Home తాజా వార్తలు పులుల జాడ కోసం అధికారుల పరుగులు

పులుల జాడ కోసం అధికారుల పరుగులు

TIGERమనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః అటవీ ప్రాంతంలో గత వారం రోజులుగా పులుల కదలికలు పెరగడంతో అటవీశాఖ అధికారులు వాటి ఆచూకీ కోసం పరుగులు తీస్తున్నారు. పులులను సురక్షితంగా కవ్వాల్ టైగర్ జోన్‌కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి రోజు ఒక చోట పులులు సంచరిస్తున్నట్లుగా సమాచారం అందడంతో అధికారుల్లో గుబులు రేగుతుంది. గత ఏడాది కోటపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు విద్యుత్ షాక్‌ను అమర్చి చిరుత పులిని హతమార్చిన సంఘటన నేపథ్యంలో ఈ ప్రాంతంలోని అడవుల్లో సంచరిస్తున్న పులులకు వేటగాళ్ల ఉచ్చుతో ముప్పు వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికారులు బావిస్తున్నారు. వేమనపల్లి, కోటపల్లి, నెన్నెల, మండలాల్లోని అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నట్లుగా అటవీ అధికారులకు సమాచారం అందడంతో సిసి కెమెరాలను పరిశీలించి పులుల కదలికలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. వారం రోజుల క్రితం కాసిపేట మండలం దేవాపూర్ వద్ద ఒక పులి రెండు పిల్లలతో కలసి రోడ్డు పక్క నుంచి వెళ్లిందని స్థానికులు అటవీ అధికారులు సమాచారం అందించారు. అదే విధంగా నెన్నెల గ్రామ శివారులలో పులి కనిపించిందని, అంతే కాకుండా రెండు పశువులను హతమార్చింది. కోటపల్లి మండలంలో కూడా పులులు పశువులను చంపడంతో అటవీ అధికారులు రంగంలోకి దిగి పులుల అడుగులను పరిశీలించారు. అంతే కాకుండా సిసి కెమెరాల్లో చిక్కిన పులుల ఫొటోలను పరిశీలించి సుమారు మూడు పులులు,రెండు పిల్లలతోకలిసి తిరుగుతున్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటిని సురక్షితంగా టైగర్ జోజుకు తరలించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. వేమనపల్లి, నిల్వాయి అటవీ ప్రాంతంలో పులులు తిరుగుతున్నాయని, నెల రోజుల క్రితమే అటవీ అధికారులకు తెలిసినప్పటికీ బయటకు పొక్కనియలేదు. ఇటీవల ఒక ఆవు, దూడను హతమర్చడంతో గ్రామస్థులు భయాందోళనకు గురువుతున్నారు. మహరాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేంద్రం నుంచి సిర్పూర్ అడవుల మీదుగా పులులు మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లోని అడవుల్లో సంచరిస్తున్నాయి. సిర్పూర్ అటవీ డివిజన్‌లో పులుల పాదాల ముద్రలను అధికారులు గుర్తించారు. బెజ్జూర్, కౌటాల, సిర్పూర్, దహెగాం, వేమనపల్లి, కోటపల్లి, నెన్నెల ప్రాంతాల్లో భారీగా అడవులు విస్తరించి ఉండడంతో అటవీ అధికారులు పులుల సంచారాన్ని కనిపెట్టలేకపోతున్నారు. సిసి కెమెరాలు పులుల కదలికలను అడుగడుగునా వెంటాడినప్పటికీ అధికారులు అక్కడికి వెళ్లే సమయానికి పులులు వేరే ప్రదేశానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని జన్నారం టైగర్ జో న్‌లో దాదాపు 10 పులులు ఉన్నట్లుగా అటవీ అధికారులు భావిస్తున్నారు. కాగజ్‌నగర్ మండలంలోని కడంబ అటవీ ప్రాంతం నుంచి వేమనపల్లి, కోటపల్లి, నెన్నెల అడవుల వరకు పులులు సంచరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇటీవల బెజ్జూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని స్వల్ప గాయాలతో ఒక పులి బయటకు వచ్చి నిల్వాయి, కోటపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు భావిస్తున్నారు.ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లా నుండి జన్నారం టైగర్ జో న్‌లో 220 వరకు సిసి కెమెరాలను అమర్చారు. అదే విధంగా నీల్వాయి, బెల్లంపల్లి రేంజీల పరిధిలో దాదాపు 60 సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, పులుల కదలికలను, పాదాల ముద్రలను పరిశీలిస్తున్నారు. పులుల కదలికలను తెలుసుకోవడంలో సిసి కెమెరాలు కీలకం కాగా ప్రతిరోజు అటవీ అధికారులు సిసి పుటేజీలను చూస్తున్నారు. నాలుగేళ్లకోసారి చేపట్టే వన్యప్రాణుల గణన వచ్చే జనవరి నెలలో చేపట్టే అవకాశాలు ఉండగా ఇటీవలి కాలంలో పులులు గ్రామ శివారులోకి వస్తుండడంతో అటవీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఏదిఏమైనా అటవీ ప్రాంతాల్లో పులుల సంరక్షణ అటవీ అధికారులకు సవాల్‌గా మారింది.