Home ఎడిటోరియల్ ఉత్తర కొరియా సవాలు

ఉత్తర కొరియా సవాలు

sampadakeyam

డి.పి.ఆర్ కొరియా మిస్సిలీ పరీక్షల కార్యక్రమం అమెరికా భావిస్తున్నట్లు ప్రపంచాన్ని అణుయుద్ధం అంచుకు తెస్తున్నదా? యుద్ధమే వస్తే ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు వాస్తవరూపం దాల్చుతాయా? అమెరికా హెచ్చరికలను, ఆర్థిక ఆంక్షలను ఖాతరు చేయకుండా మిస్సిలీ పరీక్షలతో ముందుకు సాగుతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ అన్ మొండివాడా? పిచ్చివాడా?
సెప్టెంబర్‌లో తేలికపాటి అణుబాంబును కూడా పరీక్షించారు. ట్రంప్ హెచ్చరికలకు ప్రతిగా పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా దీవిని పేల్చివేస్తానని హెచ్చరించిన అన్, తాజాగా అమెరికా తూర్పుతీర ప్రాంతాన్ని చేరుకోగల ఖండాంతర బాలిస్టిక్ మిస్సిలీని విజయవంతంగా పరీక్షించటం అమెరికా అధ్యక్షుణ్ణి గంగవెర్రు లెత్తిస్తు న్నది. ఉత్తర కొరియాలోని సైన్ నీ నుంచి బుధవారం పరీక్షించిన ఆ మిస్సిలీ దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్రంలో పడిపోయింది. ఆంక్షలు, హెచ్చరికలు ఉత్తరకొరియా మిస్సిలీ కార్యక్రమాన్ని నిలుపు చేయలేకపోయాయి. కిమ్ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తామన్న ట్రంప్ తాజా హెచ్చరిక కూడా ఫలితమివ్వకపోవచ్చు.ఉత్తరకొరియా సరిహద్దు దేశం, అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా ద్వారా కిమ్‌ను అదుపులోకి తేవాలని ట్రంప్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చైనా పర్యటన సందర్భంలో అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్‌తో సంభాషణల్లో కూడా ట్రంప్ ఈ విషయం చర్చించి ఉంటారు. అయితే ఆంక్షలు నిష్ప్రయోజనకరమని, ఉత్తర కొరియాతో నేరుగా చర్చలు ఉత్తమ మార్గమని చైనా చేసిన సూచనలను ట్రంప్ ఖాతరు చేయలేదు. తమ సైనిక బలగర్వంతో దాడి హెచ్చరికలతో కిమ్‌ను భయపెట్టి దారికి తెచ్చుకోవాలన్న ట్రంప్ ప్రయత్నాలు ఫలించలేదు. ఉత్తర కొరియాది అస్తిత్వ సమస్య. అమెరికా సైనిక ప్రమాదాన్ని నిరోధించగలిగింది సైనిక శక్తి మాత్రమేనని విశ్వసించి అణు కార్యక్రమానికి ఉపక్రమించినట్లుంది. అంటే దాడిచేసే ‘దురాక్రమణ’ శక్తిగాగాక దాడిని నిరోధించగల శక్తిగా అది తన సైనిక సామర్థాన్ని పెంచుకుంటున్నది. అందులో భాగంగా మరికొన్ని మిస్సిలీ పరీక్షలు, అణుబాంబు పరీక్షలు జరిపినా ఆశ్చర్యం లేదు.
ఉత్తర కొరియా తాజా మిస్సిలీ పరీక్షను చర్చించిన భద్రతామండలి అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రసంగం తీరు యుద్ధ బెదిరింపులతోనే సాగింది. ‘మిస్సిలీ ప్రయోగాలపై వివాదం యుద్ధానికి దారితీస్తే అది మనం చూస్తున్న ఉత్తర కొరియా దురాక్రమణ పూరిత చర్యలవల్లనే. యుద్ధమే వస్తే ఉత్తర కొరియా ప్రభుత్వం సర్వనాశనమవుతుంది అనుమానం లేదు’ అన్నారామె. ‘ఉత్తరకొరియా నియంత చర్య ప్రపంచాన్ని యుద్ధానికి చేరువ చేస్తున్నది. మేము ఎన్నడూ ఉత్తర కొరియాతో యుద్ధం కోరుకోలేదు ఈ రోజు కూడా కోరుకోవటం లేదు’ అన్నారు. ‘దురాక్రమణపూరిత చర్యలకుగాను ప్యాంగ్‌యాంగ్‌ను శిక్షించేందుకు దానితో ఆర్థిక, దౌత్య సంబంధాలను తెంచుకోవాలని’ అన్ని దేశాలను కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని రష్యా తిరస్కరించింది. ఆంక్షలతో ఒత్తిడితెచ్చే పరిస్థితి ముగిసిపోయిందని రష్యా విదేశాంగమంత్రి లెవరోవ వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షునితో మాట్లాడిన ట్రంప్, ఉత్తర కొరియాకు ఆయిల్ సరఫరాను నిలుపు చేయాలని కోరారు. చైనా అందుకు సిద్ధంగా లేదు.
ఇప్పుడు అమెరికా పరిస్థితి తన హెచ్చరికలను అమలు జరపలేక, తన నిస్సహాయస్థితిని ఒప్పుకోలేక అపహాస్యంగా తయారైంది. దౌత్య ప్రయత్నాలకు బదులు సైనిక బలగర్వంతో ఉత్తర కొరియాను హడలెత్తించవచ్చనుకున్న ట్రంప్ దుందుడుకుతనం పర్యవసానమే ఇది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇరాన్ అణు కార్యక్రమం విరమింపచేసేందుకు భద్రతామండలి శాశ్వత సభ్యులైన ఐదుదేశాలు ప్లస్ జర్మనీ కృషిచేసి ఒప్పందం సాధించటాన్ని ట్రంప్ ఆదర్శంగా తీసుకుని ఆ దిశలో దౌత్య కృషి ద్వారా ఉద్రిక్తోపమనకు యత్నించవచ్చు. అయితే ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తానంటున్న ట్రంప్ నుంచి అటువంటి విజ్ఞత ఆశించగలమా!