Search
Monday 24 September 2018
  • :
  • :

రూపాయి గతి ఇంతేనా?

Oil prices are rising

చమురు ధరలు పెరుగుతున్నాయి. రూపాయి విలువ పడిపోవడం, చమురు ధరలు పెరగడం మధ్య ఆర్ధికవ్యవస్థ  చిక్కుకుపోయింది. రూపాయి విలువ పడిపోవడం వల్ల దేశంలో చమురు ధర మరింత ఎక్కువైపోతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రోజువారీ ఖర్చులు సగటు మనిషికి పెరిగిపోతాయి. ఇప్పుడు డాలరుకు రూపాయి మారకం విలువ 71 రూపాయలు దాటి పోయింది. ఫోరెక్స్ నిపుణుల ప్రకారం ఇది 75 రూపాయల వరకు పడిపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కరెన్సీ కూడా విలువపడిపోతుందని సర్ది చెప్పుకునే పరిస్థితి కాదు మనది. ప్రపంచంలో ఒక బలమైన రాజ్యంగా నిలబడాలంటే రూపాయి బలంగా ఉండాలి. రూపాయి విలువ మరింత పడిపోతే ఆర్ధికవ్యవస్థపై పెనుభారం పడుతుంది. బలహీనమైన కరెన్సీ బలహీనమైన ఆర్ధికవ్యవస్థకు నిదర్శనం.

రూపాయి రోజురోజుకు బక్కచిక్కిపోతోంది. ఇప్పుడు ఒక డాలరుకు 71 రూపాయలు దాటి పోయింది. ఈ సంవత్సరం రూపాయి విలువ 9 శాతం పతనమైంది. రూపాయి విలువ పడిపోడానికి అంతర్జాతీయ పరిస్థితులే కారణాలని ప్రభుత్వం సర్ది చెప్పుకుంటూ గడిపేస్తుంది. ఇదంతా తాత్కాలికమేనని, మరలా రూపాయి పుంజుకుంటుందని ధైర్యం చెప్పుకుంటోంది.
ఒక సమస్య లేదని కళ్ళు మూసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక సమస్యల విషయంలో ఇదే విధంగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి ఎన్డీయే ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థ విషయంలో ఎన్నడూ పట్టించుకోలేదన్నది ఒక వాస్తవం. ఆర్ధిక వ్యవస్థ నేడు అస్తవ్యస్తంగా కనబడుతుందంటే దానికి కారణం విధానపరంగా, సంస్థాగతంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే.
నోట్ల రద్దు వల్ల భారత ఆర్ధిక వ్యవస్థపై పడిన భారం అసాధారణమైనది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్టులో భారత రూపాయిపై నమ్మకం సన్నగిల్లింది. అంతర్జాతీయ మార్కెట్టులో భారత రూపాయి విశ్వసనీయతను పెంచడానికి ప్రయత్నించే బదులు ఈ ప్రభుత్వం నోట్ల రద్దుతో రూపాయి నడుం విరిచింది. అది కూడా అంతర్జాతీయ మార్కెట్టులో సానుకూల పరిస్థితులున్నప్పుడు వాటిని ఉపయోగించుకునే బదులు నోట్ల రద్దుకు పూనుకోవడంతో అదునుగా లభించిన అవకాశాలను భారతదేశం కోల్పోయింది. ఇప్పుడు పరిస్థితి ఏమంటే, 18 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు. దాదాపు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల లోటు. గత 62 నెలలుగా ఇంత లోటు ఎన్నడూ లేదు. రూపాయి విలువ పడిపోవడం వల్ల దిగుమతుల ఖర్చు పెరిగిపోతోంది.
అయితే, రూపాయి విలువ పతనం వల్ల సైద్ధాంతికంగా చూస్తే ఎగుమతులు పెరగాలి. అది ఎగుమతి రంగంలో ప్రోత్సాహంగా ఉండాలి. ఎగుమతులు పెరగాలంటే మన వద్ద మిగులు అధికంగా ఉండాలి. కాని ఎగుమతుల రంగంలో పెరుగుదల రేటు సింగిల్ డిజిట్ దాటటం లేదు.మేక్ ఇన్ ఇండియా గురించి మాటలే తప్ప ఆచరణలో ఏమీ కనిపించడం లేదు. మేక్ ఇన్ ఇండియా ద్వారా భారత ఎగుమతులను ఆకాశాన్నంటేలా చేస్తామన్న మాటలే తప్ప ఈ నాలుగేళ్ళలో మరేమీ జరగలేదు. దిగుమతుల ఖర్చు పెరిగిపోవడం, ఎగుమతుల రంగంలో పోటీ సామర్థ్యం కోల్పోవడం దీనికి కారణాలు. దీనివల్ల వాణిజ్య లోటు మరింత పెరుగుతుంది.
మరోవైపు చమురు ధరలు పెరుగుతున్నాయి. రూపాయి విలువ పడిపోవడం, చమురు ధరలు పెరగడం మధ్య ఆర్ధిక వ్యవస్థ చిక్కుకుపోయింది. రూపాయి విలువ పడిపోవడం వల్ల దేశంలో చమురు ధర మరింత ఎక్కువైపోతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రోజువారీ ఖర్చులు సగటు మనిషికి పెరిగిపోతాయి.
ఇప్పుడు డాలరుకు రూపాయి మారకం విలువ 71 రూపాయలు దాటి పోయింది. ఫోరెక్స్ నిపుణుల ప్రకారం ఇది 75 రూపాయల వరకు పడిపోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల కరెన్సీ కూడా విలువపడిపోతుందని సర్ది చెప్పుకునే పరిస్థితి కాదు మనది. ప్రపంచంలో ఒక బలమైన రాజ్యంగా నిలబడాలంటే రూపాయి బలంగా ఉండాలి. రూపాయి విలువ మరింత పడిపోతే ఆర్ధిక వ్యవస్థపై పెనుభారం పడుతుంది.
బలహీనమైన కరెన్సీ బలహీనమైన ఆర్ధిక వ్యవస్థకు నిదర్శనం. బలహీనమైన ఆర్ధికవ్యవస్థ బలహీనమైన దేశానికి నిదర్శనం అంటారు. బలమైన దేశంగా, ప్రపంచ శక్తిగా నిలబడాలనుకుంటున్నప్పుడు రూపాయి విలువ పడిపోకుండా నిలబెట్టడం చాలా అవసరం. ప్రభుత్వమూ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి తగిన చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ పరిస్థితులు మారే వరకు వేచి చూడడంలో విజ్ఞత లేదు. మన ఆర్ధిక వ్యవస్థను బయటి ప్రభావాలను తట్టుకునేదిగా రూపుదిద్దాలి.
రూపాయి విలువ 70 కి చేరుకున్న తర్వాత రిజర్వు బ్యాంకు డాలర్లను జాతీయ బ్యాంకుల ద్వారా అమ్మేసింది. ఆ విధంగా రూపాయి మరింత విలువ పడిపోకుండా చర్యలు చేపట్టింది. కాని ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. డాలర్లను అమ్మేయడం వల్ల బ్యాంకులపై పడే ప్రభావమూ ఉంటుంది. ఇలాంటి చర్యలు గట్టి పరిష్కారాలు కావు. దేశంలో ఆర్ధిక వ్యవస్థ బయటి ప్రభావాలను తట్టుకునేదిగా ఎలా రూపొందించాలన్నది ఆలోచించాలి. మన ఎగుమతి రంగంలో పోటీ సామర్థ్యాన్ని పెంచాలి. ఎగుమతులు పెరిగేలా చూడాలి. దిగుమతి సుంకాలను పెంచడం వల్ల పెద్దగా ప్రయోజనమేమీ లేదు. అలాగే వడ్డీ రేట్లు పెంచడం వల్ల కూడా దీర్ఘకాలిక ఫలితాలేవీ ఉండవు. చేయవలసింది ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం. అది చేయగలిగితే రూపాయి బలం పుంజుకోవడం ప్రారంభిస్తుంది.
భారత ఆర్ధిక వ్యవస్థను పటిష్టపరిచే ప్రయత్నాలు తక్షణం చేపట్టవలసి ఉంది. లేకపోతే మోడీ ప్రభుత్వ కాలంలో ఆర్ధిక వ్యవస్థ కోలుకోలేని స్థాయికి పడిపోతుంది.

Comments

comments