Home తాజా వార్తలు కోడికత్తి కేసులో ముగిసిన ఎన్‌ఐఎ దర్యాప్తు

కోడికత్తి కేసులో ముగిసిన ఎన్‌ఐఎ దర్యాప్తు

 

శ్రీనివాసరావును విజయవాడ కోర్టులో హాజరుపర్చిన అధికారులు
జైలు అధికారులపై న్యాయమూర్తికి ఫిర్యాదు
హైదరాబాద్: జగన్‌పై దాడి చేసిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు విచారణ పూర్తి కావడంతో ఎన్‌ఐఎ అధికారులు శుక్రవారం విజయవాడ ఎన్‌ఐఎ కోర్టులో హాజరుపర్చారు. వారం రోజుల కస్టడీ ముగియడంతో ఎన్‌ఐఎ అధికారులు శ్రీనివాసరావును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపించిన అనంతరం ఎన్‌ఐఎ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ ఖైదీగా తాను జైలులో ఉన్నప్పుడు రాసుకున్న 22 పేజీల లేఖను జైలు అధికారులు బలవంతంగా లాక్కుకున్నారని శ్రీనివాసరావు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. తన లేఖను తనకు ఇవ్వకుండా వేధిస్తున్నారని, తనకు లేఖ ఇప్పించి న్యాయం చేయాలని నిందితుడు శ్రీనివాసరావు జడ్జీని వేడుకున్నారు. ఇదిలా వుండగా నిందితునికి జైలులో ప్రాణహాని ఉందని, తగిన రక్షణ కల్పించాలని న్యాయవాది సలీం జడ్జీకి విన్నవించారు. ఈ క్రమంలో ఎన్‌ఐఎ అధికారులు ఇబంది పెట్టారా అని శ్రీనివాసరావును న్యాయమూర్తి ప్రశ్నించగా తనను ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదని నిందితుడు శ్రీనివాసరావు తెలిపాడు. అయితే తాను మీడియాతో ఒక్కసారి మాట్లాడతానని, అందుకు అనుమతి ఇవ్వాలన్న నిందితుడు శ్రీనివాసరావు విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. శ్రీనివాసరావుకు విజయవాడలో భద్రత లేదని న్యాయవాది సలీం వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని వివరణ కోరగా రక్షణ కల్పించలేమని అంగీకరించారు. దీంతో నిందితుణ్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పటిష్ట భద్రత నడుమ నిందితుడు శ్రీనివాసరావును రాజమండ్రి జైలుకు తరలించనున్నారు.
హర్షవర్ధన్ చౌదరి గైర్హాజర్
ఇదిలావుండగా వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి శుక్రవారం ఎన్‌ఐఎ విచారణకు గైర్హాజరయ్యాడు. కేసు విచారణలో భాగంగా విశాఖలోని కైలాసగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఎన్‌ఐఎ అధికారులు మూడు రోజులుగా సాక్షులను,ఘటనాస్థలిలో ఉన్న వైఎస్‌స్సార్ సిపి నేతలను, వైఎస్‌స్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్, మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్‌లను విచారించారు. ఎన్‌ఐఎ నోటీసులు జారీచేసినా ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి హాజరుకాకపోవడం గమనార్హం.

 

NIA Investigation completed in YS Jagan attack case