Home కలం తొలి వెలుగుల ‘తెనుగు పత్రిక’

తొలి వెలుగుల ‘తెనుగు పత్రిక’

Nine years ago, Telangana was to be a 'tanuku' magazine

తొంభై నాలుగేళ్ళ క్రితం తెలంగాణాను జాగృతపరచడానికి తనదైన బాణిలో ‘తెనుగు’ పత్రిక ప్రజల ముంగిళ్ళకు వచ్చింది. ఆనాటి మన తెలంగాణాను నిటారుగా నిలబెట్టింది. తెలంగాణ తన అస్థిత్వాన్ని చాటుకుంటున్న ఈ తరుణంలో ఒక్కసారి ‘తెనుగుపత్రిక’ను పంచిన వైనాన్ని స్పృశిద్దాం.

పత్రిక నిర్వాహకులు : వరంగల్ జిల్లా కేసముద్రం దగ్గర ఇనుగుర్తి గ్రామంలో ‘తెనుగు’ పత్రికను స్థాపించారు ఒద్దిరాజు సోదరులు. ఒద్దిరాజు సీతారామచంద్రరావుగారు, ఒద్దిరాజు రాఘవరంగారావుగార్లు అన్నదమ్ములు. వీరు ఇనుగుర్తి సోదరులుగా కూడా ప్రసిద్ధి చెందారు. వీరి తల్లిదండ్రులు రంగనాయకమ్మగారు, వెంకట రామారావుగార్లు. 1887 లో సీతారామచంద్రరావుగారు, 1894 లో రాఘవరంగారావుగారు జన్మించారు. చిన్ననాటి నుండి ఎంతో కష్టపడి చదువు నేర్చుకున్న ఈ సోదరులు యుక్తవయస్సుకు వచ్చేవరకు బహుభాషా కోవిదులయ్యారు. ఆయుర్వేదం, హోమియో, అలోపతి వైద్యాలను నేర్చుకొని ప్రజలకు ఉచిత సేవ చేశారు. దట్టమైన అడవులు, పురుగుబూచి ఉన్న పల్లెల్లో పాము, తేలుకాటువంటి విషప్రభావానికి లోనైనవారికి ప్రాణదానం చేసేవారు. ఎంతోమందికి వారి ఇంట్లోనే ఉచిత భోజన సౌకర్యాలు కలుగజేసి ఎంతోమందికి విద్యాదానం చేసేవారు. తెలుగుకు విలువలేని, బళ్ళులేని, ఆ గడ్డుకాలంలో స్వయంకృషితో తెలుగుతోపాటు సంస్కృతం, తమిళం, పార్శీ, ఉర్దూ, ఇంగ్లీష్ వంటి రచనలుచేశారు. 1912లో ‘మోహినీవిలాసం’ అనే నాటకాన్ని రాసిన వీరు, తెలుగులో ‘సర్వలోకేశ్వర శతకం’ రాశారు. కవిరాజు, తయక్కునాతు, రజాకారు, నిజాం ప్రబోధము, కాశీం రజ్వీ, కీ.శే. షోయబుల్లా, మహాత్మ నిర్యాణము, ధ్వజప్రణతి, పేదఱికము, నిద్ర, కష్టానుభవములు, ఎన్నికలు వంటివెన్నో కవితలు రాశారు. ఒక సౌదామిని పరిణయం’ ప్రబంధం రాసినా, ఒక ‘రుద్రమదేవి’ నవలను రాసినా ‘దుష్టపంచాయితి’ వంటి నాటకాలు రాసినా ఈ సోదరులకే చెల్లింది. పాణిని అష్టాధ్యాయికి వ్యాఖ్య రాయడం, తమిళంలో ‘ఆర్తి ప్రబంధం’ రాయడం, ఇంగ్లీష్‌లో కవిత్వం రాయడమే కాదు, రవీంద్రనాథ్ టాగోర్ ‘దరెక్’ (నౌకాడుబి) నవలను ‘నౌకాభంగం’ పేర తెలుగులోకి అనువదించినా వారికే చెల్లింది.

నేపథ్యం : దాదాపు వందకుపైగా రచనలు చేసిన ఈ సోదరుల సాహిత్య ఝరీ ప్రవాహం అంతటిలో ఆగక వార్తాపత్రిక రూపున తెలంగాణా మాగాణిని తడిపింది, పులకింపజేసింది. అక్షరాస్యుల గుండెగోడలను తడిమి, పండిత పామరజన హృదయ కవాటాలను స్పృశించి నాదభరితం చేసింది. “వార్తయందు జగము వర్థిల్లుచున్నది” అనే పద్యాన్ని పత్రిక పైభాగంలో, పేరు క్రింద రాసి విద్యలేమి చేత అంధకార బంధురంగా ఉన్న జనులను మేల్కొలిపే నేపథ్యంతో 1922 ఆగష్టు 27 ‘దుందుభి’నామ సంవత్సరంలో ప్రారంభించి విజయ దుందుభులు మ్రోగించారు సోదరులు.

తెనుగు పత్రికలోని శీర్షికలు
‘నేటి మన పత్రికల ‘సిటీ ఎడిషన్’ వలె ఉన్న ‘తెనుగు’ పత్రికను ప్రతి ఆదివారం వెలువరించేవారు ఒద్దిరాజు సోదరులు. ‘ప్రకటనలు’ అనే శీర్షికతో ప్రారంభమైన పేజీలో ‘మీరింకనూ చదవలేదా’ అంటూ పుస్తకాల గురించి, పాఠశాలల పుస్తకాలను గురించి వ్రాసేవారు. ‘తాంబూలసుగంధ చూరణం’ గురించి, మోటార్లు, సైకిళ్ళు లాటరీ టిక్కెట్లు వంటి ప్రకటనలూ ఇచ్చేవారు. ‘వ్యాసావళి’ పేరుతో ఒక పేజీ ఉండేది. పాలకోడేటి వేంకటరామశర్మ ‘దేశసేవ’, పింగళి వెంకటరామిరెడ్డి ‘ఆంధ్ర గ్రంథాలయ సభ’ పర్చారంగారావుగారి ‘నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘ నిర్మాణం’ ‘ఆర్యవైశ్య మహాజనసభ గుంటూరు’ వ్యాసం; ‘పలకలా? కాగిదములా?’ చిగారు వరన్నగారి వ్యాసం వంటివెన్నో ఎంతో ఆసక్తిదాయకంగా రాసిన వ్యాసాలు ఈ పత్రిక స్థాయిని తెల్పుతున్నవి. ‘లేఖావళి’, ‘పద్యావళి’ అనే శీర్షికలతో తెలంగాణలో పాఠకులను, కవులను పరిచయం చేస్తున్నవి. ‘వివిధ విషయములు’, ‘వివిధ ప్రకటనలు’, ‘వింత వార్తలు’ సమకాలీన విశేషాలు’ అన్నీ వేటికవే సాటి. వైద్య విధానాల గురించి, పరీక్షల ప్రకటనలు, విజ్ఞప్తులు, సమావేశాల గురించి వంటివన్నీ వచ్చేవి. ‘నిజాం దేశవార్తలు’ అనే శీర్షికతో ఆనాటి సామాజిక, రాజకీయ విశేషాల చర్చను గమనిస్తాం. ఇందులో ఖాన్గీబడి కూడా పెట్టడానికి నిరాకరించిన రాజకీయాలనుండి మొదలుకొని, నైజాంకాలేజీలో జగదీశ్ చంద్రబోస్ (సైంటిస్ట్) హిందూ ముస్లీం సఖ్యతను కోరడం ఒక న్యూస్ ఐటవ్‌ులాగా వేయడం వరకు ఎన్నో గమనిస్తాం. ‘వృత్తాంతాలు’, ‘వింతవార్తలు’ ‘సాధారణ ప్రకటనలు’ వంటివన్నీ మిగతా పేజీలలో ఆసక్తిదాయకంగా రాశారు.

సంపాదకీయాలు: ఇక అన్నింటినీ తలదన్నేలా, నేటి ప్రముఖ పత్రికలను తలపించేలా ఉన్న ఈ పత్రిక ‘సంపాదకీయాలు’ చదివితే కావలసినంత సామాజిక జ్ఞానం అంది వస్తుంది. ఒక ప్రత్యేకమైన స్థాయి తెనుగు పత్రిక సంపాదకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మంచి భాషా స్వరూపంతో ఆదర్శవంతంగా రాశారు. పూర్తిగా గ్రాంధిక భాష లేకుండా, పరభాషా ప్రభావం ఎక్కువ లేకుండా, రాజ్యభాష ఉర్దూను ధిక్కరించకుండా, నెత్తికెక్కించుకోకుండా సాధారణ పాఠకునికీ చేరువయ్యేలా రాశారు. పరుషాక్షరాలైన క,చ,ట.త,ప,ల ఉపయోగం కన్నా సరళాక్షరాలైన గ,జ,డ,బల ఉపయోగం ఎక్కువ చూస్తాం. క్రియా పదాల వాక్యాంతాల్లో జాగ్రత్తనూ గమనిస్తాం. ప్రాంతీయతకు దెబ్బరాకుండా యాసను పదిలపరుస్తూ పత్రికవార్తల్లో ఉన్నా, సంపాదకీయాల్లో భాష ప్రత్యేకతను చాటారు. ఒక సంపాదకుడు కేవలం సంపాదకీయం రాసి, ప్రముఖ వార్తలు చూసే పరిస్థితి కాదు ఆనాడు ఈ సోదరులది. వీరే వార్తలు సేకరించాలి, వీరే ముద్రించుకోవాలి, వీరే ప్రూఫ్‌లను చూసుకోవాలి! అక్షరాలను పేర్చుకోవడం, సిరాను అద్దడం, బైట్స్‌కి ఎక్కించడం, కాగితాన్ని పెట్టడం, ఒత్తడం వంటివన్నీ శారీరక శ్రమకు సంబంధించిన, టెక్నికల్ పనులకు సంబంధించిన పనులన్నీ వీరే చేసుకోవాలి. ఏ చిన్న పనికూడా ఇతరులకు చెప్పే పరిస్థితులు లేవు. ఎవ్వరికీ దీని భావమేమో అర్థంకాని స్థితి, ఏ చిన్న తప్పిదం జరిగినా యంత్రం ‘రిపేర్’ చేయించుకోవడానికి మద్రాస్ కెళ్ళాల్సిన పరిస్థితి ఏ పనిముట్లు, ఏ పరికరాన్ని ధైర్యంగా ఎవ్వరికీ అప్పగించే పరిస్థితి లేదు. అన్నీ ఈ సోదరులే అంతా ఈ సోదరులే!!
6 ఏండ్లు నిరాఘాటంగా, తప్పులు లేకుండా, పత్రికను నడిపిన ఒద్దిరాజు సోదరుల సంపాదకీయాలను ఓసారి అవలోకిద్దాం ‘శాసనసభ అలక’ అనే శీర్షికతో “మదరాసు శాసనసభా సదులలో గొందరకు తమ పంతము చెల్లకపోయెన నియలుక జనించినపుడు, పాత్రోగారు, రామారాయణంగారు, నిరువురు మహ్మదుభాషా మతమువారు వెడలిపోక సభయందుండిరి” అంటూ రాస్తూ ఏనాడైనా ప్రతిపక్ష, స్వపక్ష సభ్యులు వారివారి ఉనికినెట్లా చాటుతారో తెలిపారు. “పాలకులు పాలితులు” అంటూ శీర్షికపెట్టి, “భిక్షా శబ్దము వినినంతనే కొందరేవగించుకొనవచ్చును, కాని యిది, యీ భిక్ష స్వలాభము పాటించిగాకుండుట చేతను, దేశహితార్థమగుటచేతను నూనవృత్తియే యైనను న్యూనత ఘటింపదు” అంటూ హిందూ, మహమ్మదీయ మైత్రి కోసం గాంధీజీ ప్రయత్నంపై అభిప్రాయపడ్డారు. అట్లే, ‘స్త్రీ విద్య’ ‘సంఘము’, ‘రాజ్యాంగశ్రద్ధ’, ‘దేశబంధుదాసుగారు’ అంటూ చక్కని సంపాదకీయాలు రాశారు. “చికలితీరిన కత్తివంటి ప్రాధ్విక శాసనము చేతగాని దేశసేవైక భావముతో విద్యాభివృద్ధికి సాధన భూతములగు గ్రంథాలయములను స్థాపించునపుడు, ఇది యేమను నా క్షేపం ప్రభుత్వము వారిచే గలుగు నవకాశము తటస్థించినపుడు, అక్రమమనుట కంటే భిన్నమేమి?” అంటూ గ్రంథాలయోద్యమంపై రాశారు.

స్ఫూర్తిదాయకం : 500 ప్రతులతో ప్రారంభమై 1000 ప్రతుల ముద్రణ పంపిణికి ఎదిగిన తెనుగు పత్రిక చేసిన సేవలను, పత్రిక చేవను ఎందరో ప్రముఖులు పొగిడారు.
సోదరులు తమ భాషా నైపుణ్యంతో ఆనాటి సమస్యలను ఫోకస్ చేసేలా పత్రికను నడిపారు. తెలుగుకు వెలుగులేని కాలంలో తెనుఁగు పత్రిక కాగడాగా నిలిచి తెలంగాణా చైతన్యానికి తనవంతు చేయూతనిచ్చింది. ఇంతకన్నా స్ఫూర్తిదాయకం ఏమి ఉంటుంది.