Home జాతీయ వార్తలు ఒడిశలో ప్రకాశించిన కెసిఆర్ ‘కంటి వెలుగు’!

ఒడిశలో ప్రకాశించిన కెసిఆర్ ‘కంటి వెలుగు’!

Kanti Velugu

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కెసిఆర్ ప్రవేశపెట్టిన వినూత్న పథకం ‘కంటి వెలుగు’ను ఇప్పుడు ఒడిశ ప్రభుత్వం అమలుచేయనున్నది. ఒడిశలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం రూ.680 కోట్లతో ‘సునేత్ర’ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత కంటి చికిత్సలు అందచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం ఈ పథకాన్ని ప్రకటించారు. 2023 నాటికి రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి ఆరోగ్య సంరక్షణ అందచేయాలన్నది ప్రభుత్వం లక్షంగా నిర్దేశించుకున్నది.

ఆర్థిక పరిస్థితికి అతీతంగా ప్రజలందరికీ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తాం. అన్ని వయసుల వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు అని ముఖ్యమంత్రి పట్నాయక్ తెలిపారు. క్యాటరాక్ట్‌తో బాధపడుతున్న రోగులందరికీ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రులలో ఎటువంటి నిబంధనలు లేకుండా ఉచితంగా శస్త్రచికిత్సలు అందచేయడం జరుగుతుందని ఆయన వివరించారు. రోగులందరికీ ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. దృష్టిలోపంతో బాధపడే విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు ఇస్తారు. తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడే విద్యార్థులకు కూడా ఉచితంగా వైద్య చికిత్స అందచేస్తారు. ఈ పథకం కోసం మొదటి ఐదు సంవత్సరాలలో రూ.680 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. నేత్ర పరీక్షలు, చికిత్సలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని సిహెచ్‌సిలు, సబ్-డివిజనల్ ఆస్పత్రులు, జిల్లా ప్రధాన కార్యాలయాలలోని ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉంటాయని ప్రభ్తువ ఆరోగ్య శాఖ కార్యదర్శి పికె మెహెర్దా తెలిపారు.

Odisha to Follow Telanganas Kanti Velugu, CM Naveen Patnaik announced Sunetra scheme for all the citizens of Odisha, which is an unique scheme implemented by Telangana CM KCR