Home ఆదిలాబాద్ ఆధునిక వైద్యం అందనంత దూరం

ఆధునిక వైద్యం అందనంత దూరం

జిల్లాలో ఇప్పటికీ మెరుగైన వైద్య సేవలు కరువు
అరకొర వైద్యంతో హరిస్తున్న రోగుల ప్రాణాలు
నీటి మూటలవుతున్న సర్కారు హామీలు

adilabad3ఆదిలాబాద్ : హెటెక్ యుగంగా చెప్పుకుంటున్న ఈ కాలంలో కూడా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనంత దూరంలోనే ఉండడం పాలకులు నిర్లక్షానికి నిదర్శనంగా చెబుతున్నారు. జిల్లాలో ప్రజలు మానసిక, శారీరక రుగ్మతలతో గత కొనేళ్ల నుండి వరుసగా ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ఆ దిశగా వైద్య ఆరోగ్య శాఖ సరైన దృష్టి సారించలేదన్న విమర్శలు ఉన్నాయి. మొన్నటి వరకు గిరిజన ప్రాంతాల్లో రక్త హీనత కారణంగా డయేరియా తదితర అంటు రోగాలకు ప్రజలు బలి పశువులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్థిక భారంతో క్రుంగి పోయిన రైతులు మానసిక క్షోభను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కల్తీ కల్లు కారణంగా జిల్లాలోని నిర్మల్ డివిజన్‌లో మరణాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు డెంగ్యూ జ్వరాలు కూడా ప్రజల ప్రాణాలను తోడేస్తున్నాయి. ఇలా మానసిక, శారీరక రుగ్మతల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ వారిని వైద్య పరంగా ఆదుకునే చర్యలు మాత్రం తూతూ మంత్రంగానే కొనసాగు తున్నాయి. మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ స్థాయిలో ఏరియా ఆసుపత్రులు పని చేస్తుండగా జిల్లా కేంద్రంలో రిమ్స్ లాంటి వైద్య విజ్ఞాన కేంద్రం (రిమ్స్) కొనసాగుతున్నప్పటికీ ప్రజలకు మాత్రం ఆశించిన ఫలితం ఉండడం లేదు. సర్కారు దవాఖానాలంటేనే ప్రజలు దడుచుకునే స్థితిలు తలెత్తుతున్నాయి. ప్రజల ఆరోగ్యం కాస్త క్షీణించిందంటే ఇక ప్రభుత్వ వైద్యులు హైదరాబాద్ కార్పోరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయడం సాధారణం అయిపోయింది. ప్రతీ యేటా వైద్యుల వేతనాలు ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన కోసం కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఆ నిధుల వినియోగం ఎక్కడా కూడా కంటికి కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేట్లు చూడాలని కోరుతున్నారు.