Home తాజా వార్తలు నిర్మాణ రంగంలో నయా ట్రెండ్

నిర్మాణ రంగంలో నయా ట్రెండ్

construction_work_manatelan copyనిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. నిర్మాణ సంస్థలు విభిన్న వ్యూహాలు అవలంభిస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించటంతో పాటు, తమ సంస్థ లాభసాటిగా ప్రయనించటానికి, వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి.
పట్టణ ప్రాంత నిర్మాణ రంగంలో వృద్ధి కనిపిస్తోంది. వర్షాకాలం ముగింపు నాటికి నిర్మాణాలకు మరింత డిమాండ్ పెరగవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నిర్మాణ సంస్థలు కూడా నూతన ఫంథాను అనుసరిస్తున్నాయి. సరికొత్త ప్రకటనల ద్వారా వినియోగదారులను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాయి.
హైదరాబాద్ మహా నగరం రోజురోజుకూ విస్తరిస్తున్నది. గత పదేళ్ళుగా పట్టణ జనాభా పెరిగిపోతోంది. జనసాంద్రత కూడా బాగా ఎక్కువైంది. పట్టణాల్లో నివసించటానికి స్థలం కొరతగానే ఉంది. అందుకే వాటికి డిమాండ్ బాగానే ఉంటుంది. నగరంలో స్థలాల కొరతతో, రియాల్టీ రంగం నగర శివార్లకూ విస్తరించింది.
దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ప్లాట్ల ధరలు, హైదరాబాద్ నగరంతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి.నిర్మాణ వ్యయమూ ఎక్కువగా ఉన్నాయి. అందుకే చాలా కంపెనీలు తక్కువ ఖర్చుతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టవచ్చనే భావనతోనే, ఇక్కడ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
ఉమ్మడి ప్రాజెక్టులు
గతంలో ఒక నిర్మాణ సంస్థ తను నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేకపోతే, మధ్యలోనే ఆగిపోయేది. దీనికి నిధుల కొరత ప్రధానంగా వేధించే సమస్య. అందుకోసం ఇప్పుడు చిన్న నిర్మాణ సంస్థలను పెట్టుబడుల కోసం ఆకర్షిస్తున్నారు. వారు ఇచ్చే పెట్టుబడితో నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. వచ్చిన లాభాల్లో షేర్ ప్రకారం పంచుకొంటున్నారు. స్థలం పెద్దగా ఉన్నప్పుడు, నిర్మాణంపోగా మిగిలిన స్థలాన్ని అమ్మటం ద్వారా నిధులను సమీకరించుకొంటున్నారు. కొన్ని సార్లు ప్రాజెక్ట్ 1౦ ఫ్లోర్లు అనుకొని నిధులు సరిపోకపోతే ఏడు, ఎనిమిదికి కుదించుకొని నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. తద్వారా పూర్తి చేసిన ఫ్లాట్లను అమ్మటంతో కొన్ని నిధులను సమకూర్చుకొని, మిగిలిన ఫ్లోర్లను పూర్తి చేస్తున్నారు.
లొకేషన్
చాలా నిర్మాణ సంస్థలు, వినియోగదారులు లొకేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో నిర్మాణ సంస్థలు ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడే అపార్టుమెంట్లు, గృహానిర్మాణాలు చేయటానికి ఆసక్తి కనపరిచేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మౌలిక వసతులు ఓ మోస్తరుగా ఉన్న ప్రదేశాల్లోనే నిర్మాణ దారులు ప్రాజెక్టులను చేపడుతున్నారు. తద్వారా నిర్మాణదారులు అనుకున్న ధర కూడా వస్తుండటంతో ఇలాంటి, ప్రదేశాలకే మొగ్గుచూపుతున్నారు. వినియోగదారులు కూడా పిల్లల చదువులు, ఆఫీసులు దగ్గరగా ఉండే చోట ఇళ్ళు, ఫ్లాట్లను కొనుగోలు చేయటానికి ఆసక్తి కనపరుస్తున్నారు. నిర్మాణదారులు కూడా జనం ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు, కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో, నివాస ప్రాంతాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న చోటనే గృహ సముదాయాలను నిర్మించటానికి, ఆసక్తి కనబరుస్తున్నారు.
నేరుగా మార్కెటింగ్
రియల్‌ఎస్టేట్ సంస్థ తమ ప్రాజెక్టుకు సంబంధించి మార్కెటింగ్ ఫంథాను మార్చాయి. కేవలం కరపత్రాలు, టివి, పేపర్లపై ఆధారపడకుండా,వినియోగదారులను నేరుగా ఆకర్షించ టానికి ప్రధాన కూడళ్ళు, అక్కడక్కడ నిర్వహించే చిన్న ఎగ్జిమిషన్లలో సొంతంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకొని తమ ప్రాజెక్టు గురించి వివరిస్తున్నాయి. ఇందుకోసం మార్కెటింగ్ సిబ్బందినీ నియమించుకుంటున్నాయి. అంతేకాదు, సామాన్య, మధ్యతరగతి ప్రజల ఫోన్ నెంబర్లు సేకరించి తమ ప్రాజెక్టుల గురించి, కల్పించే సదుపాయాల గురించి వివిరిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో వీటన్నింటి కోసం మూడు నుంచి నాలుగు శాతం ఇందుకోసం ఖర్చు చేస్తున్నాయి.
డిజిటల్ ప్రచారం
సంప్రదాయ ప్రచార సాధనాలతోపాటు ఇప్పుడు కొత్తగా డిజిటల్ ప్రచారానికి తెరలేచింది. ఫేస్‌బుక్, ట్విట్టర్ల ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి తమ ప్రాజెక్టు గురించి తెలియజేయటానికి ఇదొక చక్కని అవకాశంగా వినియోగించుకుంటున్నాయి. నిర్మాణదారులు నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఫొటోలుతో పాటు, ప్రాజెక్ట్ ఏ స్టేజీలో ఉందో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ప్రచారం ఊపందుకుంది. ఒక్క క్లిక్‌తో, చాలా మందికి తమ ప్రాజెక్టును వివరించగలుగుతున్నారు. డిజిటల్ ప్రచారం కోసం నిర్మాణదారులు థర్డ్‌పార్టీ సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ సంస్థలు ఫేస్‌బుక్, ట్విట్టర్లలో వారి ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని అందరికీ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా వారి ప్రాజెకు ్ట గురించి సందేహాలు లేవనెత్తుతే, ఈ మెయిల్ సామాజిక మాధ్యమాల ద్వారా నివృత్తి చేస్తున్నారు. తద్వారా ఎక్కువ మందికి నిర్మాణదారుని ప్రాజెక్టు సమాచారాన్ని తెలియజేస్తున్నారు.
రూ.25 నుంచి 30 లక్షలలోపు…
గతంలో నిర్మాణదారులు తమ ప్రాజెక్టును పూర్తి చేసిన తరువాత ఫ్లాట్ల విక్రయ సమయాల్లో వినియోగదారులకు ఇష్టం వచ్చినట్టుగా ధర చెప్పేవా రు. దీంతో, అత్యధికంగా ఆశించిన ధర రాక, వడ్డీలు మీద పడి, నష్టపోయిన దాఖలాలున్నాయి. అయితే, ఇప్పుడు నిర్మాణ దారుల్లో చాలా మార్పువచ్చింది. సగటు వినియోగ దారుల నాడిని బట్టే ప్రాజెక్టులను రూపకల్పన చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా ఫ్లాటు ధరను నిర్ణయిస్తున్నారు. 25 నుంచి 30 లక్షల రూపాయలలోపు కలిగిన అపార్టుమెంటులోని ఫ్లాట్లకు, గృహాలను కొనుగోలు దారు లు ఆసక్తి చూపిస్తుండటంతో ఆ ధరలోనే అందించటానికి, నిర్మాణదారులు ప్రయత్నిస్తున్నారు. నిర్మాణదారుడు 3౦ లక్షల కన్నా ఎక్కువ ధర నిర్ణయిస్తే మాత్రం అవి త్వరగా అమ్ముడు పోక ఇబ్బందులు పాలవుతున్న ఘటనలూ ఉన్నాయి. అందుకే, దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొనే నిర్మాణదారులు ధరలను నిర్ణయిస్తున్నారు.

కమర్షియల్ నిర్మాణాలు
గతంలో చిన్న నిర్మాణ సంస్థలు, కమర్షియల్ కాంప్లెక్సులు, షాపింగ్ మాల్స్ నిర్మాణాలకు దూరంగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. షాపింగ్‌మాల్స్ నిర్మాణాన్ని కూడా చిన్న నిర్మాణ సంస్థలు చేపడుతున్నాయి. నిధుల సమీకరణకు, పెట్టుబడి దారులకు రెడ్ కార్పెడ్ వేస్తున్నారు. లావాదేవీలను పెట్టుబడి నిష్పత్తి ప్రకారం పంచుకుంటు న్నారు. ఇప్పుడు పెద్ద నిర్మాణ సంస్థలకు, చిన్న నిర్మాణ సంస్థలు గట్టి పోటీనిస్తున్నాయి.