Home ఎడిటోరియల్ హాలికుల ఆత్మహత్యలు

హాలికుల ఆత్మహత్యలు

farmerమన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా రైతులు వరి పండిస్తారు. వరి తర్వాత రెండవ వరుసలో మిర్చి పంటను ఎక్కువగా పండిస్తారు. గత కొన్నేళ్ళుగా మిర్చిని ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ముందు వరుసలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, రాజకీయ నాయకులు మారినా రైతుల పరిస్థితిలో, రైతులు ఏటా చేసుకునే ఆత్మహత్యల్లో ఎలాంటి మార్పు లేదు.
రైతు పంటవేయడానికి ఉపయోగించే విత్తనాలు దగ్గరి నుండి, ఆ పంట చేతికొచ్చే వరకు ఆ పంటకు వాడే పురుగు మందులు, బలం మందులు, ఆఖరుకు నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల కూలీలకు కూలీరేట్లు కూడా రోజురోజూ పెరుగుతూ వస్తున్నాయి. కాని పంటకు సరైన మద్దతు ధర లేక, కనీసం పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. ఏడాది పొడవునా కష్టం చేసి, భూమిలేని రైతు కౌలుకు తీసుకుని ముందుకు ముందే అప్పులు తెచ్చి కౌలు డబ్బులు చెల్లించి, భార్య ఒంటిమీద ఉన్న నగలు బ్యాంకుల్లో తాకట్టుపెట్టి వ్యవసాయం చేస్తారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చ లేక, తాను బ్రతికుండి చేసేదేంలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా అన్ని వర్గాల వారితో పాటుగా రైతులకు కూడా ఎన్నో వరాల జల్లులు కురిపిస్తాయి. కానీ వాటివల్ల రైతులకు ఒరిగిందేమీ ఉండదు.
ప్రభుత్వాలు ఐదు సం॥లకు ఒకసారి ఉద్యోగులకు పిఆర్‌సి పెంచినట్లు, రైతులు పండించే ధాన్యానికి(వరి, మిర్చి, ప్రత్తి మొ॥) ఆ సంవత్సరం పురుగు మందుల ధరలు, కూలీలరేట్లు చూసి ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించాలి. లేకపోతే ఇలాగే రైతుల ఆత్మహత్యలు కొనసాగితే చరిత్రలో ఒకప్పడు రైతులు ఫలానా పంటలు పండించేవారని చదువుకోవాల్సి వస్తుంది. పంటలు పండకపోతే మానవ మనుగడే అస్తవ్యస్థ మవుతుంది.

– శ్రీనివాస్ పనతాల