Home ఎడిటోరియల్ విఫల శిఖరాగ్రం

విఫల శిఖరాగ్రం

 North Korea, United States Hanoi Summit    అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ మధ్య హనోయ్ (వియత్నాం) లో జరిగిన రెండవ శిఖరాగ్ర సభ ఎన్నో ఆశలు కలిగించి అత్యంత నిరాశాయుతంగా, అర్ధంతరంగా, నిష్ఫలంగా ముగిసిపోడం ఎంతైనా బాధ కలిగించే పరిణామం. అణ్వస్త్రాలను తయారు చేసుకొనే పరిపూర్ణ సామర్థాన్ని క్రమక్రమంగా పుంజుకుంటూ చిరకాలంగా ప్రపంచ శాంతికి ప్రమాదకారిగా పరిగణన పొందుతున్న ఉత్తర కొరియా అమెరికాతో చర్చలకు అంగీకరించడం మేలైన పరిణామంగా భావించాము. గత ఏడాది జూన్‌లో సింగపూర్‌లో జరిగిన మొదటి శిఖరాగ్ర సభ ఎన్నో ఆశలు రేకెత్తించింది. ఆ భేటీ తర్వాత సంయుక్త ప్రకటన విడుదలయింది. తన అణ్వస్త్ర తయారీ కేంద్రాన్ని నిర్మూలించడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు ఆపేస్తామని అక్కడి తమ సైన్యాన్ని తగ్గిస్తామని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కాని గత ఏడాది ఆగస్టు 1వ తేదీన సెనెట్ ఆమోదించిన సైనిక బడ్జెట్‌లో దక్షిణ కొరియాలోని అమెరికన్ సైనికుల సంఖ్యను 22 వేల కంటె తక్కువకు దించడానికి తగిన నిధులు కేటాయించలేదు. అలా తగ్గిస్తామని ఉత్తర కొరియాకు హామీ ఇవ్వలేదని అమెరికా బుకాయించింది.

1945 నుంచి విడిపోయి ఉన్న ఉభయ కొరియాల మధ్య 195053 యుద్ధానంతరం శాంతి ఒప్పందం కుదరలేదు. పర్యవసానంగా రెండు కొరియాల మధ్య పరిస్థితులు దశాబ్దాలు గా ఉద్రిక్తంగా కొనసాగుతూవచ్చాయి. దక్షిణ కొరియాకు రక్షణ ఛత్రంగా ఉండే పేరిట అక్కడ అమెరికా తన భారీ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఉత్తర కొరియా 1963 నుంచి అణు రియాక్టర్ నిర్మాణం చేపట్టి పలు అణ్వాయుధాలను తయారు చేసుకుంది. 2017 జూలైలో తన మొట్టమొదటి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అమెరికా దానిని దుష్ట శక్తిగా వర్ణించింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అనేక రకాల ఆంక్షల విధింపు జరిగిపోయింది. తర్వాతి కాలంలో ఉత్తర కొరియాచేత అణ్వస్త్ర నిర్మాణాన్ని ఆపివేయించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

చైనా, అమెరికా, ఉత్తర, దక్షిణ కొరియాలు, జపాన్, రష్యాలతో కూడిన ఆరు దేశాల బృందం ఇందుకోసం కృషి చేసింది. ఈ బృందం చర్చలు 2003 నుంచి సాగాయి. కాని ఫలితం లేకపో యింది. కిమ్ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితిలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. ఒబామా విధానాలకు పూర్తి విరుద్ధమైన వైఖరిని తీసుకున్న ట్రంప్ అధ్యక్షుడయిన తర్వాత రెండు దేశాల అధినేతల మధ్య శిఖరాగ్ర సభ ప్రతిపాదన బలపడి ఇప్పుడీ రెండవ సమ్మిట్ వరకు వచ్చింది. తన పై చిరకాలంగా అమల్లో ఉన్న ఆంక్షల వల్ల తీవ్ర ఆహార కొరత, ఇతరత్రా కష్టాలతో తన ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించిన కిమ్ అణు నిరాయుధీకరణకు తాను సిద్ధమేనని ప్రకటించాడు. అందుకు బదులుగా అమెరికా ఆహార సహాయం అందించాలని ఒక దశలో కోరాడు.

ఉత్తర కొరియాను అమెరికాతో ముఖాముఖీకి ఒప్పించడంలో చైనా పాత్ర గణనీయమైనది. ఈ క్రమంలో భాగంగానే కిమ్ బీజింగ్‌ను కూడా సందర్శించాడు. ట్రంప్, కిమ్ తాజా శిఖరాగ్ర సభ అర్ధంతరంగా ముగిసిపోడానికి తక్షణమే ఆంక్షలు ఎత్తి వేయాలని కిమ్ షరతు విధించడమే కారణమని బోధపడుతున్నది. మొదటి శిఖరాగ్ర సభ తర్వాత అమెరికాతో కలిగిన అనుభవం వల్లనే కిమ్ ఈ షరతు విధించి ఉండవచ్చు. ట్రంప్ ఈ షరతుకు ఒప్పుకోలేదు. రెండవ రోజు చర్చల నుంచి మధ్యలోనే వాకౌట్ చేశాడు. ఉభయుల విందు భేటీ ఆ తర్వాత వెలువడుతుందన్న సంయుక్త ప్రకటన సన్నివేశం రద్దయ్యాయి. దేనికైనా తొందరలేదని ట్రంప్ ఇప్పుడంటున్నాడు. రెండవ భేటీ ఇలా నిష్ఫలంగా ముగిసిపోయినందున నాయకులిద్దరి మధ్య ముందు ముందు ఇటువంటి సమ్మిట్‌లు ఉంటాయో, ఉండవో తెలియరాలేదు.

చైనాతో సుంకాల యుద్ధాన్ని పరాకాష్ఠకు తీసుకు వెళ్లిన తర్వాత ఉత్తర కొరియాపట్ల ట్రంప్ ఆలోచనలో మార్పు వచ్చి ఉండవచ్చు. వాస్తవానికి ఉత్తర కొరియాకు వీలైనంత తొందరగా చేరువకావాలని దక్షిణ కొరియా కూడా కోరుకుంటున్నట్టు పలు పరిణామాలు రుజువు చేశాయి. తన భూభాగంలో అమెరికా సైన్యం నిరవధికంగా కొనసాగడం దక్షిణకొరియాకు ఇష్టం లేనట్టు భావించడానికి ఆస్కారం కలిగింది. కాని ట్రంప్, కిమ్ శిఖరాగ్ర చర్చలకు అర్థంతరంగా పడిన ఈ బ్రేకు భవిష్యత్తు మీద ఆశలు సన్నగిల్ల చేస్తున్నది. కారణాలేమైనప్పటికీ ఒక దేశ ప్రజలమీద ఆర్థిక ఆహారాది నిషేధాలతో కూడిన ఆంక్ష లు విధించడం, కొనసాగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ముందుముందైనా అమెరికా ఈ సత్యాన్ని గ్రహించి ఉత్తర కొరియాతో శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోగలదని, కిమ్ అంతవరకు నిగ్రహం పాటించగలడని మళ్లీ అణ్వస్త్ర ప్రయోగాలకు పాల్పడబోడని ఆశిద్దాం.

North Korea, United States Hanoi Summit