Home తాజా వార్తలు చాంపియన్ జకోవిచ్

చాంపియన్ జకోవిచ్

Novak Djokovic To Third US Open Crown Equals Sampras

యుఎస్ ఓపెన్ ఫైనల్లో డెల్‌పొట్రో చిత్తు

న్యూయార్క్: ప్రతిష్టాత్మకమైన యుఎస ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిల్‌ను సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. కెరీర్‌లో ముచ్చటగా మూడోసారి జకోవిచ్ తన ఖాతాలో యుఎస్ ఓపెన్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో ఆరో సీడ్ జకోవిచ్ 63, 76(4), 63 తేడాతో మూడో సీడ్, మాజీ చాంపియన్, అర్జెంటీనా స్టార్ జువాన్ మార్టిన్ డెల్‌పొట్రోను ఓడించాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేగాక 14 టైటిల్స్‌తో అమెరికా మాజీ దిగ్గజం పీట్ సంప్రాస్ రికార్డును సమం చేశాడు. ఇక స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (20), స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ (17) మాత్రమే జకోవిచ్ కంటే ఎక్కువ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఇదిలావుండగా ఈ విజయంతో జకోవిచ్ తన ర్యాంకింగ్స్‌ను కూడా గణనీయంగా మెరుగు పరుచుకున్నాడు. ఈ విజయంతో జకోవిచ్ మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. నాదల్ టాప్ ర్యాంక్‌లో నిలువగా, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో జకోవిచ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇంతకుముందు వింబుల్డన్ ఓపెన్ టైటిల్‌ను కూడా జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. కిందటి ఏడాది గాయాలతో సతమతమైన జకోవిచ్ ఈ ఏడాది మాత్రం అసాధారణ ఆటతో చెలరేగి పోతున్నాడు. తాజాగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం ద్వారా పూర్వ వైభవాన్ని అందుకున్నాడు.

ప్రారంభం నుంచే…
డెల్‌పొట్రోతో జరిగిన ఫైనల్ సమరంలో జకోవిచ్ ప్రారంభం నుంచే ఆధిపత్యం చెలాయించాడు. దూకుడుగా ఆడుతూ డెల్‌పొట్రోను ముప్పుతిప్పలు పెట్టాడు. జకోవిచ్ కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడడంతో అర్జెంటీనా స్టార్ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. జకోవిచ్ అద్భుత ఆటతో అలరించాడు. ఇదే సమయంలో ప్రత్యర్థిని కోర్టు నలుమూలలా పరిగెత్తించాడు. జకో ధాటికి డెల్‌పొట్రో కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేక పోయాడు. అంతేగాక తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఒత్తిడిని తట్టుకోలేక వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన జకోవిచ్ అలవోకగా తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ, రెండో సెట్‌లో డెల్‌పొట్రో పుంజుకున్నాడు. అద్భుత పోరాట పటిమతో జకోవిచ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. చూడచక్కని షాట్లతో జకోను హడలెత్తించాడు.

ఏమాత్రం పట్టు విడవకుండా పోరాడిన డెల్‌పొట్రో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే జకోవిచ్ కూడా వెనక్కి తగ్గలేదు. తనకు మాత్రమే ప్రత్యేకమైన షాట్లతో డెల్‌పొట్రోను నిలువరించాడు. ఇదే సమయంలో ఒత్తిడిని సైతం తట్టుకుంటూ మళ్లీ పుంజుకున్నాడు. క్రమంగా పట్టు సాధించిన జకోవిచ్ సెట్‌ను టైబ్రేకర్ వరకు తీసుకెళ్లాడు. తన అనుభవనంత ఉపయోగించి డెల్‌పొట్రోకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అద్భుత ఆటతో ప్రత్యర్థిని మళ్లీ ఆత్మరక్షణలో పడేశాడు. ఇదే క్రమంలో సెట్‌ను గెలిచి డెల్‌పొట్రోకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఇక, కీలకమైన మూడో సెట్‌లో జకోవిచ్‌కు ఎదురే లేకుండా పోయింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ పట్టు బిగించాడు. మరోవైపు అర్జెంటీనా స్టార్ తీవ్ర ఒత్తిడిలో ఆడాడు. అతని షాట్లలో పస తగ్గింది. అంతేగాక వరుస తప్పిదాలతో సతమతమయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చు కోవడంలో సఫలమైన సెర్బియా స్టార్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి చాంపియన్‌గా అవతరించాడు. ఇక, టైటిల్‌ను గెలిచి సత్తా చాటాలని తహతహలాడిన డెల్‌పొట్రో రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు.

పడి లేచాడు…
కిందటి సీజన్‌లో జకోవిచ్ ఆటను చూసిన వారేవరూ కూడా అతను మళ్లీ గాడిలో పడతాడని ఊహించలేదు. వరుస గాయాలు ఓవైపు, వైఫల్యాలు మరోవైపు జకోవిచ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇదే క్రమంలో చిరకాల ప్రత్యర్థులు, వెటరన్ ఆటగాళ్లు రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. 2017లో ఇటు నాదల్, అటు ఫెదరర్ రెండేసి గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచి తమకు ఎదురు లేదని నిరూపించారు. ఇదే సమయంలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో జకోవిచ్ ఆకట్టులేక పోయాడు. దీంతో అతను పూర్వ వైభవం సాధించడం దాదాపు అసాధ్యమేనని విశ్లేషకులు సైతం ఓ అంచనాకు వచ్చేశారు. అయితే మొండి పట్టుదలకు మరో పేరుగా చెప్పుకునే సెర్బియా యోధు డు జకోవిచ్ ఆధైర్య పడలేదు. క్రమం క్రమంగా కోలుకుంటూ ఒక్కో టోర్నమెంట్‌లో తన ఆటను మెరుగు పరుచుకుంటూ పోయాడు. ఇదే సమయంలో స్టార్ ఆటగాళ్లు ఫెదరర్, నాదల్‌లు గాయాల బారీన పడడం కూడా జకోవిచ్‌కు కలిసి వచ్చింది. సరైన సమయం కోసం ఎదురు చూసిన జకోవిచ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వింబుల్డన్ ఓపెన్‌లో అసాధారణ రీతిలో చెలరేగి పోయాడు. ఏమా త్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జకోవిచ్ ఒక్కో అడ్డంకిని దాటుకుంటూ ముందు కెళ్లాడు. ఇదే క్రమంలో టైటిల్‌ను గెలిచి పూర్వ వైభవాన్ని అందుకున్నాడు. వింబుల్డన్ విజయం జకోవిచ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనే చెప్పాలి. ఇదే జోరును

ప్రతిష్టాత్మకమైన సిన్సినాటి ఓపెన్‌లో కొనసాగించి చాంపియన్‌గా నిలిచాడు. తాజా గా యుఎస్ ఓపెన్‌ను గెలిచి తనకు ఎదురు లేదని నిరూపించాడు. గతంలో నాదల్, ఫెదరర్‌ల మాదిరిగానే జకోవిచ్ కూడా వైఫల్యాలను అధిగమించి మళ్లీ విజయాల బాట పట్టాడు. జకోవిచ్ మళ్లీ గెలుపు బాట పట్టడంతో ప్రపంచ టెన్నిస్‌లో ముక్కోణపు పోటీ నెలకొంది. నాదల్, ఫెదరర్, జకోవిచ్‌ల మధ్య ఇకపై హోరాహోరీ మరం సాగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు వయసు పెరుగుతున్నా ఈ ముగ్గురు దిగ్గజాలు యువ ఆటగాళ్లకు సవాలుగా మారారు.

కిందటి 8 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లను పరిగణలోకి తీసుకుంటే నాదల్, ఫెదరర్, జకోవిచ్‌లు మాత్రమే విజేతలుగా నిలిచారు. ఈ ముగ్గురికి ఇతర ఆటగాళ్లు పోటీ ఇవ్వలేక పోయారు. ఇక, గాయంతో సతమతమవుతున్న మరో స్టార్ ఆండీ ముర్రే కూడా కోలుకుంటే నలుగురి మధ్య తీవ్ర పోటీ నెలకొనడం ఖాయం. ఇదిలావుండగా నాదల్, ఫెదరర్‌లు ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటుడడం, ముర్రే ఇప్పట్లో కోలుకునే అవకాశం లేక పోవడంతో రానున్న రోజుల్లో జకోవిచ్ జోరు సాగడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఇప్పటికే 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జకోవిచ్ రానున్న రోజుల్లో నాదల్ రికార్డును బద్దలు కొట్టడంపై దృష్టి పెట్టాడు. ఆ రికార్డును అందుకుంటే ఫెదరర్ ఫీట్‌ను అందుకోవడం జకోవిచ్ అసాధ్యమేమి కాదనే చెప్పాలి. అయితే దీని కోసం గాయాల బారీన పడకుండా ఉండడం జకోవిచ్‌కు చాలా అవసరం. ఇప్పటికే వయసు ప్రతికూలంగా మారిన నేపథ్యంలో ఈ రికార్డులను తిరగ రాయడం అనుకున్నంత తేలిక కాదని చెప్పవచ్చు. కానీ ఎటువంటి సవాలునైన సమర్థంగా ఎదుర్కొనే సత్తా కలిగిన జకోవిచ్‌కు ఇది అందుకోవడం కష్టం మాత్రం కాదు. ఇదే జోరును కొనసాగిస్తే మరో రెండు సీజన్లలో మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసు కోవడం తథ్యం.