Home తాజా వార్తలు వడ్డీ రేటులో మార్పు లేదు

వడ్డీ రేటులో మార్పు లేదు

Oil prices rise ahead of sanctions against Iran crude exports

రెపో రేటు 6.5 శాతం కొనసాగింపు
ద్రవ్యోల్బణం లక్షం 4 శాతం
జిడిపి వృద్ధి రేటు అంచనా
7.4 శాతం
చమురు ధరలు, ట్రేడ్‌వార్‌తో వృద్ధికి విఘాతం : ఆర్‌బిఐ

ముంబై : నిపుణుల అంచనాలకు విరుద్ధంగా ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి వడ్డీ రేటు 6.5 శాతాన్ని యథాతథంగానే కొనసాగించింది. అయితే చమురు ధరల పెరుగుదల, మార్కెట్లలో ఒడిదుడుకులు, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణానికి ప్రమాదకరమని హెచ్చరించింది. శుక్రవారం నాలుగో ద్వైమాసిక విధాన సమీక్షలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈ ప్రకటన చేశారు. ఉర్జిత్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన ఎంపిసి(ద్రవ్య విధాన కమిటీ)లో ఐదుగురు రెపో రేటు యథాతథానికే ఓటు వేశారు. ఒక సభ్యుడు చేతన్ ఘాటీ మాత్రం 0.25 శాతం పెంచాలని ప్రతిపాదించారు. కొద్ది రోజులుగా విశ్లేషకులు ఆర్‌బిఐ సమీక్షలో 0.25 శాతం మేర వడ్డీరేటును పెంచవచ్చని అంచనా వేశారు. కానీ ఆర్‌బిఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచేందుకే మొగ్గు చూపింది. ప్రస్తుతం రేపో రేటు 6.5 శాతం వద్ద ఉండగా, రివర్స్ రేపో రేటు 6.25గానే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం పాలసీ దృక్పథం ‘తటస్థం’ నుంచి ‘అవసరం మేరకు చర్యలు’ చేపట్టాలనే విధానాన్ని నిర్ణయించింది. ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత రూపాయి విలువ పతనమై తొలిసారిగా 74 స్థాయిని అధిగమించింది. మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం లక్షం 4 శాతాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నామని ఎంపిసి స్పష్టం చేసింది. అక్టోబర్  రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను 3.8   శాతానికి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి రేటు అంచనాను 7.4 శాతంగా కొనసాగించింది. ఇటీవల పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ సుంకం ద్రవ్యోల్బణం అదుపునకు సహకరిస్తుందని ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడ్డారు.

ఆర్‌బిఐ పాలసీ ముఖ్యాంశాలు
ఆర్‌బిఐ కీలక వడ్డీ రేటు(రెపో) 6.5 శాతాన్ని యథాతథంగా కొనసాగించింది.
రివర్స్ రెపో రేటు 6.25 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతం, సిఆర్‌ఆర్ 4 శాతం
అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను 3.8 శాతానికి పెంచింది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి రేటు అంచనాను 7.4 శాతంగా కొనసాగించింది
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉండడం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ప్రతికూల పరిస్థితులకు దారితీస్తుంది.
పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కాస్త నిలువరించవచ్చు.
చమురు ధరల పెరుగుదల ఆదాయాన్ని తగ్గించనుందని, కార్పొరేట్ల లాభాలు తగ్గనున్నాయి.
క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉండడంతో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి.
అంతర్జాతీయంగా, దేశీయంగా ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారాయి. ఇది పెట్టుబడులపై ప్రభావం చూపుతోంది.
ఎగుమతుల్లోనూ అనిశ్చితి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కేంద్రం, రాష్ట్రాల వద్ద ఆర్థిక గణాంకాల్లో వ్యత్యాసం ద్రవ్యోల్బణానికి దారితీసే పరిస్థితులు, మరోవైపు స్టాక్‌మార్కెట్లలో ఒడిదుడుకులు తీవ్రం కావడం, ప్రైవేటు పెట్టుబడులు తరలిపోవడం
పలు ప్రమాద సంకేతాల నేపథ్యంలో వచ్చే కొద్ది నెలల్లో ద్రవ్యోల్బణం దృక్పథంను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
వాణిజ్య యుద్ధం ఆందోళనలు, ఒడిదుడుకులు, చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ద్రవ్యోల్బణం, దేశీయ వృద్ధి రేటుకు సవాల్‌గా మారాయి.
దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మరింతగా పఠిష్టం చేయాలని పిలుపు.
వచ్చే ఆర్‌బిఐ సమీక్ష డిసెంబర్ 35 తేదీల్లో జరగనుంది.

ఈ నిర్ణయం ‘తప్పు’: విశ్లేషకులు

ద్రవ్యపరపతి విధాన సమీక్ష(ఎంపిసి)లో వడ్డీ రేట్లను 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించడం ఒక తప్పిదమని చాలా వరకు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ మరోసారి 900 పాయింట్లు కుప్పకూలింది. సిపిఐ(వినిమయ ధరల సూచీ) ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతం చేరుకోవాలనే ప్రభుత్వం మధ్యకాలిక లక్షంను దృష్టిలో పెట్టుకుని ఎంపిసి నిర్ణయం తీసుకుంది. ఎంపిసి తీసుకున్న నిర్ణయంతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి చారిత్రక కనిష్టానికి పడిపోయింది. డాలర్‌పై రూపాయి విలువ 74ను దాటింది. ఆర్‌బిఐ ఈసారి 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటును పెంచుతుందని భావించారు. అయితే అంచనాలకు విరుద్ధంగా కీలక రేటును యథాతథంగా కొనసాగించింది. ఎంపిసి సమావేశంపై నిపుణులు చెప్పిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

వర్ధమాన మార్కెట్లకు అనుగుణంగా ఉండాలి

అక్టోబల్ పాలసీలో వడ్డీ రేట్లను పెం చకపోవడం ఆర్‌బిఐ చేసిన ఒక త ప్పింద. అంతర్జాతీయంగా కఠిన పరి స్థితుల్లో మనం ఉన్నాం, భారత్ శూన్య ప్రదేశంలో ఏమీ లేదు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచడం, వర్ధమాన మా ర్కెట్లు రేట్లను పెంచడం, ఈ ధోరణిని అనుసరిస్తే ఆర్‌బిఐ పరిస్థి తులకు అనుగుణంగా వ్యవహరించినట్టవుతుంది. రూపాయి రో జు రోజుకీ మరింతగా పతనమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బిఐ నిర్ణయం యథాతథంగా ఉండడం సహాయం చేయదు.
       – డిబిఎస్ చీఫ్ ఎకనమిస్ట్ తైమూర్ బేగ్

గణాంకాల  దృష్టా నిర్ణయం

ఆర్‌బిఐ నిర్ణయంతో మార్కెట్లు అత లా కుతలం అయ్యాయి. కరెన్సీ, అస్సెట్ మార్కెట్లలో కరెక్షన్ చూస్తున్నాం. ఆర్‌బిఐ తీసుకున్న ఆశ్చర్యకరమైన నిర్ణయం ద్రవ్యోల్బణం అంచనా ప్రకారం వచ్చింది. ఆహార పధార్థాల ధరలు తగ్గు ము ఖం పట్టాయనే గణాంకాల మేరకు నిర్ణయం ఉంది. భవిష్య త్ అంశాల దృష్టా దేశీయ ఆర్థిక వ్యవస్థపై నిర్ణయం తీసుకోవాలి.
     – హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ అభీక్ బరువా

భవిష్యత్‌లో రేటు పెంపు

డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు మధ్యకాలికంగా వివిధ స్థూల ఆర్థిక గణాంకాలపై ప్రభావం చూపనున్నాయి. దేశీయ ద్రవ్యలభ్యతను రెగ్యులేటరీ సంస్థ సమీక్షిస్తూ ఉండాలి. ఈ కీలక వడ్డీ రేట్ల యథాతథం తాత్కాలికంగానే, సమీప భవిష్యత్‌లో రేటు పెంపును చూడవచ్చు.
   – టాటా క్యాపిటల్ సిఇఒ రాజీవ్ సభర్వాల్

ప్రతికూల ప్రభావం చూపుతుంది

ఆర్‌బిఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ప్రస్తుత మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరగకుండా నియంత్రించేందుకు ఆర్‌బిఐ కూడా వడ్డీ రేట్లను పెంచాల్సి ఉంది. ఎగుమతులు, దిగుమతుల దృష్టా ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నాం.
– ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అభిమన్యు సోఫత్