Home ఎడిటోరియల్ ద్రవిడ రాజకీయాలకు పరీక్ష

ద్రవిడ రాజకీయాలకు పరీక్ష

No answer in the near future

ఎనిమిది మాసాల తేడాతో జె. జయలలిత, ఎం. కరుణానిధి మరణంతో తమిళనాడు రాజకీయాల్లో నాస్తిక, హిందూ వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక, హిందీ వ్యతిరేక ద్రవిడియన్ అధ్యాయం ముగిసినట్లేనా? సందేహాలున్నా ఇది సమీప భవిష్యత్‌లో సమాధానం దొరకని ప్రశ్న. ఉవ్వెత్తున ఎగిసిపడిన ద్రవిడ ఉద్యమ పర్యవసానంగా 1967 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె విజయం ఆ రాష్ట్ర విలక్షణ స్వభావానికి అద్దంపట్టింది. 1957లో కేరళలో కమ్యూనిస్టుల చేతిలో ఓటమి అనంతరం కాంగ్రెస్‌కు ఇది రెండవ పరాజయం. ఆ సంవత్సరం ఆరేడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. తమిళనాడులో అత్యంత ప్రభావశాలి అయిన కాంగ్రెస్ నాయకుడు కె.కామరాజ్ డిఎంకెకు విధేయమైన విద్యార్థి సంఘం నాయకుడి చేతిలో ఓటమి పొందారు. డిఎంకె ఉద్ధానం కాంగ్రెస్ పతనం ఆరంభంతో ముడిపడింది. నాటి నుంచి తమిళనాడులో కాంగ్రెస్ కోలుకోలేదు. తమిళనాడు ప్రత్యేకత కన్నుమూసిన ద్రవిడ నేతల అంతిమ సంస్కారంలోనూ చూడవచ్చు. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా సి.ఎన్. అన్నాదురై, ఎం.జి. రామచంద్రన్, జయలలిత, కరుణానిధి భౌతిక కాయాలను మెరీనా బీచ్ ఒడ్డున ఖననం చేశారు. డిఎంకె హైకోర్టు తలుపుతట్టి మరీ మెరీనాలో కరుణానిధి ఖనన హక్కు తెచ్చుకుంది.

1972లో డిఎంకెలో చీలిక తదుపరి ఎం.జి రామచంద్రన్‌ను, ఆ తదుపరి జయలలిత (ఎఐఎడిఎంకె)ను ఎదుర్కొనేందుకు కరుణానిధి నాయకత్వంలో డిఎంకె జాతీయ రాజకీయాల్లో విపిసింగ్ నేషనల్ ఫ్రంట్‌తో, ప్రతిపక్ష యునైటెడ్ ఫ్రంట్‌తో, వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఎతో, మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఎతో అధికారంలో భాగం పంచుకున్నప్పటికీ కరుణానిధి ఎన్నడూ, ద్రవిడ ఉద్యమ మూలలను విడిచిపెట్టలేదు. అయితే కాలక్రమంలో ఉత్తరాది వ్యతిరేకతను, 1960 దశకంలో నినదించిన వేర్పాటు మనోభావాలను సడలించుకున్నారు. శ్రీలంక తమిళుల ఉద్యమంతో సంఘీభావాన్ని వీడలేదు. అయితే తమిళభాష, సంస్కృతి, నాస్తికవాదం, బ్రాహ్మణ వ్యతిరేకత విషయాల్లో రాజీపడలేదు. డిఎంకె దృక్పథానికి కీలకమైన ఈ విలక్షణ స్వభావాన్ని కరుణానిధి కుమారులు ఎం.కె. స్టాలిన్, ఎం.కె. అళగిరి ఎంతవరకు, ఎంతకాలం నిలబెట్టగలరనేది వేచిచూడాల్సిన అంశం. వారిద్దరిలో రాజకీయ వారసత్వాన్ని స్టాలిన్‌కు అప్పగించారు కరుణానిధి. అయితే అళగిరి అసంతృప్తి బహిరంగ రహస్యం. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా స్టాలిన్ చెన్నయ్ నుంచి పార్టీ వ్యవస్థాగత నిర్మాణం, శాసన సభ కార్యకలాపాలు నిర్వర్తిస్తుండగా, అళగిరి మధురై నుంచి అసమ్మతి రాజకీయం సాగిస్తున్నారు. కరుణానిధి వంటి శిఖరాయమాన వ్యక్తి ఇకలేని పరిస్థితుల్లో పార్టీ ప్రయోజనాలు మిన్నగా కుటుంబ రాజకీయాల్లో సర్దుబాటు, సమన్వయంతో ముందుకు వెళతారా లేక తెగేదాకా లాక్కుంటారా అనేది వేచిచూడవలసిన మరో అంశం.

ద్రవిడ రాజకీయాల్లో మరోభాగం ఎఐఎడిఎంకె పేరుతో ప్రస్తుతం అధికారంలో ఉంది. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిననాటి నుంచీ బిజెపి ఈ భాగంతో సయోధ్య చేయటం, ఇపిఎస్, ఒపిఎస్ గ్రూపులను ఐక్య చేయటం తెలిసిందే. హిందూ వ్యతిరేక, హిందీ వ్యతిరేక ద్రవిడ వారసత్వం కలిగిన ఎఐఎడిఎంకె, హిందూత్వ దుందుడుకుతనం మూర్తీభవించిన బిజెపితో సఖ్యత రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ట. ద్రవిడ ఉద్యమ ఛాంపియన్‌గా డిఎంకె ముందుకెళితే కరుణానిధిపట్ల సానుభూతి దానికి వరమవుతుంది. బిజెపితో ఎఐఎడిఎంకె సర్దుబాటు దానికి శాపమవుతుంది. మూడున్నర సంవత్సరాల వ్యవధి ఉన్న అసెంబ్లీ ఎన్నికల దాకా ఆగవలసిన పని లేదు. వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలే ఇందుకు తొలి పరీక్ష అవుతాయి. బిజెపి ఆకాంక్షిస్తున్నట్లు, రాజకీయవర్గాలు చర్చిస్తున్నట్లు సినీరంగ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం చేసినా నేటి పరిస్థితుల్లో అది బిజెపికి సహాయపడటం అనుమానమే. ఎఐఎడిఎంకె బలహీనపడిన మేరకు అది డిఎంకెకి లాభిస్తుంది. అయితే డిఎంకె ఐక్యత, పురోభివృద్ధి స్టాలిన్ నాయకత్వ దక్షతపై ఆధారపడి ఉంటుంది.

అందువల్ల, జయలలిత, కరుణానిధి మరణానంతరం తమిళనాడు రాజకీయాలు కల్లోలభరితం. ప్రస్తుతానికి ద్రవిడ ఉద్యమ భావజాలానిదే పైచేయి. డిఎంకె, ఎఐఎడిఎంకెల్లో ఏ పార్టీ దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లగలదో అదే వాటి భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి ఇ.పళనిస్వామికి అటువంటి సమర్థత, రాజకీయ చాతుర్యం ఉన్నట్లు లేదు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులకే మెరీనా బీచ్‌లో అంత్యక్రియలంటూ అక్కడ కరుణానిధి ఖననాన్ని నిరాకరించి ఎదురుదెబ్బతిన్నారు. కోర్టు ద్వారా సాధించుకున్న స్టాలిన్‌కిది తొలి విజయం.