Home జాతీయ వార్తలు గంగానది ప్రక్షాళనకు నిధుల కొరత లేదు

గంగానది ప్రక్షాళనకు నిధుల కొరత లేదు

Nitin-Gadkariమీరట్ : గంగానది ప్రక్షాళనే కేంద్ర ప్రభుత్వం ప్రధాన కర్తవ్యమని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఆదివారం తెలిపారు. క్లీన్ గంగా మిషన్‌కు నిధుల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. గంగానది ప్రక్షాళన చేసే ప్రాజెక్టుకు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేశామన్నారు. ఈ ప్రాజెక్టు కింద గంగానది ఒడ్డున ఉన్న పర్యాటక కేంద్రాలను అభివృద్ధిపరిచి, సుమారు 10 లక్షల మంది యువకులకు ఆదాయ వనరులను కల్పిస్తామని కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. చౌదరీ చరణ్‌సింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసిన గంగానది సంరక్షణ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగానదిని పరిశుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వం వల్ల కాదని, అందరూ గంగానది ప్రక్షాళనకు తోడ్పాటును అందించాలని అన్నారు. నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు రూ.20 వేల కోట్లు వెచ్చిస్తున్నామని అన్నారు. కానీ దానిని పరిశుభ్రంగా ఉంచేందుకు సమాజం ముందుకు రావాలని కోరారు. గంగానదిని ప్రక్షాళన చేసేందుకు సుప్రీంకోర్టు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు తమ సహకారాన్ని అందిస్తున్నారని అన్నారు. గంగా ప్రక్షాళనకు కేంద్ర నీటివనరుల మంత్రి ఉమా భారతి నడుం బిగించారని అన్నారు. నదిని కాలుష్య రహితంగా చేసేందుకు ఆమె జీవితానికి సార్థకత లభిస్తుందని అన్నారు.