Home రాష్ట్ర వార్తలు రద్దుతో దేశం బికారి

రద్దుతో దేశం బికారి

వృద్ధి రేటు భారీగా పతనమవుతుంది

దేశ ప్రజలను భ్రమలలో ముంచారు
కలల్లో తేలియాడించారు, బికారులుగా మార్చారు, ఆర్‌బిఐని డమ్మీ చేశారు
విధాన నిర్ణయ సంప్రదాయాలను తారుమారు గావించారు
నోట్ లేకుండానే కేబినెట్‌లో ఆమోదించారు
– ‘మన తెలంగాణ’ ద్వితీయ వార్షికోత్సవ సభలో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం

chidambaramహైదరాబాద్ : కలల వ్యాపారులు కలలను విక్రయిస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబ రం ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో అవినీతి, నల్లధనం అంతమవు తుందని, ప్రధాని ప్రకటించారని, అందులో ఏ ఒక్క లక్షం కూడా నెరవేరలేదన్నారు. ఇంకా కొంత ఏదో జరుగుతుందని విశ్వసిస్తున్నారని, వాస్తవ పరిస్థితులు చూశాక వారికి నిజాలు అర్థమవుతాయన్నారు. ‘మన తెలంగాణ’ ద్వితీయ వార్షికోత్స వం హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండి యా(ఆస్కీ) కాలేజీ పార్క్ క్యాంపస్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ‘పెద్ద నోట్ల రద్దు -దృక్కోణం’ అనే అంశంపై కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ఫౌండేషన్ లెక్చర్ ఇచ్చారు. రికార్డుల్లో లేని క్యాబినెట్ మీటింగ్‌లో, క్యాబి నెట్ నోటు లేకుండానే నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆమోదించా రని, ఈ సంప్రదాయం ప్రమాదకరమని ఆయన హెచ్చరించా రు. ఇదే విధంగా యుద్ధం కూడా ప్రకటిస్తారేమోనని చెప్పా రు. నోట్ల రద్దుతో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని, దీని వల్ల జిడిపి ఒక్క శాతం నష్టపోతుందని, అంటే రూ. 1.5 లక్షల కోట్లు ప్రత్యక్ష నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రకటించిన లక్షాలు నెరవేరకపో వడంతో కథ మార్చి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అన్నారని, తరువాత పరిమిత నగదు వ్యవస్థ, డిజిటల్ మనీ అంటున్నా రని చెప్పారు. డిజిటల్ లావాదేవీలతో పేటిఎం, ఈ వ్యాలెట్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రపం చంలోని ఏ దేశంలో కూడా వంద శాతం నగదు రహిత లావాదేవీలు లేవన్నారు. కేవలం రూ.400 కోట్ల నకిలీ నోట్ల కోసం రూ.15.44 లక్షల కోట్ల విలువైన నోట్లు రద్దు చేశారని విమర్శించారు. దేశంలో 7 లక్షల గ్రామాలు ఉన్నాయని, వాటిల్లో పిఒఎస్(పాయింట్ ఆఫ్ సేల్) మిషన్‌ల ద్వారా లావాదేవీలు చేసేందుకు కరెంటు, ఇంటర్నెట్ ఉందా? అని ప్రశ్నించారు. ఎలాంటి చర్చ లేకుండా తీసుకున్న నిర్ణయాల ను ప్రజలపై రుద్దే ప్రభుత్వాలను అంగీకరించొద్దన్నారు. నగదు మార్పిడి కోసం రోజుకు 11 కోట్ల మంది బ్యాంకులు, ఏటిఎంల ముందు క్యూలు కట్టారని, 45 కోట్ల మంది 50 రోజులకు పైగా ఆదాయం కోల్పోయారన్నారు. వారికి పరిహా రం, ప్రజలకు ఇబ్బందులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.
తొలుత ‘మన తెలంగాణ’ ఎడిటర్ కె.శ్రీనివాస్ రెడ్డి పత్రిక ప్రస్థానాన్ని వివరించారు. దశాబ్దాల పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలు తమ తరుపున కొత్త భాష, యాసలో కొత్త గొంతుక అవసర మని భావించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉత్సాహవం తులైన యువకుల బృందం, సుదీర్ఘ అనుభవం కలిగిన జర్నలిస్టులు ఆధ్వర్యంలో తీసుకువచ్చిన ‘మన తెలంగాణ’ పత్రికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించారని గుర్తు చేశారు. ‘మంచికి అధికార పక్షం-చెడుకు ప్రతిపక్షం’ అనే నినాదానికి కట్టుబడి, ఎలాంటి సంశయం, బెరుకు లేకుండా రెండేళ్ళుగా పత్రికను నడిపిస్తున్నామన్నారు. పెద్ద నోట్లు రద్దు నిర్ణయం దేశ ప్రజలందరిపై తీవ్ర ప్రభావం చూపిందని, అందుకే ఈ పత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఫౌండేషన్ లెక్చర్‌కు ఈ అంశాన్ని ఎంపిక చేశామన్నారు. దీనిపై మాట్లాడేందుకు రికార్టు స్థాయిలో తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం సరైన వ్యక్తి అని భావించి, ఆహ్వానించినట్లు తెలిపారు.
ఈ సభలో టిపిసిసి అధ్యక్షులు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, టిపిసిసి కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిదంబరంను ‘మన తెలంగాణ’ మేనేజింగ్ ఎడిటర్ పి.అంజయ్య, డైరెక్టర్ డి.శ్రీధర్‌రెడ్డిలు శాలువాతో సత్కరించి, మెమెంటోను అందజేశారు.