాక్ పై కొత్త ధరలు : పాత స్టాక్ పై కూడా ఎరువుల దుకాణ దారులు కొత్త ధరలో రైతులను నిలువు దోపిడిచేస్తున్నారు. ధరలు పెరిగాయంటూ పాత స్టాక్ పై కొత్త ధరలను చూపించి వ్యాపారస్తుల జేబులు నింపుకుంటున్నారు. ఇదంతా వ్యవసాయ అధికారులకు తెలిసినా చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పెరిగిన ఎరువుల ధరలను తగ్గించేందుకు కృషి
చేయడంతో పాటు, పాత స్టాక్‌ను పాత ధరలకే విక్రయించాలని రైతులు కోరుతున్నారు.
ఎరువుల ధరలు తగ్గించాలి : చంద ఉప్పలయ్య రైతు
విఎస్ లక్ష్మిపురంరైతులు
‘పెంచిన ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలి. ప్రతి యేటా ఈ విధంగా ఎరువుల ధరలు పెంచుతూ పోతే వ్యవసాయం చేయలేము. ప్రభుత్వం, కంపెనీలు రైతుల శ్రేయస్సు కోసం తక్షణమే ఎరువుల ధరలు తగ్గిస్తే బాగుంటుంది’ అని చంద ఉప్పలయ్య అనే రైతు ‘మన తెలంగాణ’తో చెప్పారు.
రైతులపై ఎరువులభారం వేయవద్దు : భూక్య సునీతామంగిలాల్
టిడిపి జిల్లా మహిళా అధ్యక్షురాలురైతుల
“ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి రైతుల పై భారం వేయవద్దు. వ్యవసాయాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు, కంపెనీలు ఎరువులను అధిక ధరలకు విక్రయించడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. ఇప్పటికైనాధరలను తగ్గిస్తే బాగుంటుంది.లేదంటే ఆందోళనలు, ధర్నాలు తప్పవు” అని టిడిపి జిల్లా మహిళాఅధ్యక్షురాలు భూక్య సునీతామంగిలాల్ అన్నారు.