Home తాజా వార్తలు ఆ సినిమాల బాటలో బయోపిక్

ఆ సినిమాల బాటలో బయోపిక్

NTR biopic, In Nandamuri Balakrishna

సినిమాల ప్రచారంలో, మేకింగ్‌లో ‘బాహుబలి’ చిత్రం ఓ కొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమాలో తెలుగు, తమిళ, కన్నడతో పాటు ఇతర భాషా నటులను తీసుకొని ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను తీసుకొచ్చారు. అలాగే సినిమా విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చేలా చేసి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఇదే దారిలో పయనిస్తోంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటీనటులు గురించి అధికారికంగా ప్రకటించలేదు. విద్యాబాలన్‌తో సహా అనేక మంది పేర్లు ముందుగా మీడియాలోనే లీక్ అయ్యాయి. ఆతర్వాత చాలామంది వాళ్లంతట వాళ్లే సినిమాలో తాము ఫలానా క్యారెక్టర్‌లో నటిస్తున్నామని తెలిపారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌కు కూడా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వీలైనంత మంది బాలీవుడ్, తమిళ, కన్నడ నటులును ఈ చిత్రంలో తీసుకుంటున్నారు ఫిల్మ్‌మేకర్స్. సినిమా తెలుగు వర్షన్‌తో పాటు బాలీవుడ్ వర్షన్‌కు క్రేజ్ తీసుకురావాలని చూస్తున్నారు. విద్యాబాలన్‌ను కీలక పాత్రకు తీసుకోవడం అందుకోసమే. రాబోయే కొద్ది రోజుల్లో కన్నడ, తమిళ, బాలీవుడ్ నటుల పేర్లు బయటకు వస్తాయని తెలిసింది. ఇవన్నీ బయటకు వచ్చాకే అసలు సిసలు సినిమా బజ్ ప్రారంభమవుతుందని తెలిసింది. ఇవన్నీ చూస్తుంటే ఎన్టీఆర్ బయోపిక్ మేకింగ్, పబ్లిసిటీలో బాహుబలిని, ప్లానింగ్‌లో మహానటిని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది.