Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఇక అమెరికా మా గుప్పిట్లో

  • బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానంతరం ఉ.కొరియా ప్రకటన
  • న్యూయార్క్ సహా ఏ నగరాన్నయినా ధ్వంసం చేస్తాం
  • ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ప్రకటన

Kim-Jong-Un

వాషింగ్టన్ : అమెరికా లక్ష్యంగా ఉత్తరకొరియా తన అణ్వస్త్ర ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉంది. ఐరాస ఆంక్షలు, ఇరుగుపొరుగు దేశాలు సూచనలు సలహాలను లెక్కచేయకుండా ప్యోంగ్‌యాంగ్ మరోసారి దుస్సాహసానికి పూనుకుంది. శుక్రవారం అర్థరాత్రి మరో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. హ్వాసంగ్14 పేరుతో ప్రయోగించిన ఈ తాజా క్షిపణి 3,725 కిలోమీటర్ల ఎత్తులో 998 కిలోమీటర్లు మేర ప్రయోణించి జపాన్ జలాల్లో పడిందని పెంటగాన్ ప్రతినిధి నావీ కెప్టన్ జెఫ్ డేవిస్ తెలిపారు. తాజా ప్రయోగం సక్సెస్ కావడంతో అమెరికా ప్రధాన భూభాగం మొత్తం తమ గుప్పిట్లోకి వచ్చేసిందని ఉత్తరకొరియా ప్రకటించుకుంది. ఖండాంతర క్షిపణులను ఉత్తరకొరియా ప్రయోగించడం ఈ నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ నెల 4న తొలిసారిగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసిందే. తాజా ప్రయోగం సక్సెస్‌తో అమెరికాలోని ఏ లక్షాన్నయినా తాము ఛేదించగలమని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. అమెరికాకు తీవ్ర హెచ్చరికను జారీ చేయడమే తాజా ప్రయోగ ఉద్దేశమని ఆయన చెప్పారు. అమెరికాలోని ఏ ప్రాంతాన్నయినా ఎప్పుడైనా సరే ధ్వంసం చేయగలిగే సామర్థాన్ని ఉత్తరకొరియా సంతరించుకుందని ఈ ప్రయోగం చాటిచెప్పిందని ఆయన పేర్కొన్నట్లు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్‌ఎ) ఉటంకించింది. మరోవైపు అమెరికాలోని ప్రధాన నగరం న్యూయార్క్‌ని సైతం ఈ క్షిపణి ధ్వంసం చేయగలదని అణ్వాయుధ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘అమెరికా ప్రధాన భూభాగమంతా కూడా మా గుప్పిట్లోకి వచ్చి చేరినట్లు ఈ ప్రయోగం రూఢీ చేసింది’ అని కిమ్ ప్రయోగానంతరం గర్వంగా వెల్లడించినట్లు సదరు ఏజెన్సీ తెలిపింది. ఈ నెల 4న ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కంటే ఇది మరింత శక్తివంతమైనదని లండన్ ఆధారిత ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌కి చెందిన క్షిపణి రక్షణ నిపుణుడు మైకేల్ ఎల్లీమన్ తెలిపారు. ఈ క్షిపణి గనుక 750 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలిగితే అపుడది పదివేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అంటే, అమెరికా పశ్చిమ నగరాలనే కాక న్యూయార్క్, వాషింగ్టన్‌లను కూడా ధ్వంసం చేయగలదని రక్షణ విశ్లేషకుడు కిమ్ డోంగ్‌యుబ్ ఎఎఫ్‌పి వార్తా సంస్థకు తెలిపారు.

Comments

comments