Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఆఫీసు పనిలో భావోద్వేగాలు వద్దు

Publicity with Digital Marketing

కొంతమందికి ఆఫీసులో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు గుర్తుకువచ్చి ఆఫీసు పనికి అడ్డంకిగా మారతాయి. పనిచేసే చోట సమస్యలు గుర్తుకు వస్తే చేసే పని నాణ్యత తగ్గిపోతుంది. ప్రతిరోజూ చేసినంతగా ఆ రోజు ఉత్సాహంగా పూర్తి చేయలేరు. పనిలో వెనుకబడితే ఉద్యోగం కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. అలాగని సమస్యలను అణిచివేయడం అంత మంచిది కాదని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ ప్రభావం మన పనిమీద పడకుండా వాటిని అధిగమించి ఆఫీసు వర్క్‌ను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. మన రోజువారి పని ఏ అడ్డంకులు లేకుండా కొన్ని వ్యూహాల అమలుతో చేసుకోవచ్చని అంటున్నారు. అవేంటో చూద్దాం..

కంపార్ట్‌మెంటల్: వ్యక్తిగత సమస్యలు గురించి ఆఫీసులో ఉండగా ఆలోచించకూడదు. తరువాత సమయం ఉన్నప్పుడు వాటిని పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి మీరు ఆఫీసుకి బయలుదేరేముందు మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు వస్తే దాని గురించి ఆలోచించకుండా ఆఫీసుకి ఎలా వెళ్లాలో ఆలోచించండి. ఆ సమస్య పరిష్కారానికి తరువాత సమయం కేటాయించుకోండి. లేకుంటే ఆరోజంతా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతారు. మనసంతా గజిబిజిగా ఉంటుంది.

అంకెలు లెక్కబెట్టండి: మీరు పనిలో నిగ్రహం కోల్పోకుండా సక్రమంగా చేయడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగిస్తుంది. ఆలోచనలు ఎక్కువగా వచ్చి పనికి అడ్డం అనిపించినపుడు పది అంకెలు లెక్కబెట్టి చూడండి. అవకాశం ఉన్నట్లయితే కాసేపు అలా బయటికివెళ్లి తిరిగి వస్తే మళ్లీ పని మీద దృష్టిపెట్టగలగుతారు.

ముందు ఆలోచించుకోండి: మీరు ప్రతిస్పందించడానికి ముందు కొంచెంసేపు ఆలోచించండి. మీ సమస్యలను ఎదుటివారికి స్పష్టంగా తెలియజేయటానికి ప్రయత్నించండి. దీంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అపార్థాలు, దుర్వినియోగాలు లేకుండా చేసే పనిని మనస్ఫూర్తిగా చేయండి.

అడ్డంకుల్ని అధిగమించాలి: మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసే వాటిని గమనించండి. వాటిని అధిగమించి ప్రశాంతంగా మీ పనులు చేసుకోవడానికి ఆలోచనలు చేయాలి. ఈ రకంగా అవతలివారి చర్యలను కూడా గమనించవచ్చు. ఆఫీసులో ఉండే సమస్యలను ఇంటికి మోసుకెళ్లకూడదు. వ్యక్తిగతంగా మన భావోద్వేగాలను తెలుసుకుని వాటిని పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. ఆఫీసు సమస్యలను ఇంటి బయటే వదిలివేయాలి.

Comments

comments