Home ఎడిటోరియల్ కొత్త పాకిస్తాన్ సాధ్యమయ్యేనా!

కొత్త పాకిస్తాన్ సాధ్యమయ్యేనా!

Newly elected Pakistan Prime Minister Imran Khan

కొత్తగా ఎన్నికైన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను, టర్కీ మితవాద, జనాదరణ కలిగిన రిసెప్ టయ్యిప్ ఎర్డొగాన్ తో, ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టెతో పోలుస్తున్నారు. అయితే ఈ పోలిక చాలా అలవోకగా, బాగా నలిగిన పోలికలతో కూడింది మాత్రమే. ఎన్నికైన మితవాద నాయకుల మధ్య పోలికలు కనిపిస్తాయి. ఒకరిలో ఉండే లక్షణాలే ఇతరులలో కనిపించే అవకాశం ఉంటుంది కూడా. కానీ నిర్దిష్టమైన పరిస్థితులను, సందర్భాలను, చారిత్రక కారణాలనూ దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ పోలికలలో సామ్యం తక్కువే. ఆ పోలిక బలహీనంగానూ, అర్థ రహితంగానూ ఉండవచ్చు. ఇమ్రాన్ ఖాన్ మోదీ లాంటివాడనో, ట్రంప్ లాంటి వాడనో చెప్పడం అసత్యం మాత్రమే కాదు, అది వారి తత్వానికి పూర్తిగా భిన్నమైంది కూడా. అన్నింటికన్నా ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ ఎలా వ్యవహరిస్తారు, ఆయన ఏం చేయగలుగుతారు అన్నది ఆయన కన్నా బలమైన పాకిస్తాన్ సైన్యం లాంటి వ్యవస్థలు ఆయనకు ఏ మేరకు అవకాశం ఇస్తాయి అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానంగా సైన్యం మీద ఆధారపడినట్టు స్పష్టమవుతోంది.

మొట్ట మొదటిది పాకిస్తాన్‌లో జరిగిన 11వ సార్వత్రిక ఎన్నికలు న్యాయంగానూ, స్వేచ్ఛగానూ జరగలేదు. ఇంతవరకు అందిన సమాచారం, సాక్ష్యాధారాలనుబట్టి చూస్తే ఎన్నికలు జరగడానికి అనేక నెలల ముందు నుంచే అనేక అక్రమాలు జరిగాయని రుజువు అవుతోంది. ఎన్నికలు జరిగిన జులై 25న కూడా దాపరికంలేని పరిస్థితి కనిపించలేదు. ఈ ఎన్నికలలో పోటీ చాలా తీవ్రంగా జరిగింది. డజన్ల కొద్దీ నియోజకవర్గాలలో విజేతలకు, పరాజితులకు వచ్చిన ఓట్ల మధ్య తేడా స్వల్పంగా ఉంది. రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన ఓట్లు విజేతలు సాధించిన ఆధిక్యత కన్నా ఎక్కువే ఉన్నాయి. ఇలాంటి అనేక నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపు మళ్లీ జరపాలన్న విజ్ఞప్తులను తిరస్కరించారు. ఎన్నికలకు ముందే అనేక అక్రమాలు జరిగాయి. ఉదాహరణకు మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హుడిని చేశారు. ఆ తర్వాత ఆయనను జైలుకు పంపించారు. మీడియా మీద సైన్యం పెత్తనం బాహాటంగా కనిపించింది.

న్యాయవ్యవస్థ పక్షపాత ధోరణి అనుసరించింది. కొత్త రాజకీయ పార్టీలు సృష్టించారు. నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని ముస్లిం లీగ్ మద్దతుదార్లకు అవకాశం లేకుండా చేశారు. సైన్యం దన్నుతో కొత్త ఇస్లామిక్ పార్టీ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ అవతరించింది. ఈ పార్టీ నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని ముస్లిం లీగ్ ఓట్లను కబళించినందువల్ల ఆ పార్టీ గెలుస్తుందనుకున్న 13 చోట్ల పరాజయం పాలైంది. దీనికి తోడు రాష్ట్రాల శాసన సభల్లో నవాజ్ పార్టీలో ఉన్న చాలా మంది మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇమ్రాన్ ఖాన్ పార్టీలో చేరేట్టుగా లేదా ఇండిపెండెంట్లుగా పోటీ చేసేట్టు బలవంతపెట్టారు. వీరిని ఇప్పుడు నిందార్థంలో ‘ఎన్నిక కాదగినవారు‘ అంటున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ షరీఫ్ పార్టీ మళ్లీ ఎన్నిక కాకుండా చేయడం కోసం అనేక అక్రమాలకు పాల్పడ్డారు. సామాజిక విశ్లేషకులు ఈ ఎన్నికలను విడమర్చిన తీరు సైతం లోపభూయిష్టంగానే ఉండవచ్చు.

పంజాబ్ లోనూ, కేంద్రంలోనూ షరీఫ్ నాయకత్వంలోని పి.ఎం.ఎల్(ఎన్). పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్నికల ఫలితాలకు ముందు నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఎన్నకలు స్వేచ్ఛగా జరుగుతాయన్న ఊహతో ఈ అంచనాలు వేసి ఉంటారు. అదే జరిగి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండి ఉండేవి. ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా రిగ్గింగ్ జరిగిన తర్వాత విశ్లేషకులు ఈ ఎన్నికలలో ప్రధానాంశం ‘అవినీతి‘ అని వింగడిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ గెలుపు మధ్య తరగతి వారి విజయమని అంటున్నారు. నిజంగా ఎన్నికలు అవినీతి అన్న ప్రధానాంశంగానే జరిగి ఉంటే సామాజిక శాస్త్రాల ఆధారంగా ఫలితాలను విష్లేషించేటట్టయితే వారి కొలమానాల విషయంలో జాగ్రత్తగా ఉండవలసింది. కాని దీనికి భిన్నమైన వాదనలు అనేకం వినిపిస్తున్నాయి.

అయినప్పటికిన్నీ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ 19వ ప్రధానమంత్రి కాబోతున్నారు. పాకిస్తాన్ ప్రజలు, పొరుగు దేశాల వారు, యావత్ప్రపంచం ఈ వాస్తవాన్ని అంగీకరించవలసిందే. ఏ స్థాయిలోనూ పరిపాలనానుభవం లేకుండా, అనుభవం లేని అనేక మంది కొత్త మంత్రులతో ఇమ్రాన్ ఏర్పాటు చేసే ప్రభుత్వం కొత్త పాకిస్తాన్ ఏర్పాటుకి తోడ్పడుతుందని ఆయన మద్దతుదార్లు విశ్వసిస్తున్నారు. అయితే పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇది 1988లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు బేనజీర్ భుట్టో మొదటి సారి ప్రధాని అయినప్పుడు ఎదుర్కున్న వ్యతిరేకతకన్నా ఎక్కువే ఉంటుంది. ఈ సారి ప్రతిపక్షంలో ఉన్న వారు అనుభవజ్ఞులు.

పంజాబ్ లో కూడా ఇమ్రాన్ ఖాన్ గట్టి ప్రతిఘటననే ఎదుర్కోవలసి ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ నిరంకుశుడు, పిడివాది, అహంకారి, సహనం లేని వాడని అంటారు. అలాంటప్పుడు ఆయన ప్రభుత్వం ఏ మేరకు పటిష్ఠంగా ఉంటుందో చెప్పలేం. అయితే ఇమ్రాన్ ఖాన్ విజయోత్సవ ప్రసంగంలో ఆయనకున్న ఈ లక్షణాలు బయట పెట్టలేదు. మాట్లాడుతున్నది ఆయనేనా అన్న అనుమానమూ కలిగింది. ఆయన ప్రసంగం చాలా హుందాగా సాగింది. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, క్షమాగుణం, మైత్రి, పరిశుభ్రమైన, నిరాడంబర ప్రభుత్వం, పాకిస్తాన్ పొరుగుదేశాలన్నింటితో స్నేహం, ఆయన వల్లిస్తున్న ఇస్లామిక సూత్రాలు ఆయన ప్రసంగంలో వినిపించాయి.

8 వ శతాబ్దంలో మహమ్మద్ ప్రవక్త మదీనాలో రాజ్య స్థాపన తనకు స్ఫూర్తి కలిగిస్తుందని ఇమ్రాన్ చెప్పారు. ఆయన వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితంలోనూ అనేక వైరుధ్యాలు ఉన్నాయి. ఆయన చెప్పిన మాటల్లో సదుద్దేశం, సమస్యలను పరిష్కరించాలన్న సంకల్పం ఉండవచ్చు. కాని ఇంతకు ముందు ఈసడించిన అనేక మందిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మెజారిటీ సాధించడానికి అక్కున చేర్చుకున్నారు. పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. సైన్యం ప్రభావం అపారంగా ఉన్న స్థితిలో ఇమ్రాన్ పొరుగు దేశాలతో ఎలా వ్యవహరిస్తారు, ఆయన పదవిలోకి రావడానికి సహకరించిన వారు అడిగే వాటా ఎంత, ఆర్థికంగా ఇతర దేశాల మీద ఆధారపడడం, అనుభవంతో కూడిన ప్రతిపక్షం మొదలైనవన్నీ కొత్త పాకిస్తాన్ రూపు రేఖలను నిర్ణయిస్తాయి.

                                                                                                                                          -(ఇ.పి.డబ్ల్యు.సౌజన్యంతో)