Home కామారెడ్డి నిజాం సాగర్ నిర్మాణం ఓ ప్రజాఉద్యమం

నిజాం సాగర్ నిర్మాణం ఓ ప్రజాఉద్యమం

Nizam-Sagar

నిజాం రాజుల దార్శినికత, పరిపాలనా దక్షతకు తరతరాలకు చెదరనిసాక్షంగా నిజాం సాగర్ నిలిచింది. ఆయకట్టు రైతుల భాగస్వామ్యం తో ప్రజా ఉద్యమంలా పది సంవత్సరాలు నిర్మించిన నిజాం సాగర్ తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసింది. నిజాం సాగర్ నిర్మాణం అనంతరం నిజామాబాద్ జిల్లా రూపురేఖలు మారిపోయాయి. వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నిజాం రాజులు ఏర్పాటు చేసి ప్రజలకు ఆర్థిక పరిపుష్టి కల్పించారు. నిజాం సాగర్ నీటిని ఆధారంగా చేసుకుని 15వేల ఎకరాల భూమిలో చెరుకు పంటవేసి చక్కెర పరిశ్రమ స్థాపించిన కీర్తి నిజాం రాజులకే దక్కుతుంది. ఈ ఫ్యాక్టరీలో ఆనాడు మూడువేల టన్నుల క్రషింగ్ సామర్థం ఉండేది. సంవత్సరానికి ఏడు లక్షల టన్నులు ఉత్పత్తి చేసేవారు. అయితే ఉమ్మడిపాలనలో ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసి నిజాంసాగర్ సహజత్వానికి గండికొట్టారు. ఫలితంగా నీటి చుక్కల కోసం విలవిలలాడిన నిజాంసాగర్ తెలంగాణ ఆవిర్భావం అనంతరం పూర్వ వైభవాన్ని పుణికి పుచ్చుకుంటుంది. ఇదిలాఉండగా నిజాం సాగర్ నిర్మాణం ఓ చారిత్రక సంఘటన.

ఆనాటి నిజాం రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని మంజీరానదిపై అచ్చంపేట గ్రామం దగ్గర నిర్మించారు. హైదరాబాద్ సంస్థానంలో మంజీరా నది అంతర్రాష్ట్ర నది కాదు. మంజీరా నది పరివాహక ప్రాంతాలు కర్నాటక, మరాట్వాడ హైదరాబాద్ రాజ్యంలో అంతర్భాగాలు. ఆనాటి నిజాం రాజు మంజీరా నదీ జలాలను వీలైనంత ఎక్కువగా వినియోగించేందుకు రూపొందించిన నిర్మాణం ఇది. 1923 సెప్టెంబర్ 19న ప్రాజెక్టుకు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలనా అనుమతులను మంజూరు చేశారు. చీఫ్ ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రాజెక్టు 1923 సెప్టెంబర్‌లో ప్రారంభమై 1933లో పూర్తి అయింది. డ్యాం నిర్మాణం, కాలువల నిర్మాణం ఏక కాలంలో నిర్మించి ఆనాటి ఇంజనీర్లు తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు.

అయితే డ్యాం నిర్మాణ పనులు 1930లో పూర్తిచేసి 60మైళ్ళ ప్రధాన కాలువ పనులు 1933నాటికి పూర్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఆయకట్టు రైతులు సొంత పనుల కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్మించారు. రాళ్ళు, ఇసుక, ఇనుము ఇతర సామాగ్రిని తరలించేందుకు రైతులు ఎడ్లబండ్లను వాడారు. అవకాశాలు ఉన్నా ఆనాటి ఆధునిక యంత్రాలను ఉపయోగించకుండా పూర్తిగా రైతులు శరీరక శ్రమతో నిర్మించిన ప్రాజెక్టు నిజాం సాగర్, నిర్మాణ సామాగ్రిని తరలించేందుకు ప్రధాన ఇంజనీర్ అలీనవాజ్ జంగ్ మానవశ్రమనే నమ్ముకుని విజయవంతంగా నిర్మించగలిగారు.

యంత్రాలకు అయ్యే ఖర్చు పనులకోసం, నిర్మాణంలో పాల్గొన్న రైతులకు సౌకర్యాలు కల్పించేందుకు ఖర్చు చేశారు. నిర్మాణం జరిగినప్పుడు నిజాంసాగర్ నీటి సామర్థం 29.70టి.ఎం.సిలు, రాతి డ్యాం పొడుగు 1.100 అడుగులు, జలాశయం విస్తీర్ణం 50 చదరపు మైళ్లు, సిల్ఫ్ వే గేట్ల సంఖ్య 28 కాగా ఆయకట్టు 2.75లక్షల ఎకరాలు, ప్రధాన కాలువ పొడవు 72.50మైళ్ళు అయితే నిజాం రాజ్యం భారతదేశంలో విలీనం కావడం, సమైక్య పాలకులు అధికారం చెలాయించడంతో 29.70టిఎంసిల నీటిసామర్థం ఉన్న నిజాంసాగర్ 17 టి.ఎంసి లకు పడిపోయింది. అలాగే ఎగువన సింగూరు డ్యాం ఆ పైన మహారాష్ట్రలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరగడంలో నిజాంసాగర్ సమైఖ్య పాలనలో నీటి చుక్కలకోసం తల్లడిల్లింది. సాగుభూములు ఎడారులుగా మారాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం నిజాంసాగర్ పూర్వవైభవాన్ని పునర్ ప్రతిష్టించేందుకు చేస్తున్న కృషి ఫలితాలను ఇస్తోంది. ఆనాడు యంత్రాల సహాయం లేకుండా తెలంగాణ ప్రజలు ఉద్యమంలా కదిలి నిర్మించుకున్న నిజాంసాగర్‌ను నేడు ప్రభుత్వం పునరుద్ధరణకోసం చేస్తున్న కృషికి ప్రజలు పునరంకితమై జలవనరులను పరిరక్షించుకుంటారని ఆశిద్దాం.

వి. భూమేశ్వర్