Home ఆంధ్రప్రదేశ్ వార్తలు కోడికత్తి కేసులో కొనసాగుతున్న ఎన్‌ఐఎ విచారణ

కోడికత్తి కేసులో కొనసాగుతున్న ఎన్‌ఐఎ విచారణ

నార్కొ టెస్టుకు సిద్ధమని నిందితుని వెల్లడి
హైదరాబాద్‌ః వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్‌పై కోడికత్తి దాడి ఘటనపై మాదాపూర్‌లోని ఎన్‌ఐఎ కార్యాలయంలో రెండో రోజు విచారణ సాగింది. హైదరాబాద్ ఎన్‌ఐఎ కార్యాలయంలో సోమవారం ఆరుగురు సభ్యులు గల ఎన్‌ఐఎ బృందం శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కోడికత్తి నిందితుని తరపు న్యాయవాది సలీం హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎ కార్యాలయానికి చేరుకున్నారు. జగన్‌పై దాడి ఘటనలో నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం సమక్షంలో ఎన్‌ఐఎ అధికారులు విచారణ చేపట్టారు.

జగన్‌పై దాడి వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. అసలు జగన్‌పైనే దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందని ఎన్‌ఐఎ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తన వెనుక ఎవరూ లేరని, తనను నార్కొ టెస్ట్ చేసినా ఇదే విషయం చెబుతానని శ్రీనివాస్ ఎన్‌ఐఎ అధికారులకు వివరించాడని అతని తరపు న్యాయవాది సలీం మీడియాకు తెలిపారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును 7 రోజల పాటు కస్టడీకి తరలించిన విషయం తెలిసిందే. మొదటి రోజు ఆదివారం జగన్‌పై దాడి జరిగిన ప్రదేశం, అక్కడ ఉన్న కొంతమందిని ఎన్‌ఐఎ అధికారులు వివరించారు. ఎంతకాలంగా ఎయిర్ పోర్ట్‌లో పనిచేస్తున్నది ఎందుకు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందన్న దానిపై ఎన్‌ఐఎ అధికారులు సమాచారం రాబడుతున్నారు.

NIA Investigate on YS Jagan attack case