Search
Thursday 15 November 2018
  • :
  • :

ఫీకంపం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై అసెంబ్లీలో
4 గంటల పాటు ప్రతిపక్షం బైఠాయింపు, సాయంత్రం
6.30 గంటలకు బలవంతంగా ఖాళీ చేయించిన మార్షల్స్

assembly-tprహైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం తీరుకు నిరసనగా విపక్ష పార్టీల ఎంఎల్‌ఎలు శాసనసభ వాయిదా పడిన తరువాత ఆకస్మికంగా సభలోనే బైఠాయించారు. బకాయిల చెల్లింపుపై ముఖ్యమంత్రి సభకు ఇచ్చిన మాట నిలుపు కోకపోవడం, దీనిపై వివరణ కోరేందుకు అవకాశమివ్వకుండానే డిప్యూటీ స్పీకర్ సభను వాయిదా వేయడంపై వారు ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ(ఎం), బిజెపి, ఎంఐఎం సభ్యులు సభలోనే బైఠాయించారు. కొంత సేపటి తరువాత ఎంఐఎం, బిజెపి సభ్యులు స్పీకర్ వద్దకు వెళ్ళి వివరణకు అవకాశం ఇవ్వకపోవడంపై ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రతిపక్ష నాయకులు కె.జానారెడ్డి సహా కాంగ్రెస్, టిడిపి, సిపిఐ(ఎం)  ఎంఎల్‌ఎలు సుమారు నాలుగు గంటల పాటు సభలోనే బైఠాయించారు. అనంతరం సాయంత్రం 6ః30 గంటల సమయంలో మార్షల్స్ వీరందరినీ బలవంతంగా ఎత్తుకొని బైటికి తీసుకువచ్చారు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై శాసనసభలో బుధవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చకు ముఖ్య మంత్రి కెసిఆర్ చర్చకు సమాధానమిస్తూ ఒకేసారి ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

గతంలో ఈ ఏడాది ఏప్రిల్ నాటికి బకాయిలన్నీ చెల్లిస్తామని సిఎం స్వయంగా శాసనసభలో చెప్పిన విషయంపై వివరణ కోరేందుకు ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఎంఐఎం పక్ష నాయకులు అసదుద్దీన్ ఓవైసీలు తమ స్థానాల వద్ద లేచి వివరణ కోరేందుకు ప్రయత్నిస్తుండగానే స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి పట్టించుకోకుండా మధ్యాహ్నం 2.05 గంటల ప్రాంతంలో సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష శాసనసభ్యులు విస్మయం చెందారు.

ఇటీవల జరిగిన బిఎసి సమావేశంలోనే ప్రతిపక్షాలకు వివరణ కోరేందుకు, నిరసన చెప్పేందుకు అవకాశమిస్తామని హామీ ఇచ్చినా నిలుపుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అకస్మాత్తుగా సభలోనే బైఠాయించాలని నిర్ణయించారు. జానారెడ్డి సహా కాంగ్రెస్ సభ్యులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, టి.జీవన్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,టి. రామ్మోహన్‌రెడ్డి, పద్మావతి, ఎస్.ఎ.సంపత్‌కుమార్, సిహెచ్.వంశీచంద్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, టిడిపి సభ్యులు ఎ.రేవంత్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య, సిపిఐ(ఎం) సభ్యులు సున్నం రాజయ్య స్పీకర్ పోడియం చుట్టూ కిందనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎంఐఎం శాసనసభా పక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ, ఆ పార్టీ ఎంఎల్‌ఏలు, బిజెఎల్‌పి నేత కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు వారి స్థానాల్లో కొద్ది సేపు సభలోనే కూర్చొని అనంతరం స్పీకర్ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. సభ వాయిదా పడిన తరువాత కూడా సమావేశ మందిరంలోనే కూర్చోవడంపై అసెంబ్లీ కార్యదర్శి సదారామ్ రెండు సార్లు జానారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. చివరకు నాలుగు గంటల తరువాత వారందరిని మార్షల్స్ ఎత్తుకొని బైటికి తీసుకెళ్ళారు.ఇదిలాఉండగా, శాసనసభ్యులు సభలో నిరసన తెలియజేస్తు న్న సమయంలో అసెంబ్లీ వద్ద ఎన్‌ఎస్‌యుఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు ధర్నాకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments