Home ఎడిటోరియల్ ప్రాచుర్యం పొందని చట్టం

ప్రాచుర్యం పొందని చట్టం

Supermarket

 

కార్పొరేట్ హాస్పిటల్స్‌ నందు సైతం లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకుంటున్న డాక్టర్లు కూడా రోగులకు సరైన వైద్య సేవలు అందించడం లేదు. ఇలాగే కార్పొరేట్ షో రూంల నందు బట్టలు కొని ఇంటికి వచ్చి నీళ్లలో తడిపిన వెంటనే చిరిగిపోతున్నాయి. నువ్వులు, ఆవాలు, చక్కెర, మిరియాలు, గోధుమ పిండి, కారం పొడులతో పాటు పాలల్లో సైతం కల్తీని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో అనేక వ్యాపార సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు ఆడుకుంటున్నాయి. చివరకు రైతులు పండిస్తున్న పంటలకు కొనే పత్తి విత్తనాలు, ఇతర పంటల విత్తనాలనందు కూడా కల్తీలు చోటు చేసుకొని ప్రతి యేటా రైతులు లక్షల స్థాయిలో నష్టపోతున్నారు.

వెనక దగా… ముందు దగా… కుడి, ఎడమల దగా…. అనే దోపిడీ రాజ్యం అనాదిగా అమాయకుల మీద స్వారీ చేస్తూనే వుంది. కాలక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడుతూ వస్తున్నాయి. ప్రజలే పాలకులుగా మారుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అనేక దేశాలలో ప్రజల్లో వచ్చిన చైతన్యంలో భాగం గా వినియోగదారుల సంఘాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ సంఘాల ఒత్తిడి మేరకు భారతదేశంలో కూడా మొదటిసారి 1986లో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏర్పడింది.

ఈ చట్టం ద్వారా వినియోగదారుడే రారాజుగా వ్యవహరించడానికి అవకాశం వుంది. అయితే దశాబ్దాలు గడుస్తున్నా ఈ చట్టాన్ని ఉపయోగించుకోడంలో సామాన్యులేకాక ఓ రకమైన సామాజిక పరిజ్ఞానమున్న వ్యక్తులు సైతం విఫలమవుతున్నారు. ఇందుకు తగినట్లు పాలక పక్షాలు, ప్రభుత్వాలు ఈ చట్టం గురించి చైతన్యవంతులను చేయడానికి ఈ వినియోగదారుల ఫోరాలను ప్రజల వద్దకు తీసుకుపోడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ మధ్య కాలంలో ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం మరింత మెరుగులు దిద్ది వినియోగదారునికి ఉపయోగపడే విధంగా కఠిన నిబంధనలను తీసుకొచ్చినప్పటికీ కనీస స్థాయిలో కూడా వాటి గురించి ప్రజలకు తెలియడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వినియోగదారులలో వచ్చిన చైతన్యాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి మార్చి 15న ‘అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం’ గా గుర్తించింది.

వారం రోజుల కిందట ఉస్మానియా ఆస్పత్రిలో ఒక వ్యాధికి సంబంధించిన గోలీలు మరో వ్యాధికి సంబంధించి మింగడంతో అభం, శుభం తెలియని చిన్నారులు సుమారు 30 మంది వరకు అస్వస్థతకు గురికావడమేకాక ఇద్దరు ముగ్గురు మరణించారు. నాలుగు రోజుల కిందట కోఠి నందలి మరో ప్రభుత్వ ఆస్పత్రి నందు ప్రసవం కోసం వచ్చిన ఒక అభాగ్య మహిళను వైద్యులు సకాలంలో పట్టించుకోకపోవడంతో బిడ్డతో సహా ఆమె మరణించింది. మూడు సంవత్సరాల కిందట గుంటూరు నందలి ప్రధాన ప్రభుత్వ ఆసుప్రతి నందు ఎలుకలు కొరకడంతో ఒక శిశువు మరణించింది.

ఆ మధ్యనే తిరుపతి రూయా ఆస్పత్రి ప్రాంగణంలో ఒక రోగి కాలు (మొండెం) బహిరంగంగా కనిపించి భయానక వాతావరణం సృష్టింప చేసింది. విశాఖ నందలి మరో ప్రముఖ ప్రభుత్వ హాస్పిటల్‌తో పాటు అనేక హాస్పిటల్స్ నందు తరచూ చిన్న పిల్లలు మరణిస్తున్న హృదయ విదారక దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. కార్పొరేట్ హాస్పిటల్స్‌నందు సైతం లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకుంటున్న డాక్టర్లు కూడా రోగులకు సరైన వైద్య సేవలు అందించడం లేదు. ఇలాగే కార్పొరేట్ షోరూంలలో బట్టలు కొని ఇంటికి వచ్చి నీళ్లలో తడిపిన వెంటనే చిరిగిపోతున్నాయి. నువ్వు లు, ఆవాలు, చక్కెర, మిరియాలు, గోధుమ పిండి, కారం పొడులతో పాటు పాలల్లో సైతం కల్తీని ఏర్పా టు చేసి ప్రజల ప్రాణాలతో అనేక వ్యాపార సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు ఆడుకుంటున్నాయి. చివరకు రైతులు పండిస్తున్న పంటలకు కొనే పత్తి విత్తనాలు, ఇతర పంటల విత్తనాలనందు కూడా కల్తీలు చోటు చేసుకొని ప్రతి యేటా రైతులు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఇలా గే రైల్వేస్టేషన్లలో, బస్టాండ్‌ల్లో అడ్వాన్సుగా రిజర్వేషన్ సీట్లు కల్పించి చివరకు ప్రయాణీకులు ఎక్కిన తరువాత వారికి కేటాయించిన సీట్లు ఇవ్వకుండా అధికారులు రుబాబు గా వ్యవహరిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఏయిర్‌లైన్స్ కంపెనీలు మరీ భయంకరంగా దోపిడీ చేస్తున్నాయి. బోర్డింగ్ పాస్‌లు ఇచ్చిన తరువాత కూడా సకాలంలో విమానాలను ఎక్కించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ విధంగా అన్ని రకాలుగా జరుగుతున్న కుడి ఎడమల దోపిడీని నివారించడానికి ప్రతి పౌరుడు వినియోగదారుడే అయినందున వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని పూర్తిగా తెలుసుకొని సమీపంలో వున్న వినియోగదారుల ఫోరాలకు వెళ్లి ఎప్పటికప్పుడు కేసులు వేసి పరిహారాలను పొందవలసి వుంది. ఇందుకు తగినట్లు ఫోరాలనందు ప్రభుత్వాలు తగిన సిబ్బందిని ఏర్పాటు చేయడమేగాక నిర్వహణ ఖర్చులకు సరైన విధంగా నిధులను విడుదల చేయవలసి వుంది. ఇలాగే చాలా చోట్ల ఉత్సవ విగ్రహాలుగా వున్న ఫోరాలకు పాలక వర్గాలను ఏర్పాటు చేయవలసి వుంది. ఈ విధంగా ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వాల ద్వారా వినియోగదారుల ఫోరాలనందు సత్వరం న్యాయం పొందినప్పుడే ఈ చట్టానికి సార్థకత చేకూరుతుంది.

                                                                                                   – తిప్పినేని రామదాసప్పనాయుడు
No medical services for patients in Corporate hospitals