Home ఎడిటోరియల్ రాష్ట్రపతి ఎవరన్నది కాదు, ఏం చేస్తారన్నదే ప్రధానం

రాష్ట్రపతి ఎవరన్నది కాదు, ఏం చేస్తారన్నదే ప్రధానం

Kovind-And-Pranab

కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షం సాధారణంగా రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేస్తుంది. పార్లమెంటు సభ్యుల, వివిధ రాష్ట్రాల శాసన సభ్యుల మద్దతు ఏ అభ్యర్థికి ఎక్కువగా ఉంటే ఆ అభ్యర్థి నెగ్గుతారు. ఈ ఎంపిక లో రాజకీయాలు ఉండవని కాదు గాని రాష్ట్రపతి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని, వ్యవహరించా లని అనుకుంటాం. రాష్ట్రపతి అయిన తర్వాత ఆ వ్యక్తికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండక పోవడం ఆనవాయితీ. మొదటి రాష్ట్రపతి డా.బాబూ రాజేంద్రప్రసాద్ ఈ సంప్రదాయానికి ఒరవడి దిద్దారు. మెజారిటీ రాజకీయ పార్టీల మద్దతు ఉన్న వ్యక్తి రాష్ట్రపతి అవుతారు. కాని ఆ రాజకీయ సంబంధం అక్కడితో ఆగి పోతుంది.
రాష్ట్రపతి సంపూర్ణంగా దేశ ప్రజలకు ప్రతినిధిగా ఉండాలని, ఆ పదవిలో ఉన్నవారు పార్లమెంటులో అంతర్భాగమని రాజ్యాంగ నిర్మా తలు ఉద్దేశించారు. కాని రాష్ట్రపతి దేశాధినేత అయినా కార్య నిర్వాహక అధికారాలు ఉండవు కనక మన రాజకీయ వ్యవస్థ రాష్ట్రపతిని కష్టపడకుండా జీతం తీసుకునే వ్యక్తి కింద మార్చేసింది. ఆ పదవిలోకి వచ్చే వారికి ఉన్న అనుభవం, జ్ఞానం ఎందుకూ కొరగాదు, అనవసరం అన్న అభిప్రాయం బలంగా పాదుకుంది. ఈ కారణంగా రాష్ట్రపతిగా ఎన్నిక కావాల్సిన అభ్యర్థి ఎంపిక ఒక రాజకీయ క్రీడగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షం ఈ ఎంపికలో కీలకపాత్ర నిర్వర్తిస్తోంది. మరీ చెప్పాలంటే ప్రధానమంత్రి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి అభ్యర్థి ఎంపిక జరుగుతోంది. ఎంపిక ప్రక్రియ కొద్ది మందికే పరిమితం కావడం ఆ పదవిని గౌరవించక పోవడం కిందే లెక్క.
అభ్యర్థి ఎంపిక తీరు మారాలన్న సూచనలు చాలా కాలంగా ఉన్నాయి. వివిధ జీవన రంగాలలో ప్రసిద్ధులను అంటే వృత్తి నిపుణు లను, విజ్ఞాన శాస్త్ర రంగ ప్రముఖులను, న్యాయ కోవిదులను, వ్యాపార-పారిశ్రామిక వర్గాల వారిని, కార్మిక సంఘాల నాయకులను, మహిళా బృందాలను, స్వచ్ఛంద సంస్థలను, విద్యావేత్తలను, విద్యార్థులను-టూకీగా చెప్పలంటే పౌర సమాజం మొత్తాన్ని సంప్రదించి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం సముచితంగా ఉండడమే కాక మొత్తం దేశానికే ప్రాతినిధ్యం వహించే వ్యక్తిని ఆ అత్యున్నత పదవికి ఎంపిక చేయడం సాధ్యం అవుతుంది. ఎన్నికల కమిషన్ మాజీ ప్రధానాధికారి టి.ఎస్. కృష్ణమూర్తి అయితే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో “భారతీ యులమైన మనం” మౌన ప్రేక్షకులుగా ఉండి పోతున్నాం కనక రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులందరినీ చేర్చడానికి రాజ్యాంగ సవరణ తీసుకు రావాలని సూచించారు. దీనివల్ల నియోజక గణానికి ఉన్న పరిమితి కొంతైనా తగ్గుతుంది. ప్రజల భాగస్వామ్యం ఉందన్న భావన కలుగుతుంది.
రాష్ట్రపతిని మంత్రివర్గ నిర్ణయాలను కిమ్మనకుండా ఆమోదించే “రబ్బర్ స్టాంప్‌”గా మాత్రమే చూడడానికి అలవాటు పడిపోయాం కనక విస్తృత ప్రాతిపదికన అభ్యర్థిని ఎంపిక చేసే విధానాన్ని అనుసరించడం లేదు. గట్టి అభ్యర్థిని రాష్ట్రపతిని చేయడం మన అనుభవంలో ఏ రాజకీయ పార్టీకి ఇష్టం ఉన్నట్టు కనిపించదు. స్వతంత్ర ఆలోచనగల వారిని, వృత్తిపరమైన విశిష్టత, నైతిక బలం, మేధావి లక్షణాలు ఉన్న వ్యక్తిని ఎంపిక చేయడానికి ప్రయత్నమే జరగడం లేదు. పైగా మాజీ రాష్ట్రపతి వెంకట్రామన్ మీద తనను ఎంపిక చేసిన అప్పటి ప్రధానిపట్ల కృతజ్ఞుడుగా ఉండలేదన్న విమర్శలు వచ్చాయి.
రాష్ట్రపతికి కార్యనిర్వాహక అధికారాలు లేకపోవచ్చు. కాని ఆయన పని విశాలమైన హాళ్లు, 340 గదులు ఉన్న 320 ఎకరాలలోని అత్యంత విశాలమైన భవనంలో ఉండడం, విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు వారికి స్వాగతం చెప్పడం, విందులు ఇవ్వడం, అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లడం, పార్లమెంటు ఆమోదించిన బిల్లులపై మారు మాట లేకుండా సంతకం చేయడం మాత్రమే కాదు.
రాష్ట్రపతికి కొన్ని విచక్షణాధికారాలు కూడా ఉన్నాయి. పార్లమెంటు ఆమోదించిన బిల్లులను క్షుణ్నంగా పరిశీలించడం అంటే అవి రాజ్యాంగ బద్ధమైనవి అవునో కాదో గమనించడం మాత్రమే కాక అవి జాతికి ఉపకారం చేస్తాయో, అపకారం చేస్తాయో వివేచించ వలసిన బాధ్యత కూడా రాష్ట్రపతి మీద ఉంది. బోఫోర్స్ కుంభకోణం బయటపడ్డ తర్వాత కాంగ్రెస్ లోని ఒక వర్గం వారే అప్పటి రాష్ట్రపతి జైల్ సింఘ్ చేత రాష్ట్రపతి ని బర్తరఫ్ చేయించి అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకట్రామన్ ను ప్రధాన మంత్రిని చేయాలనుకుంది. వెంకట్రామన్ ఈ ప్రతిపాదన అంగీకరించక పోవడమే కాక ఈ వదంతుల మూలం ఏమిటో కనిపెట్టాలని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి సూచించారు. రాష్ట్రపతి కచ్చితంగా రాజ్యాంగం ప్రకారం నడుచు కోవాల్సిన మాట వాస్తవమే. కాని ఉత్తమ ఆనవాయితీలను సృష్టించడం, ఉన్న ఆనవా యితిలను పరిరక్షించడం కూడా రాష్ట్రపతి స్థానంలో ఉన్న వారి బాధ్యతే.
కె.ఆర్.నారాయణన్ ఇలాంటి సత్సంప్రదాయాలను నెల కొల్పారు. కేద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభం అయిన తర్వాత ఏ రాజకీయ పక్షానికి మెజారిటీ రాని స్థితిలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి వైఖరి అనుసరించాలో నారాయణన్ ఉత్తమ పద్ధతులను అనుసరించారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 1998 ఫిబ్రవరి 16న జన సామాన్యంతో కలిసి వరసలో నిలబడి ఓటేశారు. చాలా క్లిష్టమైన పరిస్థితిలో తాను చైనా రాయబారిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రాయబారిగా ఉన్నప్పుడు రెండు దేశాల మధ్య బెడిసిన సంబంధాలను చక్క దిద్దడానికి ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రశ్నార్థకమైన నిర్ణయాలు తీసుకున్న రెండు సందర్భా లలోనూ వాటిని పునఃపరిశీలించమని కోరారు. 1997లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని ఐ.కె.గుజరాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించేట్టు చేసింది నారాయణన్. అలాగే 1998లో నారాయణన్ సలహా మేరకే 1998లో వాజపేయి నాయకత్వంలోని ప్రభుత్వం బిహార్‌లో రాబ్డీ దేవి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్న నిర్ణయాన్ని మార్చు కోవాల్సి వచ్చింది. జన సామాన్యానికి ఆర్థిక విముక్తి కల్పించడానికి భూ సంస్కరణల అవసరం ఉందని మొహమాటం లేకుండా చెప్పగలిగారు. రాష్ట్రపతి కేవలం “రబ్బర్ స్టాంప్‌” అన్న అభిప్రాయం తొలగించడానికి ఆయన చేసినంత కృషి ఏ రాష్ట్రపతి చేయలేదేమో.
రాష్ట్రపతి రోజువారీ రాజకీయ క్రీడకు దూరంగా ఉండాల్సిందే, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందే. కాని రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని కాదు. సామాజిక న్యాయానికి దారితీయని పాలన నిరుపయోగమని ప్రభు త్వాలను హెచ్చరించడానికి నారాయణన్ వెనుకాడలేదు. సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధిస్తేనే భారత ప్రజాస్వామ్యం సవ్యంగా పని చేయ గలుగుతుందని నాయయణన్ అరమరికలకు తావులేకుండా చెప్పారు. “మనం అభివృద్ధి సాధించిన మాట నిజమే. సామాజిక మార్పు వేగంగా జరగడం లేదు. ఆ మార్పు మౌలికమైంది కాదు. ఉదారవాద ఆర్థిక విధానాలను తిరగదోడడం సాధ్యం కాక పోవచ్చు. కాని కోట్లాదిమంది పేదరికంలో మగ్గుతున్నప్పుడు విచ్చలవిడిగా సరళీకరణ కొనసాగిం చడం కుదరదు” అని చెప్పారు నారాయణన్. దీని వల్ల సమాజంలో సమతూకం దెబ్బ తింటుందని, కొంతమంది అపారమైన లాభాలు సంపాదిస్తారని, అత్యధిక సంఖ్యాకులు ఉపాధి అవకాశాలు లేకుండా దిక్కులేనివారుగా మిగిలిపోతారు అని నారాయణన్ గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్నది విచ్చలవిడి సరళీకరణే.
ప్రపంచంలో ఎవరికీ అణ్వస్త్రాల అవసరం లేదని వెంకట్రామన్ స్పష్టం చేశారు. కాని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాజపేయి ప్రభుత్వం రెండోసారి అణుపరీక్ష నిర్వహించడమే కాకుండా అణ్వస్త్రాల తయారీకి బాటలు వేసింది. రాజ్యాగం రాష్ట్రపతిని ప్రథమ సేవకుడిగా భావించింది. అంటే రాష్ట్రపతి దేశ ఉత్తమ వారసత్వాన్ని, జాతి ప్రయోజనాలను కాపాడడంలో కీలక పాత్ర నిర్వర్తించాలి తప్ప అలంకార ప్రాయంగా మిగిలి పోకూడదు. రాష్టపతికి అనేక ఫిర్యాదులు, మహజర్లు వస్తుంటాయి. వాటిని సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపి రాష్ట్రపతి కార్యాలయం చేతులు దులిపేసుకుంటోంది. ఈ మహజర్ల మీద ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో నిర్ణీత గడువులోగా తెలుసుకుని మహజరు పెట్టిన వారికి తెలియజేయాలి. అందరికీ అందుబాటులో ఉండడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిం చాలి. బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి. యువత, మహిళల శక్తి యుక్తుల్ని జాతి నిర్మాణానికి తోడ్పడేలా పని చేయాలి. ప్రభుత్వం అమలు చేసే పథకాలను రాష్ట్రపతి సందర్శించి బేరీజు వేస్తే అవి సకాలంలో పూర్తి అయ్యేట్టు చూడవచ్చు.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి తెలియజేయడం సంప్రదాయం. కాని దీన్ని ఉల్లంఘిస్తున్న సందర్భాలే ఎక్కువ. సర్వేపల్లి రాధాకృష్ణన్, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్తి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు. నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు 75 శాతం నిర్ణయాలు తనకు తెలియజేసే వారని, శాస్త్రి హయాంలో అది 50 శాతానికి, ఇందిరా గాంధీ హయాంలో 25 శాతానికి పడిపోయిందని రాధాకృష్ణన్ అన్నారు. ఈ పరిస్థితి ఉండకూడదు. రాష్ట్రపతి భవన్ ను విశిష్టమైన, విభిన్నమైన భావనలను, ఆలోచనలను రూపొందించడానికి కేంద్రంగా తయారు చేయాలి. ఈ భావనలను ప్రభుత్వానికి అందజేయవచ్చు. సి. సుబ్రహ్మణ్యం మహారాష్ట్ర గవర్నరుగా ఉన్నప్పుడు ఇదే పని చేశారు. రాష్ట్రపతి త్రివిధ దళాలకు అధిపతి. ఈ విషయంలో చట్టం చేయాల్సి ఉన్నా ఇంతవరకు చేయలేదు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రపతి దేశ రక్షణ విషయంలో క్రియాశీలంగా వ్యవహ రించక పోతే ఆయన త్రివిధ దళాల అధిపతిగా ఉన్నట్టు కాదు. పార్లమెంటు, కొన్ని సందర్భాలలో రాష్ట్రాల శాసన సభలు ఆమోదిం చిన బిల్లులకు రాష్ట్రపతి సంతకం చేస్తేనే చట్టప్రతిపత్తి కలుగుతుంది. కాని వీటిని రాష్ట్రపతి ఆమోద ముద్య్ర వేయడానికి గడువు ఏమీ లేదు. అలాగే మరణ శిక్ష పడిన వారికి ఆ శిక్ష అమలు కాకుండా క్షమాభిక్ష పెట్టే అవకాశం ఒక్క రాష్ట్రపతీకె ఉంది. దీనివల్ల మరణ శిక్ష పడ్డ వారూ నిరవధికంగా చావు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంలో రాష్ట్రపై క్రియాశీలంగా వ్యవహరించ డానికి అవకాశం ఉంది. ఆడంబరాలకు అతీతంగా జీవించడం, ఉన్నత ప్రమాణాలు అనుసరించడం వంటి లక్షణాలు రాష్ట్రపతులకు ఉంటే జాతి స్వరూపమే మారిపోతుంది.
వినూత్నమైన పద్ధతులు అనుసరించి ఉత్తమ సంప్రదాయాలు నెలకొల్పిన రాష్ట్రపతులు మనకు లేకపోలేదు. ప్రభుత్వం చేయమన్న చోట సంతకం పెట్టిన వారూ ఉన్నారు. మనకు కావాల్సింది మొదటి రకం వారే. జైల్ సింఘ్ లాంటి వారు కూడా పోస్టల్ బిల్లును నిలవరించడం ఉత్తమ ఆనవాయితీ. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్నది కాదు. ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా వ్యవహరించాలన్నది ప్రధానం.

– ఆర్.భరద్వాజ