Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఉగ్రవాదం ఆగకపోతే కటీఫ్..

Aston-Cartorపాకిస్థాన్‌కు అమెరికా హెచ్చరిక
వాషింగ్టన్ : ఉగ్రవాదం ఆటకట్టుపైనే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉన్నాయని అమెరికా స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్వర్గధామాలు ఇప్పటికీ కొనసాగడం , వాటిపై చర్యలకు పాకిస్థాన్ అశక్తత, అనాసక్తి ప్రదర్శించడం చివరికి ఆ దేశంతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని, భద్రతా సహకారంపై కూడా పునరాలోచించుకోవల్సి ఉంటుందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ తెలిపింది. పాకిస్థాన్ ఎట్టి పరిస్థితులలోనూ ఉగ్రవాదానికి ఆలవాలం కాకూడదు. ఈ విషయంలో ఎలాంటి రాజీకి దిగినా అది అమెరికాతో ఇప్పుడున్న కీలక రక్షణ, భద్రతా సహకార ధోరణిపై ప్రభావం చూపుతుందని పెంటగాన్ తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితిపై అమెరికా పార్లమెంట్‌కు పెంటగాన్ పంపించిన అర్థ సంవత్సర నివేదికలో పాకిస్థాన్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. భద్రతా వాతావరణాన్ని సరిదిద్దుకోవడం అనేది కీలమైన విషయం అని పాకిస్థాన్ గుర్తుంచుకోవాలని, ఉగ్రవాదులు, తీవ్రవాదులకు తమ భూభాగాన్ని ఆశ్రయంగా మలచడం నిలిపివేయాల్సి ఉందని అమెరికా తెలిపింది. పాకిస్థాన్‌కు ప్రస్తుతం అనేక స్థాయిలలో భద్రతా సహకారం అంది స్తోంది. ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించే ప్రక్రియలో సరైన రీతిలో స్పందించకపోతే ద్వైపాక్షిక సంబంధాలు బెడిసికొట్టేందుకు కూడా అవకాశం ఉంటుందని పెంటగాన్ సంకేతాలు ఇచ్చింది.
పాకిస్థాన్‌లో హక్కానీ నెట్‌వర్క్‌పై అక్కడి అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి అస్టన్ కార్టర్ తెలియచేయడంతో పెంటగాన్ వర్గాలు పాకిస్థాన్ ప్రస్తుత 30 కోట్ల డాలర్ల సంకీర్ణ సహాయ నిధిని నిలిపివేసింది. పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులు ఇప్పటికీ వివిధ ఉగ్రవాద సంస్థలకు నిలయంగా మారడం, అక్కడ అన్ని విధాలుగా ఉగ్రవాద శిక్షణా కార్యకలాపాలు సాగడం, ఉగ్రవాదులు యధేచ్ఛగా సంచరించడం వంటి పరిణామాలపై పాకిస్థాన్ నిర్లిప్త వైఖరిని అమెరికా తీవ్రస్థాయిలోతప్పుపట్టింది. ఈ ధోరణి మానకపోతే తగు ఫలితం ఉంటుందని కూడా హెచ్చరించింది.

Comments

comments