Home స్కోర్ ముంబయి ఇండియన్స్ నుంచి ఒక్కపైసా తీసుకోలేదు

ముంబయి ఇండియన్స్ నుంచి ఒక్కపైసా తీసుకోలేదు

Sachin Tendulkar

 

పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలపై సచిన్ తెండూల్కర్ వివరణ
14 అంశాలతో బిసిసిఐ అంబుడ్స్‌మన్‌కు లేఖ

ముంబయి: ఐపిఎల్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్‌ నుంచి తాను ఎలాంటి ప్రతిఫలం పొందలేదని, అలాగే ఆ జట్టులో ఎలాంటి నిర్ణయాత్మక పాత్ర పోషించడం లేదని క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ బిసిసిఐకి స్పష్టం చేశాడు. తెండూల్కర్‌పై పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు రావడం తెలిసిందే. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి)లో సభ్యుడిగా ఉంటూ ఐపిఎల్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిసిసిఐ అంబుడ్స్‌మన్, ఎధిక్స్‌ఆఫీసర్ జస్టిస్ (రిటైర్డ్) డికె జైన్ ఆయనకు నోటీసులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా చేసిన ఫిర్యాదు మేరకు సచిన్ విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారన్న ఆరోపణలతో జైన్ ఈ నోటీసులు పంపారు. సచిన్‌తో పాటుగా సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న వివిఎస్ లక్ష్మణ్‌కు కూడా నోటీసులు అందాయి. అయితే ఈ నోటీసులపై సచిన్ తెండూల్కర్ తాజాగా స్పందించారు.ఈ మేరకు వివరణ ఇస్తూ బిసిసిఐ అంబుడ్స్‌మన్ డికె జైన్‌కు ఒక లేఖ రాశాడు. మొత్తం14 అంశాలతో వివరణ ఇచ్చాడు.తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. ముంబై ఇండియన్స్‌నుంచి తాను ఎలాంటి

ప్రతిఫలం తీసుకోలేదని, అలాగే ఆ జట్టులో ఎలాంటి నిర్ణయాత్మక పాత్ర పోషించడం లేదని సచిన్ ఆ లేఖలో స్పష్టం చేశాడు. తాను క్రికెట్‌నుంచి రిటైర్ అయినప్పటినుంచి ముంబయి ఇండియన్స్‌కు కేవలం ఒక ‘ఐకాన్’గా మాత్రమే వ్యవహరిస్తూ ఉన్నానని తెలిపాడు. అంతేకాని ముంబయి ఇండియన్స్‌లో ఒక ఉద్యోగిగా కొనసాగడం లేదని స్పష్టం చేశాడు. బిసిసిఐ రూల్స్ లేదా ఇతర నిబంధనలను అతిక్రమించి తాను ప్రత్యేక ప్రయోజనాలేమీ పొందడం లేదని సచిన్ వెల్లడించాడు. 2015లో తనను క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా బిసిసిఐ నియమించడానికి ముందునుంచే తాను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీలో పని చేస్తున్నానని తెలిపాడు. కాబట్టి నిబంధనలను ఉల్లంఘించలేదని లేఖలో స్పష చేశాడు, ముంబయి ఇండియన్స్‌కు తాను సలహాలు మాత్రమే ఇస్తున్నానని.

జట్టులోని యువ ఆటగాళ్లతో ఆటకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నానని, వాళ్లలోని ప్రతిభను వెలికి తీయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నానని వెల్లడించాడు. అంతేకాని ముంబయి ఇండియన్స్ సపోర్టింగ్ స్టాఫ్‌లో భాగం కాదని స్పష్టం చేశాడు. ఒక వేళ అంబుడ్స్‌మన్ విచారణ కొనసాగించాలని అనుకుంటే తన న్యాయ నిపుణులతో కలిసి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడానికి అనుమతించాలని సచిన్ ఆ లేఖలో కోరాడు. మరో వైపు నోటీసులు అందుకున్న వివిఎస్ లక్ష్మణ్ అడ్వైజరీ కమిటీనుంచి వైదొలగడానికి అంగీకరించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టతీమ్ మేనేజిమెంట్‌లో కొనసాగనున్నట్లు లక్ష్మణ్ వెల్లడించాడు. వాస్తవానికి సిఎసిలో సభ్యులుగా కొనసాగుతూ బిసిసిఐకి సేవలందిస్తున్నందుకు తెండూల్కర్ కానీ లక్ష్మణ్ కానీ ఎలాంటి జీతమూ తీసుకోవడం లేదు. అయినప్పటికీ ఐపిఎల్ ఫ్రాంచైజీల టీమ్ మేనేజిమెంట్‌లో కొనసాగడమేమిటని ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేయడం గమనార్హం.

Not getting monetary benefit from Mumbai Indians