Home ఎడిటోరియల్ మరో అఖ్లాక్

మరో అఖ్లాక్

Cow-Vigilante

అధికార పగ్గాలను ఆర్‌ఎస్‌ఎస్ తన చేతిలోకి తీసుకుందని, అదివారం ప్రాతిపదికపై పనిచేస్తుందనేది ఇప్పుడు స్పష్టం. అది ఒకవైపున, తన మత, కుల విభజన ఎజండాను ముందుకు తీసుకెళ్లే నిమిత్తం ఏదో ఒక సమస్యపై ఉద్రిక్తత సృష్టించటానికై తన వేర్వేరు విభాగాలను ప్రయోగిస్తోంది. రెండోవైపున, తమపై తమ సామ్రాజ్యవాద యజమానులు విధించిన ఆర్థిక నయా ఉదార ఎజండా అమలును వేగవంతం చేసేందుకు మోడీప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నది.

55 ఏళ్ల ఒక ముస్లిం పాశవిక హత్య తాజా ఘటన. అతడు తన ఇద్దరు కుమారులు, బంధువులతో కలిసి జైపూర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఆవులను హర్యానాలోని సొంత పట్టణానికి చట్టబద్ధం గానే రవాణా చేస్తున్నాడు. స్వయంప్రకటిత గోరక్షకులు ఆల్వార్ సమీపంలో ఆ రవాణా వాహనాలను నిలుపుచేసి వారిపై దారుణంగా దాడిచేశారు. బాధితులు వారికి నచ్చచెప్పటానికి శతవిధాల ప్రయత్నించారు. ఆవులను చట్టబద్ధంగానే కొన్న పత్రాలు చూపారు. అవి కబేళాకు ఉద్దేశించినవి కావు. అయితే బజరంగ్‌దళ్, విహెచ్‌పి ‘కార్యకర్తలు’గా చెప్పుకున్న ఆ గుండాలు బాధితులను కొట్టటం కొనసాగించారు. గోవులను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారు దుర్భర స్థితిలో ఆసుపత్రిలో చేరారు. వారిలో ఒకరు మూడురోజుల తర్వాత చనిపోయాడు. ఇతరులు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆవుమాంసం ఫ్రిజ్‌లో దాచాడన్న ఆరోపణపై రెండేళ్ల క్రితం దాద్రి(యుపి)లో జరిగిన అఖ్లాక్ అహ్మద్ హత్యకు ఇది ప్రతి రూపం. ఒక నెలరోజుల క్రితం అటువంటి అనుమానంతోనే జైపూర్‌లో ఒక హోటల్‌ను ధ్వంసం చేశారు, ఉద్యోగులను కొట్టారు.

రాష్ట్ర హోంమంత్రి, బిజెపి నాయకుడు ఈ హత్యను సమర్థించ టానికి ప్రయత్నించటం దిగ్భ్రాంతికరం. బజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలు సమీకరించిన గుంపు రోడ్డు మీద బాధితులను ఆపుచేసింది. వారిని చితక్కొట్టారు. అయితే ఇరుపక్షాల మధ్య ఘర్షణ జరిగిందని, పోలీసులు ఇరుపక్షాలపై కేసులు నమోదు చేశారని హోంమంత్రి అంటున్నాడు. వాస్తవం ఏమంటే, ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణపై ముస్లిం బాధితులపైనే కేసు నమోదు చేశారు. దాడి చేసినవారిని, ‘చేయి చేసుకున్నారని’ మందలించారు, అంతే. పెహ్లు ఖాన్ మరణం తర్వాత అలజడి రేగటంతో హత్యకేసు నమోదుచేసి, ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన బిజెపి ప్రభుత్వం రైతులకు చేసిన ద్రోహం నుంచి దృష్టి మరల్చేందుకై సోషల్ మీడియా సహా మీడియాలో ఆల్వార్ హత్యపై మాటల యుద్ధం మొదలుపెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన 15 రోజులకు తొలిసారి సమావేశమైన యోగి ఆదిత్యానాథ్ మంత్రివర్గం రైతుల రుణంపై ఒక ప్రకటన చేసింది. ఇదొక అభిప్రాయ ప్రకటన మాత్రమే. శాసనసభలో తదనుగుణమైన బిల్లును ప్రవేశపెట్టినపుడుగాని పరిస్థితి స్పష్టం కాదు. అయితే బిజెపి దగాకోరుతనాన్ని ఎండగట్టటానికి ఈ నిర్ణయం చాలు. బిజెపి అధికారంలోకి రాగానే చిన్న, సన్నకారు రైతుల రుణాలు రద్దు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ నుంచి వీధి ప్రచారకులవరకు వాగ్దానం చేశారు.

తొలి మంత్రివర్గ సమావేశం జరపటానికి యోగి 15రోజుల సమయం తీసుకున్నారు. రైతులకు రూ.1లక్ష వరకు రుణం మాఫీ చేయబడుతుందని మంత్రివర్గ సమావేశానంతరం ఒక మంత్రి పత్రికాగోష్టిలో చెప్పారు. 2 కోట్ల 15 లక్షలమంది రైతులు లబ్దిపొందుతారని ఆయన చెప్పారు. అయితే అదే సమయంలో విడుదల చేసిన ప్రభుత్వ ప్రకటన లబ్దిదారుల సంఖ్య 87లక్షలు అని తెలిసింది. లక్ష వరకు తీసుకున్న అన్ని రుణాలు కాదు, 2016 మార్చికి ముందు తీసుకున్న రుణాలే రద్దవుతాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం, చిన్న రైతుల బ్యాంక్ రుణాలు రూ. 62వేలకోట్లు. కాని ప్రభుత్వం కేవలం రూ. 36 వేల కోట్లే రద్దు చేస్తున్నది. అంటే ప్రకటన లోనే రుణగ్రస్థ రైతుల్లో 50 శాతాన్ని నిరాకరించింది. చట్టం చేసేటప్పటికి ఈ సంఖ్య ఇంకా తగ్గవచ్చు.

రుణ మాఫీ ప్రకటించేటప్పుడు , క్యాబినెట్ ఇతర నిర్ణయాలను నొక్కి చెప్పారు. యాంటీరోమియో దళాల కార్యక్రమం ముసుగులో రాష్ట్రంలో సాగుతున్న గుండాయిజాన్ని సమర్థించారు. పోలీసుల చేతిలో, ఆర్‌ఎస్‌ఎస్ నియోగించిన గుండాల చేతిలో వేధింపులు తప్ప వని ముఖ్యమంత్రి ప్రకటించారు. కోరుకున్న ఆహారాన్ని తినేందు కు ప్రజలకు గల హక్కును కాలరాస్తున్న గోరక్షకుల చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. మాంసం దుకాణా లపై, చట్టబద్ధంగా పనిచేస్తున్న కబేళాలపై దాడులు చేస్తూ, మూసి వేయిస్తూ లక్షలాదిమంది ఉపాధి హరిస్తున్న చర్యలను సమర్థించింది. ఇదిలావుండగా, ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటాన్ని మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. వయోవృద్ధులు సహా సామాన్య ప్రజల డిపాజిట్లపై వడ్డీ రేటు కోతపెడుతున్నది. అవినీతిపరులను రక్షించటానికై సమాచారహక్కు చట్టాన్ని నీరుగార్చటానికి ప్రయత్ని స్తున్నది. ప్రజలపై ఆర్థిక భారాలు మోపటానికై జిఎస్‌టి విధించ టానికి తొందరపడుతున్నది. ఇవన్నీ ఈ వారంలోనే జరిగాయి. మనం లేచి, ప్రతిఘటించకపోతే ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మరింతగా రెచ్చిపోతుంది.

-షమీమ్ ఫైజీ, సిపిఐ జాతీయ కార్యదర్శి
ఎడిటర్, న్యూఏజ్ వారపత్రిక