Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

గ్రూప్-2 వాయిదా ప్రసక్తిలేదు

gantaహైదరాబాద్: గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని, ముందుగా ప్రకటించినట్టుగా ఏప్రిల్ 24,25 తేదీలలో యథావిధిగా నిర్వహిస్తామని టిఎస్‌పి ఎస్‌సి చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో గురువారం కమి షన్ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంత మంది గ్రూప్2 వాయిదా వేస్తున్నట్లు అపోహలు సృష్టిస్తున్నారని, అటువంటిదేమి ఉండబోదన్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాలలో గ్రూప్ 2 ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీనిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలతో మాట్లాడుతున్నామని చెప్పారు. తమ వద్ద ఉన్న నోటిఫికేషన్‌లకు సంబంధించి దాదాపు అన్ని పరీక్షలను పూర్తి చేశామని, మార్చి మాసాంతానికి అన్ని ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఒక్క గ్రూప్ 2 మాత్రమే మిగిలి ఉందని చక్రపాణి తెలిపారు. సింగరేణి సంస్థ కూడా తమ నియామకాలను చేపట్టాలని తమను కోరిందని, అయితే సర్వీస్ కమిషన్ నిబం ధనల ప్రకారం కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే చేపట్టే అధికారం ఉంద ని, ఒకవేళ ప్రభుత్వం ఆదేశిస్తే సింగరేణి నియామకాలు కూడా చేపడతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉపాధ్యాయ నియామకాల నిర్వహణ విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
ప్రభుత్వ విభాగాలకు జాబితాల అందజేత
వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించిన పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆయా శాఖల అధికారులకు కమిషన్ అందజేసింది. మొత్తం 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నియామక పరీక్షలు నిర్వహించగా, 904 మంది ఎంపికయ్యారని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. అందులో ఒసి-184, బిసి-ఎ-69, బిసి-బి-184, బిసి-సి-12, బిసి-డి-115, బిసి-ఇ- 44, ఎస్‌సి-140, ఎస్‌టి-69, మహిళలు-335, వికలాంగులు-17 మంది ఉన్రాని వివరించారు. అయితే బధిరుల కోటాలో సరిపడ మంది ఎంపిక కాకపోవడంతో కొన్ని ఖాళీలు మిగిలాయని చెప్పారు. ఈ పరీక్షలో సంకేపల్లి సాయికిరణ్ టాపర్‌గా నిలిచారని, తరువాతి స్థానాల్లో నడిపల్లి శ్రీరామ్, ఆశ్రిత, బండి శిరీష, పెరుమాళ్ళ నవీన్‌కుమార్, గగులోత్ భావ్‌సింగ్,రూపావల్ శ్రవంతి ఉన్నారన్నారు. తమ కమిషన్ సభ్యులు, సిబ్బంది ఎంతో కష్టపడి పారదర్శకంగా, వివాదాలు, అవినీతికి తావులేకుండా ఇంటర్వూల ప్రక్రియ నిర్వహించారని ప్రశంసించారు. విలేకరుల సమావేశంలో ఆర్‌ఆండ్‌బి, ఇరిగేషన్, రూరల్ వాటర్ స్కీమ్(మిషన్ భగీరథ), పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు అప్పగించారు. వారం పది రోజుల్లో వారి నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని చక్రపాణి తెలిపారు. విలేకరుల సమావేశంలో కమిషన్ సభ్యులు సి.విఠల్, డాక్టర్ బి.చంద్రావతి, డాక్టర్ మహ్మద్ మతీనుద్దీన్ ఖాద్రీ, తదితరులతోపాటు కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ పాల్గొన్నారు.

Comments

comments