Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

పాక్‌కు యుద్ధ విమానాల్లేవ్!

aircraftవాషింగ్టన్ : అమెరికా నుంచి 8 ఎఫ్-16 యుద్ధ విమానాల కొనుగోలు చేయాలనుకున్న పాక్ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. ఈ ఒప్పందం కోసం తాము ఆర్థిక సాయం చేయడం కుదరదని, సొంత డబ్బుతోనే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాల్సిందేనని అమెరికా తేల్చి చెప్పింది. పాక్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలన్న తమ నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 11న అమెరికా కాంగ్రెస్‌కు తెలిపింది. ఈ ఒప్పందం విలువ 70 కోట్ల డాలర్లుగా ఉంది. మొదట అనుకున్న ప్రకారం ఇందులో 27 కోట్ల డాలర్లను పాక్ చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని అమెరికా ప్రభుత్వం ఆర్థిక సాయం రూపంలో అందిస్తుంది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపినప్పటికీ, శక్తివంతమైన సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ బాబ్ కార్కర్ నేతృత్వంలోని అగ్రశ్రేణి సెనేటర్లు అడ్డుకట్ట వేశారు. ఉగ్రవాద ముఠాపై , ముఖ్యంగా హక్కానీ నెట్‌వర్క్‌పై పాక్ గట్టి చర్యలు తీసుకోవడం లేదని , ఈ క్రమంలోనే ఆ దేశానికి యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి అమెరికా ప్రభుత్వం నిధులు ఉపయోగించడాన్ని తాము సమ్మతించబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సొంత నిధులతోనే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని పాక్‌కు అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. ఎఫ్-16 యుద్ధ విమానాల కొనుగోలుకు అమెరికా ఇచ్చిన ఆఫర్‌పై స్పందించడానికి పాక్‌కు ఈనెలాఖరు వరకూ గడువు ఉంది. జాప్యం చేస్తే ధర మరింత పెరుగుతుంది. ఈ విషయంపై పాక్ ప్రధానికి విదేశాంగ వ్యవహారాల సలహాదారుగా ఉన్న సర్తాజ్ అజీజ్ స్పందించారు.అమెరికా నిధులు సమకూర్చకుంటే, ఇతర దేశాల నుంచి ఎఫ్-16 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Comments

comments