Home అంతర్జాతీయ వార్తలు సైనిక శిక్షణలో అపశృతి.. 9మంది అమెరికా సైనికులు మృతి

సైనిక శిక్షణలో అపశృతి.. 9మంది అమెరికా సైనికులు మృతి

American-Soldiersహ్యూస్టన్: అమెరికాలో సైనిక శిక్షణలో అపశృతి చోటుచేసుకుంది. ఫోర్ట్‌హుడ్ మిలిటరీ బేస్‌లో సైనికులు శిక్షణలో ఉండగా వరదల్లో వాహనం తిరగబడి కొట్టుకుపోయింది. ఈ సమయంలో వాహనంలో 12 మంది సైనికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ముగ్గురిని రక్షించారు. గల్లంతైన ఐదుగురి మృతదేహాలు నిన్న లభ్యం కాగా, మరో నలుగురి మృతదేహాలు ఈ రోజు లభ్యం కావడంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఫోర్ట్ హుడ్ డిప్యూటీ కమాండర్ మేజర్ జనరల్ జాన్ ఉబెర్టి ఈ విషయం ధ్రువీకరించారు. మృతుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాధారణంగా రోజూ జరిగే శిక్షణ కార్యక్రమమేనని, 12 మంది సైనికుల బృందం లైట్ మీడియం టాక్టికల్ వెహికిల్ అనే దాన్ని నడపడం నేర్చుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనలో ప్రాణాలతో బయటపడిన ముగ్గురు సైనికులు ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్ఛార్జి అయినట్లు జనరల్ ఉబెర్టి వెల్లడించారు. ఫోర్ట్‌హుడ్ మిలటరీ బేస్ వద్ద గత నవంబరులోనూ ప్రమాదం జరిగింది. అప్పుడు శిక్షణలో ఉన్న బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలి నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.