Home లైఫ్ స్టైల్ ఏం కొనేటట్టు లేదు.. ఏదీ తినేటట్టు లేదు..

ఏం కొనేటట్టు లేదు.. ఏదీ తినేటట్టు లేదు..

పండుగంటే…నాలుగురోజుల సెలవులు…టీవీ చానెల్స్‌లో రకరకాల స్పెషల్ ప్రోగ్రాంలు….కొత్త సినిమాలు…స్విగ్గీలో ఇష్టమైన ఫుడ్ ఆర్డర్..సాయంత్రం అలా అలా మాల్స్‌కు వెళ్లి చక్కర్లు కొట్టడం…అక్కడే ఏదో ఒకటి తినేయడం…ఇంటికొచ్చి మళ్లీ అర్ధరాత్రి వరకు టీవీ, నెట్, సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోవడం..ఇదండీ నగరవాసుల పండుగ సందడి… ఇలా ఎందుకు మారారు..? విపరీతమైన ఖర్చు. పండుగంటేనే ఖర్చు. పూల దగ్గర నుంచి అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడం కారణం అంటారు మధ్యతరగతివారు.  అవును నిజమే…

Festival-Food-Flowers

మధ్య తరగతి కుటుంబాలకు పండుగలంటే నిజంగానే భయం పట్టుకుంటుంది. ఒకప్పుడు పండుగ రోజుల్లో ఒంటి నిండా నగలు, ఇంటి నిండా బంధువులు, స్నేహితులతో కళకళలాడుతూ ఉండేది. కనీసం ఓ పది మందికి పైగా కూర్చుని పిండివంటలతో ఘుమఘులాడే విందు చేసేవారు. ఇక ఇంట్లో అలంకరణలకేం తక్కువ ఉండేది కాదు. దేవుడి మండపంలో రకరకాల పూలు, గుమ్మాలకు బంతిపూలు, మామిడి తోరణాలు వేలాడదీయకుండా పండుగ మొదలయ్యేది కాదు. అప్పుడు మామిడి తోరణాలు కొంటారంటే ఆశ్చర్య పోయేవారు. పక్కింట్లోనో ఎదురింట్లోనో మామిడాకులు దొరికేవి. ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అదీ బోలెడు డబ్బుతీసుకుని నాలుగైదు రెబ్బలు ఇస్తాడు. దారంతో తోరణాలు కట్టడాలు ఎప్పుడో పోయాయి. గుమ్మానికి అటో రెబ్బ, ఇటో రెబ్బ అంతగా కుదరకపోతే గుమ్మం మధ్యలో ఒక రెబ్బ పెట్టి అలంకారం అయిందనిపిస్తున్నారు. ఏమిటండీ ఈ అన్యాయం? అని అడిగితే ఏం చేస్తాం అన్నీ ఖరీదుగా ఉన్నాయంటారు. ఒకప్పుడు దసరా వచ్చిందంటే అందరికీ సరదానే. దసరాకి ఎక్కువ సెలవులు దొరుకుతాయి. అమ్మమ్మ ఇంటికి, నాయనమ్మ ఇంటికి పోడానికి ఇదో గొప్ప అవకాశం. పెద్దవాళ్ళు చేసి పెట్టే పిండివంటలు నోరంతా కుక్కుడు తినడంలో ఉన్న ఆ మజాయేవేరు.
దసరా, బతుకమ్మ పండుగలు పూలపండుగలు. బతుకమ్మకు తంగేడు, గునుగులాంటి పూలు, అమ్మవారికి బంతి, చేమంతి, మల్లెలు, కనకాంబరాలు ఇలా…పల్లెల్లో పెరట్లో దొరికే పూలు పట్నానికి వచ్చేసరికి రెక్కలు తొడిగి జేబుకు చిల్లులు పెడుతున్నాయి. అవే నగరానికి చేరే సరికి బిపీలు, హార్ట్‌ఎటాక్‌లు వచ్చేంతగా ఖరీదైపోతున్నాయి. అంతంత రేటు పెట్టి కొనడానికి మధ్యతరగతి జీవులు స్తోమత చాలక చేతులెత్తేస్తున్నారు. ఒకప్పుడు ఇంటి పరిసరాల్లో కనపడే పూలు ఇపుడు కంటి ముందు కనబడటంలేదు. బతుకమ్మను పేర్చేందుకు పూల కొరత ఏర్పడటంతో ధరలు అమాంతం పెంచేశారు వ్యాపారస్థులు. చెరువు గట్ల మీద కనిపించే తంగేడు పూలు గునుగుపూలు, చేమంతులు, బంతులు ఇప్పుడు కనిపించట్లేదు. నగరీకరణ పేరుతో అభివృద్ధి పనులు పచ్చదనాన్ని తుడిచేస్తుండడంతో పూలు, పూలమొక్కలు కనిపించడం మానేశాయి. కలువలు, తామరపూలు గగనమైపోయాయి. గుమ్మానికి బంతిపూల తోరణం కడదామన్నా వాటిరేట్లూ కొండెక్కి కూచున్నాయి. పూలదండ కట్టాలన్న ఏకైక సెంటిమెంట్ కొద్దీ అరకొరగా కొనేసి ఆమడకో పువ్వు చొప్పున కట్టేసి దండ తయారుచేస్తున్నారు. సందుపళ్ళలాగా సందు దండలను చూస్తే హృదయం బాధతో మూల్గుతుంది.
దసరా అంటే నాన్‌వెజ్ ఉండాల్సిందే అంటారు మాంసాహార మిత్రులు. పండగనాడు యమ డిమాండ్ ఉంటుంది. కోడి,మేక, గొర్రె దేన్నీ వదిలిపెట్టకుండా అన్నిటి ధరలూ పెంచేస్తున్నారు వ్యాపారులు. తినక తప్పదు కదా అని కస్టమర్లు కష్టమర్లుగా మారి అడిగినంత డబ్బిచ్చి మరీ కొంటున్నారు. మిడిల్ క్లాసు వాళ్ళు తక్కువ క్వాంటిటీతో సరిపుచ్చుకుంటున్నారు. కూరగాయలు, కిరాణ సరుకులు కొండెక్కి కూర్చోవడంతో స్పెషల్స్ చేసుకోవడం మానేసి బయట నుంచి ఓ స్వీట్ ప్యాకెట్ తెచ్చుకుని దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టి మమ అనిపించేస్తున్నారు. అప్పుచేసి పప్పు కూడు తినడం అంటే ఏమిటో సగటు సిటిజన్‌కు పండగల పుణ్యమా అని అనుభవానికి వస్తోంది. వినాయక చవితి చందాలు, దసరా ఈనాములతో నమిలేస్తే , దీపావళి పేల్చేస్తోంది. దీపావళి టపాకాయలు కాల్చుకోవడం మానేసి వీడియోలలో చూసి ఆనందిస్తున్నారు. టపాకాయలు పేలిస్తే పర్యావరణ హితం అంటారు కానీ ముందు మా హితం ఎవరు చూస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రయాణం కూడా భారమే. అది మరో దోపిడీ. ప్రైవేటు బస్సుల వారు టికెట్ల రూపంలో చేసే భారీ దోపిడీ. ఒక్కసారిగా టికెట్‌ను డబల్ చేసి అమ్ముతున్నారు. కొత్తబట్టలు కొందామంటే బైవన్ గెట్ టూ అంటారు.
తీరాలోపలికి వెళ్తే మా మూలు రోజుల్లోకన్నా ఎక్కువ డబ్బులాగుతుంటారు. ఇలా పండుగలు పబ్బాలు ఉబ్బు, మబ్బు ఎగరగొట్టే అకేషన్లుగా మారిపోతున్నాయి.