Home అంతర్జాతీయ వార్తలు అమెరికా ఆర్థికవేత్తలకు నోబెల్

అమెరికా ఆర్థికవేత్తలకు నోబెల్

int

స్టాక్‌హోమ్: అమెరికాకు చెందిన విలియమ్ నోర్ధాస్, పాల్ ఎం రోమర్‌లకు 2018 సంవతరానికి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. ‘నూతన ఆవిష్కరణలు, పర్యావరణం, ఆర్థికాభివృద్ధి’ అంశాలలో వారు చేసిన పరిశోధనలకుగాను ఈ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. నోర్దాస్ ‘ క్లైమేట్ ఎకనామిక్స్’లో,  ‘ఎండోజినస్ గ్రోత్ థియరీ’ మీద పాల్ రోమర్ చేసిన కృషికి గాను ఈ పురస్కారం లభించింది. నోర్దాస్ యేల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ కాగా గతంలో ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్‌గా పని చేసిన రోమర్ ప్రస్తుత న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పని చేస్తున్నారు.‘ ప్రస్తుత సమయంలోఅత్యంత ప్రధానమైన అంశాలయిన ‘ గ్లోబల్ ఎకానమీలో  దీర్ఘకాల స్థిరమైన వృద్ధి, ప్రపంచ జనాభా సంక్షేమం’ వంటి  కీలకమైన అంశాలలో వీరు పరిశోధనలు నిర్వహించారు’ అని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. వాతావరణంలో విపరీతంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను అరికట్టడానికి నోర్దాస్ పలు కీలకమైన సూచనలు చేశారు. అన్ని దేశాల మీద సమానంగా కార్బన్ పన్ను విధించేలా అంతర్జాతీయ పథకాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. కొత్త కొత్త ఆలోచనలను ఒక చోటికి చేర్చి దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిని ఎలా సాధించవచ్చో రోమర్ పరిశోధనలు వెల్లడించాయని అకాడమీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. నూతన ఆవిష్కరణలు వెలుగులోకి రావడానికి కంపెనీల సుముఖతను ఆర్థిక శక్తులు ఎలా నియంత్రిస్తాయో రోమర్ తన పరిశోధనలో  విపులంగా వివరించారు. కాగా ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి రేసులో ఉన్న వారిలో ఈ ఇద్దరు ముందు వరసలో ఉన్నారు. వీరికి ఈ పురస్కారం కింద తొమ్మిది మిలియన్ల స్వీడిష్ క్రోనోర్లు(1.01 మిలియన్ డాలర్లు) నగదు లభిస్తుంది. కాగా సోమవారం అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించడంతో 2018 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారాల ప్రకటన ముగిసినట్లయింది. ఈ ఏడాది సాహితంలో నోబెల్ పురస్కారం లేకపోవడం గమనార్హం.