Home ఎడిటోరియల్ సంపాదకీయం : డ్రగ్స్ సరఫరా మూలాలకై వేట

సంపాదకీయం : డ్రగ్స్ సరఫరా మూలాలకై వేట

Sampadakeeyam-Logo

హైదరాబాద్ మహానగరంలో మత్తుపదార్థాల (డ్రగ్స్) వినియోగం, సరఫరాల లోగుట్టు పట్టుకునేందుకు ఆబ్కారీ, ఎక్సైజ్ అధికారులు సాగిస్తున్న దర్యాప్తు, అనుమానితుల విచారణ తీరు, దీనిపై ఎలక్ట్రానిక్ మీడియా కధనాలు ప్రజల్లో అమితాసక్తి కలిగిస్తున్నాయి. నగరంలో డ్రగ్స్ వినియోగం ఎంత విస్తృతంగా ఉందోనన్న సందేహాలు లేవనెత్తు తున్నాయి. సినీరంగానికి చెందిన డజనుమందికి నోటీసులు జారీచేసి, విచారణ తేదీలు ఖరారు చేసి, రోజుకొకరివంతున 5 నుండి 10 గంటల పాటు విచారిస్తుండటం ఉత్కంఠత పెరుగుదలకు మూలం. ఎక్సైజ్ అధికారులు నేర నిరూపణకు ప్రయత్నిస్తున్నట్లు అత్యుత్సాహంతో, విచారణకు వచ్చినవారి రక్తం, గోళ్లు, జుత్తు నమూనాలను కూడా సేకరించసాగారు. ఒక సినీనటి హైకోర్టును ఆశ్రయించాక, బలవంతంగా నమూనాలు తీసుకోరాదన్న ఆదేశం జారీ అయింది. చట్టం అందుకు అనుమతించదని పోలీసు అధికారులకు తెలియదా? డ్రగ్స్ వాడకం గూర్చి ఓ డజను ఐటి కంపెనీలను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక సమాచారం పంపటంతో స్టార్ గ్లామర్ ఉన్న సినిమారంగం, అధిక ఆదాయమున్న ఐటి రంగం ఉద్యోగులు పబ్‌లు, క్లబ్‌లకు అలవాటుపడి మత్తుకు బానిసలవుతున్నారేమోనన్న ఊహాగానాలకు దారితీసింది. అంతకుముందు కొన్ని పేరున్న స్కూళ్ల హెడ్మాస్టర్లకు హెచ్చరికలు పంపటంతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైనారు.
అయితే శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్వహించిన సమీక్షా సమావేశంనుంచి వెల్లడైన సమాచారం ఆబ్కారీ, ఎక్సైజ్ అధికారుల హడావుడి కొంత అతిని సూచిస్తున్నది. వారు అప్పటికి సినీరంగానికి చెందిన 12 మందితోపాటు 27మంది ఇతరులను విచారించారు. ఇద్దరు విదేశీయులతోపాటు 22 మందిని అరెస్టు చేశారు. వారిలో సినీరంగానికి చెందిన వారెవరూ లేరు. కేసు దర్యాప్తులో డ్రగ్స్ వాడకందారులను క్లూ (ఆధారాలు రాబట్టే మార్గం–) గా వాడుకుంటున్నారు. స్పెయిన్, థాయిలెండ్, పోర్చుగల్, నైజీరియా, నెదర్లాండ్స్, కొలంబియా నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు గుర్తించారు. సినీరంగం లక్షంగా విచారణ సాగుతున్నదనే ప్రచారాన్ని, పరిశ్రమలో భారీగా డ్రగ్స్ వాడకం ఉన్నట్లు సాగుతున్న ప్రచారాన్ని పోలీసు ఉన్నతాధికారులు తిరస్కరించారు.
కాగా ముఖ్యమంత్రి ప్రసంగం ప్రజలకు కొంత భరోసా ఇచ్చేదిగా ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు చెడ్డపేరు రాకూడదనే, డ్రగ్స్ మూలాలు ఛేదించేలా లోతుగా దర్యాప్తు జరపమని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. సామాజిక రుగ్మతల గూర్చి సమాచారమిచ్చే వారికి లక్షరూపాయలు బహుమానం ప్రకటించారు. కల్తీలను అరికట్టే సందర్భంలోనే డ్రగ్స్ వాడకం గూర్చి సమాచారం లభించిందన్నారు. “డ్రగ్స్ సరఫరా చేసేవారు, అమ్మేవారు, దందా చేసేవారు ఎవరైనా క్షమించేది లేదు. వాడకందారులు అలవాటు బంద్ చేసుకోవాలి. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోలీసులకు సమాచారమివ్వాల’ని సిఎం కోరారు. డ్రగ్స్ సేవించినవారు ఎవరైనా పోలీసులకు దొరికి ఉంటే శిక్ష భయం నుంచి బయటపడవచ్చు.
సిఎంకు పోలీసు అధికారుల నివేదిక ప్రకారం, ‘దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డ్రగ్స్ సమస్య ఉంది. చాలా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో వాడకం చాలా తక్కువ. నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో గణాంకాల ప్రకారం డ్రగ్స్ వినియోగించే రాష్ట్రాల్లో తెలంగాణ లేదు. నగరాల జాబితాలో హైదరాబాద్ లేదు. కొద్దిపాటి వాడకం మాత్రం ప్రారంభమైంది’ అని అధికారులు తెలిపారు. దీన్నిబట్టి పోలీసు తీరు గోటితో పోయే దానికి గొడ్డలి ఉపయోగించినట్టుంది. పోలీసు విచారణ హంగామా గమనించే ఎవరికైనా డ్రగ్స్‌కు హైదరాబాద్ అడ్డాగా మారిందన్న అభిప్రాయం కలుగజేస్తుంది. విశ్వనగరంగా అభివృద్ధి చేయతలపెట్టిన నగరం గూర్చి అటువంటి అప్రతిష్ట దాని అభివృద్ధికి చేటుచేస్తుంది. డ్రగ్స్ మూలాల్లోకి వెళ్లే ప్రయత్నం మంచిదే. అదుపు చేయగలరుగాని అరికట్టటం అసాధ్యం. ఎందుకంటే అంతర్జాతీయ రహస్య వ్యాపారాల్లో డ్రగ్స్ ఒకటి. నిరంతరం అప్రమత్తతే నిరోధకశక్తిగా పనిచేస్తుంది.