Home తాజా వార్తలు కుప్పకూలిన మార్కెట్లు

కుప్పకూలిన మార్కెట్లు

bs

ముంబై: క్రితం రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడిందనే ఆనందం ఒక్క రోజులోనే కరిగిపోయింది. బుధవారం మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా, దేశీయ ప్రతికూల పరిస్థితులతో సెన్సెక్స్ 304 పాయింట్లు పతనమై.. ఆఖరికి 34,347 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 10,429 వద్ద ముగిసింది. ఆఖరి సమయంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లు తిరోగమనంలో ఉండడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడిందని నిపుణులు తెలిపారు. మరోవైపు రూపాయి ఏడాదిన్నర కనిష్టం 68.28ను తాకడం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైంది. ఎన్‌ఎస్‌ఇలో పిఎస్‌యు బ్యాంక్స్ ఎదురీది 3 శాతం లాభపడింది. మిగిలిన అన్ని రంగాలూ నష్టపోగా, మెటల్స్ అత్యధికంగా 4 శాతం పతనమైంది. ఇదే బాటలో రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, ఆటో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌పిసిఎల్, వేదాంతా, టాటా స్టీల్, బిపిసిఎల్, ఒఎన్‌జిసి, ఐఒసి, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్‌ఇండ్ 3 నుంచి 8 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు ఎస్‌బిఐ, సిప్లా, టెక్ మహీంద్రా, యుపిఎల్, ఎల్ అండ్ టి, ఎన్‌టిపిసి, టాటా మోటార్స్ లాభపడ్డాయి. మార్కెట్ల పతనం కారణంగా చిన్న షేర్లు బలహీనపడ్డాయి. బిఎస్‌ఇలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.25 శాతం స్థాయిలో నీరసించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1531 షేర్లు నష్టపోగా, 1127 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మంగళవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 1651 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 1497 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
వేదాంతా షేరుకు స్టెరిలైట్ ఆందోళన సెగ
తమిళనాడులో తూత్తుకుడిలో వేదాంతా లిమిటెడ్‌కు చెందిన స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా చెలరేఇన ఆందోళనలు స్టాక్ ఎక్సేంజీల్లో వేదాంతా షేరుపై ప్రభావం చూపాయి. బుధవారం మార్కెట్ ట్రేడింగ్‌లో వేదాంత గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆందోళనలు పలువురి మృతి, మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు వంటి పరిణామాలు వేదాంత షేరును దెబ్బతీశాయి. ఉదయం రూ.9.35 నష్టంతో రూ.260 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్ ముగిసే సమయానికి 7 శాతం నష్టపోయిన షేరు రూ.251 వద్ద స్థిరపడింది. తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ కర్మాగారాన్ని మూసివేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. ఇక్కడ ఉన్న రాగి కర్మాగారం సంవత్సరానికి 4 లక్షల టన్నుల రాగిని ఉత్పత్తి చేస్తుంది.

అమ్మకాల ఒత్తిడిలో ఆయిల్ షేర్లు

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు 80 డాలర్లు(బ్యారెల్) చేరడంతో దేశీయంగా పెట్రో రేట్లు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం చమురు రంగ షేర్లపైనా పడింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఒసి) కౌంటర్లు ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో నష్టపోయాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో హెచ్‌పిసిఎల్ షేరు 8 శాతంపైగా డౌన్ అయి రూ. 287 దిగువకు చేరింది. తొలుత రూ.284 దిగువన 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఇక ఐఒసి 4.2 శాతం పతనమై రూ.154 దిగువకు చేరింది. తొలుత రూ. 153 దిగువన ఏడాది కనిష్టానికి చేరింది.  క్యూ4(జనవరి-మార్చి)లో హెచ్‌పిసిఎల్ నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 1748 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 13 శాతంపైగా పెరిగి రూ. 59,184 కోట్లకు చేరింది. క్యూ4లో ఐఒసి నికర లాభం 40 శాతం పెరిగి రూ. 5218 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం కూడా 10 శాతం ఎగసి రూ. 1,36,981 కోట్లకు చేరింది. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు నాలుగేళ్ల గరిష్టాల వద్దే కొనసాగుతుండటం, డాలరుతో మారకంలో రూపాయి ఏడాదిన్నర కనిష్టం 68 దిగువకు చేరడం వంటి అంశాలు పెట్రో ఉత్పత్తుల మార్కెటింగ్ కంపెనీల షేర్లను దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడి చమురు సరఫరాలో 4శాతం ఎగుమతి వాటా కలిగిన ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఒపెక్ దేశాలు వ్యూహాత్మకంగా ముడి చమురు ధరను పెంచుకోవడానికి తమవద్ద ఉన్న చమురు నిల్వలను తగ్గించుకోవడం, వెనిజులా నుంచి ఎగుమతి కావాల్సిన చమురు పూర్తి స్థాయిలో ఎగుమతి కాకపోవడం తదితర కారణాలతో క్రూడ్ ఆయిల్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.