Home ఎడిటోరియల్ సవాళ్ళ రోదసిలో ఇస్రో

సవాళ్ళ రోదసిలో ఇస్రో

 on agreements with companies have signatories

ది ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, క్లుప్తంగా ఇస్రో గత వారం రోజులుగా చాలా బిజిగా ఉంది. అనేక సంఘటనలు ఒక దాని తర్వాత ఒకటిగా ఎదుర్కొంది. కాని ఇస్రో ఈ విషయమై బయటకు ఏమీ చెప్పలేదు. చాలా హఠాత్తుగా అత్యున్నత స్ధాయి మేనేజిమెంటులో మార్పులు వచ్చాయి. ప్రయివేటు కంపెనీలతో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఉపగ్రహాలకు సంబంధించిన పనుల గురించి ఒప్పందాలివి. మరో వైపు నేవిగేషన్ శాటిలైట్ ప్రోగ్రామ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రుడిపైకి యాత్రను పోస్టుపోన్ చేశారు. చంద్రయాన్ 2 షెడ్యూల్ మార్చడం వంటివి సంస్థలో ఆపరేషనల్ వ్యవహారాలు. ఆపరేషనల్ వ్యవహారాల్లోనే కాదు, పాలసీ విషయాల్లోను మార్పులు వచ్చినట్లు కనబడుతోంది.

కాని, వీటికి సంబంధించి ఇస్రో ఏ ఒక్క విషయంలోనూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వివరణ ఇవ్వాలని, సమాచారం అందించాలని కూడా భావించలేదు. ఇస్రో ఎల్లప్పుడు సామూహిక నాయకత్వం, కలిసి ప్రజాస్వామికంగా పనిచేయడం గురించి గొప్పగా చెప్పుకునే సంస్థ. అలాంటి సంస్థ ఇప్పుడు చాలా విషయాల్లో గుంభనగా ఊరుకోవడం కాస్త విచిత్రమైన విషయమే. రోదసీరంగం అనేది చాలా రిస్కులతో కూడుకున్న వ్యవహారం. పెట్టుబడులు వెనక్కి రాకపోవచ్చు. ప్రయోగాలు విఫలం కావచ్చు. స్పేస్ ఏజన్సీ ఏదైనా సరే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ముందుకు సాగుతుంది. గత రెండు దశాబ్దాలుగా ఇస్రో కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. అనేక సవాళ్ళను అధిగమించింది. గూఢచర్యం గురించిన కుంభకోణం దానివల్ల క్రయోజెనిక్ ఇంజన్ ప్రోగ్రామ్ ఆలస్యం కావడం, యాంట్రిక్స్ డేవాస్ స్పెక్ట్రమ్ స్కాండల్ వంటివే కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాజీ చైర్మనుకు, సిట్టింగ్ చైర్మనుకు మధ్య బహిరంగంగా జరిగిన వాగ్వివాదం, ఇప్పుడు అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటరు డైరెక్టర్ పదవి నుంచి తపన్ మిశ్రాను హఠాత్తుగా తొలగించడం ఇవన్నీ ఇస్రో ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళకు నిదర్శనాలు.

అహ్మదాబాద్ ప్రయోగశాలకు అధిపతిగా మిశ్రా కొనసాగి ఉన్నట్లయితే ఆయన ఆ తర్వాత ఇస్రో అత్యున్నత పదవికి కూడా అర్హుడయ్యేవాడు. ఏది ఏమైనా ఇవన్నీ ఇస్రో నిర్వహణకు సంబంధించిన విషయాలు. మేనేజిమెంట్ వ్యవహారాలు. కాని ఈ మార్పుల ప్రభావం ఇస్రో పనితీరుపై ఖచ్చితంగా పడుతుంది. ఇస్రో మేనేజిమెంట్ విధానంలో సైంటిఫిక్, ఆపరేషనల్, ఆడ్మినిస్ట్రేషన్ మూడు విభాగాలు ఒకే వ్యక్తి అధీనంలో ఉంటాయి. ఆయనే ఇస్రో చైర్మన్ కం డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీ. ఇస్రోలో యాంట్రిక్స్ దేవాస్ వ్యవహారంలో తలబొప్పి కట్టింది. ఇస్రో వాణిజ్య విభాగం యాంట్రిక్స్. యాంట్రిక్స్ దేవాస్ వ్యవహారానికి ముందు వరకు యాంట్రిక్స్ కూడా ఇస్రో చైర్మన్ అధీనంలోనే ఉండేది. ఇప్పుడు యాంట్రిక్స్ సంస్థకు స్వతంత్ర చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు. యాంట్రిక్స్ సంస్థపై అదుపు లేకపోయినా, ఇస్రో చైర్మన్, స్పేస్ డిపార్టుమెంట్ సెక్రటరీగా ఒకే వ్యక్తి ఉండడం వల్ల అధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. కనీసం ఇప్పుడైనా స్పేస్ డిపార్టుమెంట్ సెక్రటరీ, ఇస్రో చైర్మన్ పదవుల్లో వేర్వేరు వ్యక్తుల్ని నియమించడం గురించి ఆలోచించాలి.

రోదసీ కార్యకలాపాలకు సంబంధించి, అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ప్రయివేటు రంగం ప్రమేయాన్ని తపన్ మిశ్రా వ్యతిరేకించారు. ఈ విషయమై ఆయన బలంగా నిలబడ్డారు. అందువల్లనే ఆయన్ను అహ్మదాబాద్ సెంటర్ డైరెక్టరు పదవి నుంచి తప్పించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయమై ప్రస్తుతం పనిచేస్తున్న సైంటిస్టులు, రిటైర్డ్ సైంటిస్టులు కొంతమంది ఒక గ్రూపుగా కలిసి రాష్ట్రపతికి లేఖ కూడా రాశారు. వారి అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొన్నారు. “ఇది (అంటే ప్రయివేటైజేషన్ గురించి మిశ్రా అభిప్రాయం) నిజమైతే , మిశ్రాను బదిలీ చేయడం వల్ల సైంటిఫిక్ కమ్యునిటీ ఆత్మస్థయిర్యం దెబ్బతింటుంది. రాజకీయ నాయకత్వం చెప్పేది సైంటిస్టులు వినాలి అలా కాకుండా స్వతంత్రంగా సైంటిఫిక్ విచారణతో స్వంత అభిప్రాయం కలిగి ఉంటే మరో చోటికి పోవాలన్న సందేశాన్ని ఈ బదిలీ ద్వారా ఇస్తున్నారు.” అని ఘాటుగా లేఖ రాశారు.

తపన్ మిశ్రా ప్రయివేటేజైషన్‌ను వ్యతిరేకించడం వల్లనే ఆయన్ను బదిలీ చేశారన్న వార్తలు మీడియాలో కూడా వచ్చాయి. రెండు ప్రయివేటు కంపెనీలతో, ఒక ప్రభుత్వ రంగ సంస్థతో ఇస్రో 27 ఉపగ్రహాల తయారీ కాంట్రాక్టు కుదుర్చుకున్న తర్వాత తపన్ మిశ్రాపై బదిలీ వేటు కూడా వేశారు. ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి చీకటిలోను, మబ్బులు పట్టిన సమయంలోను గూఢచర్యం నిర్వహించగలిగిన ఉపగ్రహం రిసాత్ 1 తయారు చేసిన సైంటిస్ట్ తపన్ మిశ్రా. 34 సంవత్సరాలుగా ఆయన ఇస్రోలో పనిచేస్తున్నారు. అనేక ఉపగ్రహాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. స్పేస్ ప్రోగ్రాముల్లో ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వమూ, ఇస్రో రెండు భావిస్తుంటే దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలి. ఖచ్చితమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ప్రయివేటు రంగం స్పేస్ ఏజన్సీకి సప్లయర్ గా చాలా కాలం నుంచి ఉంది. అనేక విధాలుగా సహాయసహకారాలు అందిస్తోంది. కాని దేశంలో ప్రయివేటు రంగం స్వయంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలో పెట్టేందుకు అనుమతి ఇవ్వగలమా? ఈ విషయమై విస్తృతంగా చర్చలు జరగాలి. ఇస్రోలో పరిణామాల గురించి కాని, మార్పుల గురించి కాని, బదిలీల గురించి కాని, ప్రయివేటు పరం చేస్తున్న కాంట్రాక్టుల గురించి కాని బయటకు రావడం లేదు.

                                                                                                                                   – దినేష్ శర్మ (డైలీ ఓ)