Home దునియా సినిమా అమ్మ నిర్మలమ్మ

సినిమా అమ్మ నిర్మలమ్మ

                Nirmalamma

సాంఘిక నాటకాల్లో హీరోయిన్‌గా నటించి మంచి నటిగా రంగస్థలంపై గుర్తింపు పొంది, పౌరాణిక చిత్రాలలో నటిగా కెరీర్ ప్రారంభించి కొంత గ్యాప్ తర్వాత మళ్లీ చిత్రరంగంలోకి అడుగిడి సహాయ పాత్రలలో రాణించింది. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా అమ్మ, అమ్మమ్మ, బామ్మ పాత్రలకు సజీవరూపం ఇస్తూ, యాసలోనూ ఆకట్టుకుని అలరించింది నిర్మలమ్మగా అందరూ ఆప్యాయంగా పిలిచే నిర్మల.

జి.నిర్మలగా సినీరంగంలో ప్రసిద్ధి చెందిన ఈమె అసలు పేరు రాజమణి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో గంగమ్మ, కోటయ్య దంపతులకు గౌడ కుటుంబంలో 1925లో జన్మించింది. రంగస్థల నటనపై మక్కువ పెరిగి పదవ ఏట నుంచే నాటకాల్లో నటించసాగింది. అప్పట్లో ఆమె గొంతు సన్నగా (పీలగా) ఉండటంతో సతీ సక్కుబాయి నాటకంలో నటిస్తున్నప్పుడు సన్నగా వినిపిస్తున్న డైలాగ్స్‌కి ప్రేక్షకులు అల్లరి చేశారు. ఆ తరువాత కొంత అభివృద్ధి చెందింపజేసుకొని స్వరాన్ని మెరుగుపరుచుకుంది. కరవు రోజులు, నేటి నటుడు, నాటకం, దొంగాటకం నాటకాల్లోని ప్రధాన పాత్రలు పోషించి మెప్పు పొందింది.

పెళ్లికి కండిషన్ రంగస్థల నటుడుగా, నాటక ప్రదర్శకుడుగా గుర్తింపు పొందిన జి.వి.కృష్ణారావు (తరువాత కాలంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పలు హిట్ చిత్రాలకు, భారీ చిత్రాలకు పనిచేస్తూ చిత్రరంగంలో అందరితో ప్రశంసలు పొందేవారు. నిర్మాతకు ఆర్టిస్టులకు మధ్య తగాదాలు రాకుండా సామరస్యంగా సమస్యలు పరిష్కరించేవారు) రాజమణిని చూసి ప్రేమలో పడ్డారు. తరువాత పెళ్లి చూపులకు ఆమె ఇంటికి వెళ్లినప్పుడు ఆనవాయితీ వ్యవహారాలు జరిగాక “ పెళ్లి అయిన తరువాత కూడా నాటకాల్లో నటించడానికి అభ్యంతరం పెట్టకూడదు” అనే కండిషన్ పెట్టింది. రెండు కుటుంబాల పెద్దలు నిర్ఘాంతపోయారు. ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కండిషన్ సడలించలేదు. తనకు కూడా నాటకాభిరుచి ఎక్కువగా వున్నందున జి.వి.కృష్ణారావు ఆ కండిషన్‌కి అంగీకరించారు. ఆ తరువాత ఆ దంపతులు ఉదయని నాటక సంస్థను నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించడం, నటించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

కరువు రోజులు నాటకం కాకినాడలో ప్రదర్శించినప్పుడు హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ (హీరో, దర్శక నిర్మాత రాజకపూర్ తండ్రి, కరీనా కపూర్, రణబీర్ కపూర్‌ల ముత్తాత) చూసి రాజమణి దగ్గరకు పెళ్లి చక్కగా నటించినట్లు (హాస్య, నటుడు చలంని కూడా మరోసారి ఒక నాటకంలో ప్రశంసించారాయన) చెప్పి, మంచి నటిగా ఎదుగుతావు అని ఆశీర్వదించారు.

ఆ తరువాత కొందరు సినీ ప్రముఖుల కారణంగా వారి పిలుపు మేరకు చిత్రరంగంపై దృష్టి మళ్లింది. ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన గరుడ గర్వభంగం పౌరాణిక చిత్రంలో సత్యభామ చెలికత్తెగా నిర్మలకు నటించే ఛాన్స్ లభించింది 1942లో. కన్నాంబ కైకేయిగా నటిస్తూ కె.బి.నాగభూషణం దర్శకత్వంలో నిర్మించిన పాదుకా పట్టాభిషేకంలోనూ నటించింది. భర్త జి.వి.కృష్ణారావు సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల్లో సహాయపడేవారు. అయితే నటిగా ఆమెకు ప్రొడక్షన్ మేనేజర్‌గా భర్తకు అవకాశాలు అంతంత మాత్రంగా ఉండటంతో ఆదాయం సరిగా లేక అప్పులు చేసేవారు. ఆ అప్పులు తీర్చడానికి ఇద్దరూ మళ్లీ నాటకరంగంపై దృష్టి నిలిపారు. కొన్నేళ్ల తరువాత ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొంది 1961లో విడుదలైన కృష్ణప్రేమ (కృష్ణుడుగా బాలయ్య, చంద్రావళిగా జమున, రాధగా ఎస్.వరలక్ష్మి, సత్యభామగా గిరిజ నటించారీ చిత్రంలో) సినిమాలో రుక్మిణిగా అవకాశం లభించింది. నటిగా ఆమె కు ప్రొడక్షన్ మేనేజర్‌గా జి.వి.కృష్ణారావుకు క్రమంగా అవకాశాలు పెరిగాయి.

అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ కుమారి నటించిన భార్యాభర్తలు చిత్రంలో అక్కినేని తల్లిదండ్రులుగా నిర్మల, గుమ్మడి నటించారు. ఈ చిత్రం హిట్ కావడంతో వీరి కాంబినేషన్లో 20 చిత్రాలు పైనే వచ్చి, నిర్మలలోని నటనను బయటపెట్టాయి. వి.మధుసూదనరావు దర్శకత్వంలో శోభన్‌బాబు, శారద, కాంచనలతో రూపొంది ఘన విజయం సాధించిన మనుషులు మారాలి చిత్రంలో కథానాయకుడు శోభన్‌బాబు తల్లిగా నిర్మల ప్రదర్శించిన నటన ఆమె నట జీవితానికి చక్కని మలుపు తిప్పి తల్లి, వదిన, పిన్ని వంటి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయింది. ప్రేమాభిషేకం చిత్రంలో శ్రీదేవి బామ్మగా నటించినప్పటి నుంచి బామ్మ, అమ్మమ్మ, నాయనమ్మ పాత్రలలోను ఒదిగిపోయి ఔరా అనిపించింది ప్రేక్షకులతో. ఇలాంటి పాత్రలలో సాధారణంగా తెల్లగా మెరిసిపోయే చీరకట్టి, కాస్త ఒంగొని, వీపు మీద ఒక చెయి వుంచి కర్రనో, బెత్తాన్నో పట్టుకుని మెల్లిగానో, వేగంగానో నడుస్తూ పాత్రో చితమైన డైలాగ్స్‌తో నవ్వించడమో, ఉడుక్కునేలా చేయడమో చేసేది. రంగస్థల నటిగా వివిధ ప్రాంతాలకు ప్రదర్శనల నిమిత్తం వెళ్లడం వలన, సినిమా షూటింగ్‌లకు ఔట్ డోర్‌లకు వివిధ ప్రదేశాలకు తిరగడం ద్వారా ఆయా ప్రాంతాల యాసని, వేష భాషలను ఆకళింపు చేసుకొని అవసరమైనప్పుడు ఆయా పాత్రల ద్వారా అవి వెలికి వచ్చేలా చేసి తన ప్రత్యేకతను నిర్మల చూపేది.

స్వాతిముత్యం చిత్రంలో అంతర్ముఖుడుగా నటించిన కమల్‌హాసన్ అమ్మమ్మగా అన్నీ తానై చూసుకుంటూ తన అనంతరం ఆ వెర్రి బాగులోడిని ఎవరు చూస్తారా అని ఆరాటపడుతూ, రాధిక మెడలో పుస్తె కట్టాక, అప్పటివరకు అంతర్ముఖుడికి పుణ్యం, పాపం దేవుడు వంటివి వివరించిన తన అవసరం ఇక లేదని గ్రహించి, ఆనందంతో కళ్లు మూసే పాత్ర పోషించి ప్రేక్షకులను కొన్నిసార్లు నవ్వించి కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి చేసి ఇంతకంటే అద్భుతంగా ఎవరూ చేయలేరన్నంత భావన కలిగేలా చేసింది.

సీతారామరాజు చిత్రంలో కోట శ్రీనివాసరావు అమ్మమ్మగా హరికృష్ణ, నాగార్జున కుటుంబాలపై పగ, ద్వేషం పెంచుకొని కొన్నిసార్లు పాలిష్ట్‌గా, కొన్నిసార్లు ఉద్రేకపరిచేలా పల్నాటి నాగమ్మ తరహాలో వీర ముదుసలి పాత్రలో చేతిలో కర్రతో విలనిజం పండించింది.
గ్యాంగ్‌లీడర్ చిత్రంలో తన మనువడు చిరంజీవి చెప్పేవి వింటూ, ఫోటో ఫ్రేమ్‌లోంచి తన భర్తయే మాట్లాడుతున్నాడని తలచే మామ్మగా ఫొటోఫ్రేమ్‌లో చెప్పిన ప్రతి అంశం తు.చ. తప్పక పాటిస్తూ పొరపాటు జరిగితే లెంపలు వేసుకుంటూ హాస్యం, ఆర్ద్రత, ఆనందం వెల్లిబరిచేలా చేస్తూ ఇలాంటి అమ్మమ్మ వుంటే ఎంత బాగుంటుంది అని ప్రేక్షకులు అనుకునేలా కనిపించింది.

చినరాయుడు చిత్రంలో వెంకటేశ్ తల్లిగా పారపళ్లతో కనిపిస్తూ తన పారపళ్లను, చూసే మీ నాన్న మోహించాడు అనే భ్రమ అతనిలో కల్పిస్తూ ప్రేక్షకులను వినోదింపజేసింది. మాయలోడు చిత్రంలో రాజేంద్రప్రసాద్ బామ్మగా హాస్యాన్ని, భయాన్ని చూపించిన తీరు ప్రత్యేకమే. ఆ ఒక్కటీ ఆడక్కు చిత్రంలోనూ ఇలాంటి పాత్రతోనే మెప్పించింది.

దేవత చిత్రంలో పోకిరిగా వ్యవహరించే తన కొడుకు మోహన్‌బాబుని మంచివాడుగా మార్చా లని తాపత్రయపడేదానిగా, గొడ్డు గోదాలో చివరిది నువ్వు తీసుకుని ముందుది నాకివ్వు అని మోహన్‌బాబు అనగానే చూపిన రియాక్షన్ మరువలేం.
శ్రీదేవి, చంద్రమోహన్, మోహన్‌బాబు నటించిన పదహారేళ్ల వయసు చిత్రంలో గంగమ్మగా, మంత్రి గారి వియ్యంకుడులో అన్నపూర్ణమ్మగా, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్‌లో సుందరమ్మగా, కర్తవ్యంలో మహలక్ష్మిగా, కిల్లర్‌లో సుబ్బలక్ష్మిగా, మామగారులో కాంతమ్మగా, అమావాస్య చంద్రుడులో ఎల్.వి.ప్రసాద్ భార్యగా ప్రదర్శించిన నటన ఎప్పటికీ గుర్తుండిపోయేదే.
మావిచిగురులో కోదండరాముడు కొమ్మలాల వాడు కౌసల్య కొమరుడంట కొమ్మలాల పాటలో వృద్ధజంటగా అల్లురామలింగయ్యతో కలిసి చేసిన నటన చెప్పుకోదగ్గదే. గరుడ గర్వభంగంలో ఆ చిత్ర నృత్య దర్శకుడు తరువాత కాలంలో దేవదాసు, చిరంజీవులులాంటి చిత్రాల దర్శకుడు వేదాంతం రాఘవయ్యతో కలిసి చేసిన నృత్యం విశేషమైనదే.

పల్లెటూరు యాసతో, సిసలైన పల్లెటూరి స్త్రీగా, ఆ కట్టుబొట్టుతో మెప్పించడంలో నిర్మలకు సాటి రారెవరూ. నాజూగ్గా తిట్టడంలో, మొరటుగా తిట్టడంలో నూ ఆ పాత్రల ద్వారా మెప్పు పొందింది. తింగర సచ్చినోడా… నీయమ్మ కడుపు కాలా… వంటి తిట్లు నవ్వుకునేలా చేస్తాయి.
మయూరిలో ఉత్తమ సహాయ నటిగా, సీతారామరాజులో ‘ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డులు స్వీకరించింది.
శంకరాభరణంలో చంద్రమోహన్ బామ్మగా శంకరశాస్త్రి ఇంటికి పెళ్లిచూపుల నిమిత్తం వెళ్లినప్పుడు శంకరశాస్త్రి (జె.వి.సోమయాజులు)ని చూడగానే ప్రదర్శించిన గౌరవం,అభిమానం, వినయ విధేయతలు, అన్నవరం గుడివద్ద ప్రసాదం విషయంలో మనవడు చంద్రమోహన్‌తో, గుడి మెట్ల మీద మరో చెంబు ప్రహసనంకి ముందు వెనుక అద్భుత అభినయం చూపింది.
బలిపీఠం చిత్రంలో శోభన్‌బాబు సోదరిగా హరిజన యువతితో కనిపించిన విధానం, పలికించిన యాస, మరదలు శారదపై చూపిన ప్రేమ తదితరం మరపురానివే. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, రజని జంటగా, నూతన్ ప్రసాద్, అల్లురామలింగయ్య, రావికొండలరావు, పొట్టి ప్రసాద్ ప్రభృతులతో నిర్మల ఆర్ట్ పతాకాన చలాకి మొగుడు చాదస్తపు పెళ్లాం చిత్రాన్ని నిర్మించింది.
సూర్యకాంతం వలనే నిర్మలకు కూడా పేకాట అంటే ఇష్టం. షూటింగుల్లో కాస్త విరామం దొరికినా, ఔట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడూ కొత్త పేక దస్త్రాలు విరివిగా పట్టుకెళ్లేది. రైలులో కూడా కాలక్షేపం కోసం షూటింగ్ యూనిట్ వారిని చతుర్ముఖ పారాయణంలో పాల్గోనేలా చేసేది.

చేపల కూర బాగా వండుతుందనే పేరు వుండేది. ఆ కూర తినడానికే కొంతమంది ప్రత్యేకంగా ఆమె ఇంటికి వెళ్లేవాళ్లమనేవారు. పిండి మరకైనా విశ్రాంతి ఉంటుంది కానీ నా నోటికి తిండి విషయంలో విశ్రాంతి వుండదనేది. కులగోత్రాలు, దేవత, ఏకవీర, యమగోల, చిల్లరకొట్టు చిట్టెమ్మ, శివరంజని, పట్నం వచ్చిన పతివ్రతలు, శుభలేఖ, బాబాయి అబ్బాయి, నాకూ పెళ్లాం కావాలి, విశ్వనాథ నాయకుడు, ఖైదీ నెం.786, మగమహారాజు, వారసుడొచ్చాడు, శివ, బావబావమరిది, మాతృదేవోభవ, రాయుడు ఇలా ఎన్నో చిత్రాల్లో చక్కని నటన ప్రదర్శించింది. 2009న ఫిబ్రవరి 19న అనారోగ్యంతో మృతిచెందింది.