Home దునియా ముంతల కత

ముంతల కత

Taatalu

ఎపో అట్లాగుండ్రి! నేం జెప్పేది గిదీన్ని గురించి గాదు. గా పాతకాలపు కత. ముంతల కథ గజ్జెప్పుతినుండ్రి. గదింటె గిదేందో గూడ తెలుత్తది అని ముంతల కత జెప్పవట్టిండు తిరుపతిరెడ్డి. నువ్వు జెప్పే కతేందో నాకు మా ఎరికే తియ్యవోయ్. గా జగిత్యాల దిక్కయిన ముంతల కతే గద!

ఇగో గీ నడుమ నాలుగైదునెల్ల కిందట సిద్ధిపేటలో లగ్గమైంది. గదో తురుకోల్ల లగ్గమన్నట్టు. గా తురుకోల్ల లగ్గానికి హైదరాబాద్‌కెల్లి సిద్ధిపేటకు పెయినం. తప్పకుంట పొయ్యే లగ్గం గది. ఎందుకంటే గా పెండ్లికొడుకు నాయిన్న నా క్లాసుమేట్. పి.యు.సి, బీ.యస్సీ., నాలుగేండ్లు నాతోనే సదువుకున్నడు. అటెనుక ఇరువయేడేండ్లు నాతోనే నౌకరిజేసిండు. మరి గసోంటి లగ్గానికి పోకుంటెట్ల. మల్ల తురుకోల్ల లగ్గంల మటన్, చికెన్, బిర్యాని, కీర గిట్ట మస్తువెడుతరు. గవ్వి బగ్గదింటె గిప్పుడరిగి సత్తయా కని దోస్త్ కొడుకు గద పోవన్నని పెయిన. గా లగ్గానికి నాసోపతికాల్లు, నాతోని నౌకరి జేసినోల్లు నలుగురైదుగురచ్చిరి. గాల్లు గప్పుడు గిప్పుడు గూడ జిక్రి దోస్తులన్నట్టు. గాల్ల పేర్లేందంటె తిరుపతిరెడ్డి, ఎమ్మెస్‌రావు, మహేందర్‌రెడ్డి, అలీం, సత్తకుమారన్నట్టు. మేం కన్నాగురంల కాలేజిల సదువుకున్నం. రామగుండం ఎరువుల ప్యాక్టరీల నౌకర్లు జేసినం.

గది మూతవడ్డంక గూడిడ్సిన పచ్చులోలె ఎటోల్లటు వోయి మల్ల హైద్రాబాద్‌ల కల్సినం. మేమందరం కల్సినమంటె ఇగ నవ్వులే నవ్వులు. ఒగల మీనొగలు జోకులేసుకుంటం. సెల్ఫ్‌జోకులు గూడేసుకుంటం. ఇగ థిల్లగులే థిల్లగులన్నట్టు. గా ఎప్సీఐల ఉన్నప్పుడయితె బొత్తపగిలి పోతదన్నట్టు నవ్వుకునేటోల్లం. నవ్వు నాల్గువిధాల చేటుగాదు, నలభై విధాల మంచిదని మాకెరికే. రోజుకు పావుగంట, అర్ధగంటన్న నవ్వుకుంటె మంచిది. గందుకే కస్పూర్లల్ల గిప్పుడు లాఫింగ్ క్లబ్బులని పెట్టిండ్రు. మునుపు ఊళ్ళళ్ళ భాగోతులాడితె గండ్ల బుడ్డరఖాన్ హమారనాం బుడ్డరఖాన్, తండ్రీ పేరు గడెబెడఖాన్ అని మస్తు నవ్విచ్చెటోడు. మా ఊల్లెనైతె పట్వారిపంతులు, గా తుపాకి రాజన్న మాటమాటకో బూతుజోకేసి నవ్విచ్చెటోల్లు. ఇగ మేమందరం సానొద్దుల తర్వాత ఒక్కకాడ కల్సినం గద. మస్తు సంబురపడ్డం. ఇగ జోకులే జోకులు. నవ్వుడే నవ్వుడు. ఎనుకటి సంగతులన్ని యాజ్జేసుకుంట నవ్వవట్టినం. పక్కనుంచే కమ్మటి బిర్యాని ఆసనత్తంది. తురుకోల్ల లగ్గాలు తొందరగనే ఐతయిగని పెండ్లి పీటల మీది కచ్చుడే ఆల్చెమైతది. ఇంకెంతకు రారేందిరా అనుకుంట మాట్లాడుకోవడ్తిమి.

గింతల్నే మా తిరుపతిరెడ్డి స్వచ్ఛభారత్ గురించి మాట్లాడవట్టె. తిరుపతిరెడ్డి గురించి కొంచెమంత జెప్పాలె. నేను కథలు రాత్తె గయినె కతలు సెప్పుతడు. నాకు కథలిస్తడు. గయినె సెప్పేటియన్ని కతలే. గదే నోటి కతలసోంటియన్నట్టు. రాసే కథలకు వాస్తవికతనేది పానం గద! మరి సెప్పే కతలకు అరే కతలు జెప్పవడ్తవేందిరో, కతలు జెయ్యవడ్తివేందిరో అంటరు సూడు గసోంటియన్నట్టు. అంటె కల్పితాలన్నట్టు. గట్ల మా తిర్వతిరెడ్డి ఏద్దీసుకున్నా గదాన్ని గురించి కతజెప్తడన్నట్టు. గిప్పుడు మోడి స్వచ్ఛభారత్ గురించి మాట్లాడ్తడంటె గదాన్నో కత జేత్తడన్నట్టు. తిరుపతన్నా గిక్కడ గూడ కతలేనాయె అన్నడు మహేందర్. మరి లగ్గమై బువ్వవెట్టెదాకేం జేసుడు. ఏదో టైంపాస్ జెయ్యాలెగద! అన్నడు. అంటె గిప్పుడు మోడిసారు స్వచ్ఛభారత్ గురించి చెప్పుతవార తిరుపతన్న. మనదేశంల మనసోంటి సదువుకున్నోల్లు గూడ ఎక్కడ సందుగనవడితె గక్కడ ఒంటెలుక్కువోత్తరు. కుక్కగద కాల్లేపినట్టు జిప్పులిప్పుతరు. ఇగ సదువురానోల్ల సంగతెక్కడ? గా స్వచ్ఛభారత్ ఫొటోలకే కని నిజంగ సేసుడైతె కాదు. గా ఫొటోలకు ఫోజులిచ్చెటోల్లేనా రోడ్లను, పాయఖాన్లను సుబ్బురం జేసేది అన్నడు శ్రీనివాసరావు.

గిది మాత్తురం నిజమే మన శీనుగాడన్నది నూటికి నూరుపాల్లు నువ్వద్దే. ఎవ్వలైతె మోదీలు సుబ్బురం జేత్తండ్రో, పాయఖానాలెత్తిపోత్తండ్రో, రోడ్లు సుబ్బురం జేత్తుండ్రో గసోంటోల్ల బతుకులెట్లున్నయి? గాల్లకు కడుపులు గూడ నిండకుంటె మురికెట్ల వోతది? గాల్ల బతుకులను సూత్తె తప్ప గిసోంటి పనులు ఖ్యామాబ్ కావు అన్ననేను. ఎపో అట్లాగుండ్రి! నేం జెప్పేది గిదీన్ని గురించి గాదు. గా పాతకాలపు కత. ముంతల కథ గజ్జెప్పుతినుండ్రి. గదింటె గిదేందో గూడ తెలుత్తది అని ముంతల కత జెప్పవట్టిండు తిరుపతిరెడ్డి. నువ్వు జెప్పే కతేందో నాకు మా ఎరికే తియ్యవోయ్. గా జగిత్యాల దిక్కయిన ముంతల కతే గద! పుట్టు పూర్వొత్తరాలన్ని మ్యానమ్యామ కెరుకన్నట్టు నీ పుట్టుపూర్వొత్తరాలు మ్యానబావకెరుకేగద! నేన్నీకు మ్యానబావను గద! బావవెందుకైతవు బామ్మర్దివి. ఏదో పటు తన్ని పడేత్తేంది పడేసి తంతేంది? అటు ఇటయితె పొరపాటేం లేదుగని మీ పరాసికాలు మీకేనా. కత జెప్పనియ్యే తిరుపతన్నను అన్నడు సత్యకుమార్.
గప్పుడు కతజెప్పవట్టిండు తిరుపతిరెడ్డి.

ఇగో నువ్వు కతలు రాత్తవని అన్ని నీకే ఎరుకనుకోకు. గిది నీకొక్కని కెరుకంటె అందరికి తెలువద్వా? గీ కాలపు పొల్లగాండ్లకయితె గిసోంటియసలే తెలువయి. గాల్లకు తెలువన్ననే గిది సెప్పుతన్న. గిప్పుడయితే ఇంటింటికి పాయఖానలచ్చె. ఇండ్ల లోపల్నే పాయఖానలు కట్టుకోవట్రి. కని గప్పుడు పాయఖానలెక్కడియి? గిప్పటికి గూడ పల్లెటూళ్ళల్ల సానమంది ఇండ్లల్ల పాయఖానలు లెవ్వు. దొడ్డికి పోవన్నంటె ఊరవుతలికి పోవాలె. ఊరవుతల ఖాళి ఉన్న బూమికి పోవాలె. లేకుంటే సెరువుకట్ట దిక్కు పోవాలె. కాలువ ఒడ్లపొంటి పోయెటోల్లు గదంత రోతరోత. గది ఎడ్డికాలం గద! ఎవ్వలో బాగ పైసలున్నోల్ల ఇండ్లల్ల ఉప్పువోసి తవ్వినబొంద పాయఖానలుండేటియి. చెక్కల మీన కూసుండి పోయెటోల్లు. గప్పటి గీ సంగతులను తల్సుకుంటేనే పెయ్యి జలుదరిత్తది.

పట్నాలల్ల గూడ డ్రైపాయఖానలుండె. గాపాయఖానలు మేత్రానిల్లు ఎత్తిపోసేటోల్లు. గిదెంత గోరం? చేతులతోని, డబ్బాలతోని బక్కిట్లల్ల ఎత్తుకపోయి ఊరవుతల పారేత్తురు. గాళ్ళేం పాపం జేసిండ్రు? గా పని గాల్లే చేసేటోల్లు. గింత పాడుపని సేత్తే ఆల్లకు ఇచ్చేదెంత. గా పైసలో, బుత్తెమో గాల్ల కడుపుగూడ నింపకపోవు. ఇప్పటికి గూడ గిసోంటి పనులు పట్నాలల్ల సేత్తనే ఉన్నరు. గాల్ల బతుకులు ఘోరమైన బతుకులు. మన గలీజు మనం కడుక్కుంటానికే రోత గుంటదంటె మరి దేశం మురికి, ఇతర్ల గలీజంత ఎత్తిపోసే గాల్ల బతుకులేందన్నట్టు? గసోంటోల్ల బతుకులు బాగుపడితేనే గాల్లను సమానంగ జూసి సమానంగ పైసలిత్తనే స్వచ్ఛ భారతైన ఇంకేదైన గెలుత్తది. కని గాల్లను అట్లనే ఉంచి ఏమో సేత్తనంటె ఏమైతది. ఇగ గా సంగతి పోనియ్యిండ్రి గని ముంతల సంగతి గద సెప్పేది.

గప్పుడు మొగోల్లు ఆడోల్లు అందరు బహిర్భూమికి పోవన్నంటె ముంతలు వట్టుకపోదురు. చెంబులు వట్టుకపోదురు. గిప్పుడు రేకు డబ్బాలు, ప్లాస్లిక్ లోటాలు వాడుతున్నం గని గప్పుడయితె అన్ని కంచుముంతలే. కంచు చెంబులే. ముంతల్నో, చెంబుల్నో నీళ్ళు వోసుకొని ఊరు బైటికి లేకుంటె ఎక్కడ ఖాళి స్థలముంటే గాడికి పోయెటోల్లు. గీ పనినే ముంతవట్టుకపోవుడు, శంభటక్క పోవుడు అనేటోల్లు. అంటే ముంతల్నో, చెంబుల్నో నీళ్ళు వోసుకొని బహిర్భూమికి పోవుడన్నమాట. ఆడోల్లకైతె గిరో నరుకం. తెల్లారితె అంత బయిరంగమాయె. మసుకుల్నే లేసి పోదురు. నిండుముంత ఎదురచ్చిందంటె శుభమందురు. ఖాళి ముంత ఎదురైతే శుభం కాదందురు. ఆడోల్లు పాపం తెల్లారకముందే గా పనులు ఖతం జేసుకొని రావాలె. అందుకే ముసిముసి మబ్బుల్నే లేసిపోదురు. అమాస దినాలల్లనయితే చిమ్మచీకటుండేది.

గప్పుడు దొరల రాజ్జెం గద! ఆడోల్ల శీలాలకు ఇలువుండేది కాదు. అంతట గిట్లనే ఉన్నదని, ఉంటదని సెప్పుతలేనుకని సముర్తయిన ఆడది ముందుగాల దొరింటికే పోవాలె. అయితె ఆడోల్లు ముంతలు వట్టుకపోతరు గద! ఇంటికి తిరిగి పొయ్యెటప్పుడు ఎదురుంగ సుంకరచ్చెటోడట. దొర సెప్పితె దొర ఎవ్వలను కావాలనుకుంటె గాల్లను పట్టుకొని దొరింటికి తీసుకపోయెటోడు. ముంతతోనే పట్టుకపోయెటోడు. ఇగ ఆరోజామె జీవితం గా దొరకు పలారమయ్యేది. తెల్లారెదాక ఉంచుకొని ఎల్లగొట్టెటోడు. మల్లో రోజు ఇంకొగలన్నట్టు. గిట్లగా ఆడోల్ల బతుకులు నాశినమయ్యేటియి. గిట్ల తననుభగించిన ఆడోల్ల సంఖ్యెకు ఒక్కొక్క ఆడామెకు ఒక్క ముంతన్నట్టు.

గవ్వన్ని దొరగారి గడిల ఓ అర్రల ఉన్నయల. గిదెట్ల బైటికచ్చిందంటె గప్పట్ల తెలంగాణల బాగ నక్సలైట్ల లొల్లులున్నప్పుడు గాల్లు దొరింటిమీద దాడి జేసిండ్రట. గా అర్ర పలుగ గొట్టిండ్రట. గా అర్రనిండ దొండేళ్ళకు పొయ్యే ముంతలేనట. గవ్వన్ని లెక్కవెడితె ఇన్నూరు దాటినయట. అంటె గా దొర గంతమంది బతుకులు పాడు జేసిండన్నట్టు. గంతమందిని అనుబవించిండన్నట్టు. గిది ముంతల కత. గిది గా జగిత్యాల దిక్కున్న ఓ ఊల్లె జరిగింది. గప్పట్ల పేపర్లల్ల మస్తు వార్తచ్చింది అగో లగ్గం ఒప్పందాలు అయినట్టున్నయి. అతగాన్ని అలాయిబలాయి తీసుకొని దంచుదాం పా బిర్యాని అని లేసిండు తిరుపతి రెడ్డి. మేమందరం గూడ లేసినమ్. భలే కత జెప్పినవే తిర్పతన్న అన్నడు మహేందర్. అవుగదమరి అన్నమందరం. శనార్థులు.

-డా ॥కాలువ మల్లయ్య, 98493 77578