Home రాష్ట్ర వార్తలు మొక్క పోయింది

మొక్క పోయింది

సంరక్షణ కరువై హరితహారం మొక్కల్లో సగం చచ్చిపోయాయి

జిల్లాల నుంచి మన తెలంగాణ ప్రతినిధులు
missionరాష్ట్రంలో 25.16 శాతంగా ఉన్న అడవులను 33 శాతానికి పెంచే సదాశయంతో ‘హరితహారం’ పేరిట ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నాటిన మొక్కలు క్షేత్రస్థాయిలో ఎండిపోతున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా రాష్ట్ర ప్రముఖు లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో మొక్కలను నాటారు. వాటి పరిరక్షణలో ఉద్యమం నాటి శ్రద్ధ కరువైంది. కలె క్టర్ల సమావేశంలో హరితహారం లక్ష్యాన్ని, చెట్ల సంరక్షణపై ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలను కూడా జారీ చేశారు. సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలు వివరించారు. గ్రామ పంచాయతీల వారీ గా సర్పంచ్‌ల అధ్యక్షతన హరిత కమిటీలను కూ డా వేశారు. విజయవంతంగా హరితహారాన్ని నిర్వహించిన వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. అయినా ఇవేవి పూర్తిస్థాయిలో అధికార యంత్రాగాన్ని కదిలించలేకపోయాయి. అంతేకాదు ప్రభుత్వ ప్రకటిత ప్రముఖ పథకాల లో ఇది భాగమైనందున హరితహారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన 13 మందితో రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని నియమించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో దాని నిర్వహణ, మొక్కల పరిరక్ష ణకు పర్యవేక్షణ, సమన్వయ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. హరితహారం పథకాన్ని మూడు సంవత్సరాల పాటు దాదాపు రూ. 2 వేల కోట్ల వ్యయంతో పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలంకు మూడో ఏడాది పూర్తవుతుంది. ఆశించన ప్రయోజనం ఏ మేరకు పూర్తవుతుందో ఎదిరి చూడాలి. రాష్ట్రవ్యాప్తంగా 2015 నుంచి మూడేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 2015లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 15 కోట్ల మొక్కలను మాత్రమే నాటామని చెప్పారు. 2016లో వర్షాలు అనుకూలించడంతో దాదాపు 32 కోట్ల మొక్కలను నాటినట్లు అధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీటిలో 16.64 కోట్ల మొక్కలకు జియో ట్యాగింగ్ చేయగా, 17.96 కోట్ల మొక్కల ఫోటోలు అటవీ శాఖ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిని బట్టి నాటిన మొక్కలలో 50 శాతాన్ని మాత్రమే సంరక్షించగలిగినట్లు స్పష్టమౌతోంది. ఈ ఏడాది 46 కోట్ల మొక్కలను నాటాలని లక్షంగా నిర్ణయించారు. ఇందుకు అటవీశాఖతో పాటు వ్యవసాయ, ఉద్యాన, గిరిజన సంక్షేమ శాఖలు ప్రత్యేకంగా నర్సరీలలో పెద్ద ఎత్తున మొక్కలను పెంచుతున్నారు. ఇప్పుడున్న నర్సరీల 3699 నుంచి 4100కు పెంచారు. జిల్లాల వారీగా హరిత హారంలో నాటిన మొక్కలు, వాటి సంరక్షణ వివరాలు : రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగంణంలో హరితహారం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా 2015 జూలై 3వ తేదిన సిఎం కె. చంద్రశేఖర్‌రావు మొక్కలు నాటారు. సిఎం నాటిన మొక్కలను ఆలయ పూజరులు, భక్తులు శ్రద్దతో సంరంక్షించారు. అయితే అదే రోజున చిల్కూరు దేవాలయం నుంచి హిమాయత్‌సాగర్ వరకు నాటిన మొక్కలలో సగం ఎప్పుడో ఎండిపోయాయి. అలాగే కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం, పెద్దపల్లిలోని ఐటిఐ ప్రాంగణంలో సిఎం నాటిన మొక్కను సంరక్షించే నాధులు లేరు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2016లో 2.34 కోట్ల మొక్కల లక్షం కాగా కోటి మొక్కలు కూడా నాటలేదు. దీనిలో 10వ వంతును కూడా సంరక్షించలేదు. మహబూబ్‌నగర్ నగర్ జిల్లాలో మంత్రులు, ఎంఎల్‌ఎలు, అధికార యంత్రాంగం మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో జిల్లాలో ఎటూ చూసిన చక్కని చెట్లతో హరితవనాన్ని తలపిస్తోంది. రోడ్ల వెంట, పాఠశాలల్లో, అడవుల్లో వేసిన మొక్కలు ఆకర్షణీయంగా పెరిగాయి.
నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో హరితహారంలో నాటిన మొక్కలు చక్కగా పెరిగాయి. మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా కానిస్టేబుల్ శ్రావన్ కుమార్‌కు ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించడంతో మొక్కలు చాలా వరకు బతికాయి. ఇతర ప్రాంతాలలో మొత్తంగా 4.32 కోట్లు మొక్కలు నాటితే ఇప్పటి వరకు 1.25 కోట్ల మొక్కలు కనిపించకుండా పోయాయి. సుమారు 11.20 లక్షల మొక్కలకు సరైన సౌకర్యాలు, నీరు లేకపోవడంతో పూర్తిగా ఎండి పోయాయి. ఈ మొక్కలను బతికించేందుకు ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేశారు. మూడో ధఫా కార్యక్రమం కింద వచ్చే నెల జూన్ 2న మరో 3.20 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది జూన్, జూలై నెలల్లో మెదక్ ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లలో ఖాళీగా ఉన్న స్థలాల్లో విరివిగా మొక్కలు నాటారు. సంగారెడ్డిలో జిల్లాలో 1.3 కోట్లు, మెదక్‌లో 84 లక్షలు, సిద్దిపేటలో 96 లక్షలను నాటారు. కిందిస్థాయిలో నిర్లక్షం కారణంగా నాటిన మొక్కలన్నీ ఎండిపోయి ఎప్పటిలాగే ఖాళీ ప్రదేశాలుగా మారాయి. మరికొన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటినా వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేయకపోవడంతో నాటిన మొక్కలు పశువులకు మేతగా మారింది. వచ్చే నెల జూన్ నుంచి చేపట్టనున్న హరితహారం కార్యక్రమం కింద సంగారెడ్డి జిల్లాలో కోటి పది లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్షంగా పెట్టుకున్నారు. కరీంనగర్‌లో మొదటి, రెండు దశల్లో ఈ జిల్లాలో నాటిన మొక్కలు రికార్డులో తప్ప క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న చామనపల్లి గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటల రాజేందర్ స్వయంగా నాటించిన రెండు నుండి మూడువేల మొక్కలు అతీగతీ లేకుండా పోయాయి. మొత్తం నాటిన మొక్కల్లో కనీసం 10 శాతం కూడా జీవించి లేవని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఖరాఖండిగా చెప్పారు. 2015-16 లో కరీంనగర్ జిల్లాలోని 139 నర్సరీల్లో 1.31 కోట్ల లక్షల మొక్కలు పెంచగా అందులో 60.53 లక్షల మొక్కలను మాత్రమే పంపిణీ చేశారు. 2016 -17లో 67 నర్సరీలలో 93 లక్షల మొక్కలను పెంచగా అందులో 74.50 లక్షల మొక్కలు మాత్రమే నాటారు. నల్లగొండ జిల్లాలో నాటిన మొక్కల్లో 30 శాతం వృథా అయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత ఏడాది 4.80 కోట్ల మొక్కల పంపిణీ లక్షంగా ఉంటే మూడు కోట్ల మొక్కలను మాత్రమే పంపిణీ చేశారు. లక్షల సంఖ్యలో మొక్కలు నర్సరీలో పెంచుతున్నట్లు ప్రకటించడమే తప్ప ఆచరణలో కానరాలేదు. సూర్యాపేట జిల్లాలో 91 లక్షల మొక్కలు నాటగా, 21 లక్షల మొక్కలు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిలో చౌటుప్పల్ పరిసరాలలో మాత్రం నాటిన మొక్కలపై శ్రద్ధ కనిపిస్తుంది.
హైదరాబాద్ మహా నగరంలో ప్రభుత్వ రంగ సంస్థలు హారితహారాన్ని విస్మరించాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 లక్షల మొక్కలు నాటగా అవి ఎక్కడ ఉన్నాయనేది అధికారులకే తెలియడం లేదు. హెచ్‌ఎండిఎ పరిధిలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో ఒఆర్‌ఆర్ పరిధిలో పచ్చదనం కల్లకు కడుతోంది. ఉప్పల్ భగాయత్‌లో మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాటిన 50 లక్షల మొక్కలో సగం కూడా బతకలేదు. ఖమ్మం జిల్లాలో 3.77 కోట్ల మొక్కలను నాటితే దానిలో మూడో వంతు కూడా బతకలేదు. బతికిన మొక్కల్లో వేసవి కాలంలో నీరు లేక సగానికిపైగా ఎండిపోయాయి. మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, అధికారులు దత్తత తీసుకుని ఆర్భాటంగా మొక్కలను నాటిన తర్వాత వాటిని కనీసం తొంగికూడా చూడలేదు. ఈ సంవత్సరం 4.90 కోట్ల మొక్కలను నాటాలని లక్షంగా పెట్టుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నాటిన సగం మొక్కలు మాత్రమే సంరక్షించబడ్డాయి. ప్రస్తుత ఏడాదికి సంబంధించిన 22 మండలాల్లో 124 నర్సరీలో దాదాపు 4 లక్షలకు పైగా మొక్కలను పెంచుతున్నారు.
జనగామ జిల్లా పరిధిలో 63 లక్షల మొక్కలు లక్షంగా పెట్టుకోగా కేవలం 36 లక్షల 81 వేయ్యి మొక్కలు మాత్రమే నాటారు. నర్సంపేట పట్టణంలో నెక్కొండ రోడ్ గ్రీన్‌లాండ్‌లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నాటిన మొక్కలు ఎండిపోయాయి. గత రెండు సంవత్సరాల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు ఆరున్నర కోట్లకు పైగా మొక్కలు నాటారు. మొక్కలు నాటిన తర్వాత అటువైపు కన్నెత్తి చూసే వారు కరువవడంతో అవి ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల మొక్కల చుట్టూ ఏర్పాటు చేసిన ట్రీగార్డులను సైతం ఎత్తుకుపోయారు. మరికొన్ని చోట్ల మొక్కలు పశువుల పాలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత హరితహారం కార్యక్రమంలో 18 లక్షల మొక్కలు నాటాలని లక్షంగా పెట్టుకున్నప్పటికి సకాలంలో వర్షాలు లేక నర్సరీల్లోని మొక్కలు ఎండిపోవడంతో నిర్దేశించుకున్న లక్షంలో 20 శాతం మొక్కలను కూడా నాటలేకపోయారు. రెండవ విడత హరితహారంలో 24.68 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించగా అందులో సగానికి పైగా మొక్కలు ఎండిపోయాయని అధికారిక రికార్డులే వెల్లడిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత సంవత్సరం హరితహారం పథకం క్రింద నాటిన మొక్కల్లో 55 శాతం మాత్రమే మిగిలాయి. మిగిలిన మొక్కలు ఎండిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని 13 మండలాల్లో గత సంవత్సరం 28,68,654 మొక్కలు నాటగా అందులో 15,763,23 మొక్కలు మాత్రం (55 శాతం) బ్రతికాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 27,27,146 మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తిచేశారు. ఇందుకోసం రూ.7.51 కోట్లు చెల్లించినట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి.