Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఏరువాకతో రైతన్నలు బిజీబిజీ

On the farmer trail Farming in villages

పొలం బాట పట్టిన అన్నదాతలు
చక్కటి వర్షాలతో వెల్లివిరిసిన ఆనందం
పూర్తి కాని మట్టి నమూనాల పరీక్షలు

మన తెలంగాణ/భద్రాచలం : ఏరువాక సాగేరో అన్నో రైతన్నా… అంటూ రైతన్నలు నాగళ్లను భుజాలపై వేసుకుని పొలంబాట పట్టారు. మండుటెండలు మటుమాయమై చల్లని వాతారణం… ప్రకృతి జల్లులు సిరుసిరులుగా నేలను తాకుతున్న వేళ.. రైతన్నలు హలం పట్టి పొలం బాట పట్టడంతో పల్లెల్లో వ్యవసాయ సందడి నెలకొంది. దీంతో తెల్లావారు ఝూమునే నాగళ్లకు ఎద్దులను కట్టుకుని దారిపడుతున్నారు. తమ తమ పొలాల్లో నాగళ్ల చాళ్లను వేస్తూ ఇతర పొలాల్లో సైతం దున్నేందుకు సిద్ధమవుతున్నారు. కొద్దిగా మోతుబరి రైతులు తమ ట్రాక్టర్ల సహాయంతో పొలాలను దున్నుకుంటున్నారు. జూన్ మాసంలో జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్ష పాతం నమోదైంది. దీంతో రైతుల పొలాలు వర్షపు నీటితో నానడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గా సాధారణ సాగుకు రూ.1.25 లక్షల హెక్టార్ల భూమి ఉంది. ఈ మొత్తంలో ఈ ఏడాది సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందు కోసం 76 వేల క్వింటాళ్ల పలు రకాల విత్తనాలు అవసరం ఉంటాయని అధికారులు లెక్కలు తేల్చారు. కాగి 47 వేల హెక్టార్లలో పత్తి సాగుచేసేందుకు రైతులుసన్నద్దమవుతున్నారు. మరో ప్రక్క జిల్లా వ్యాప్తంగా పలు రకాల వరి వంగడాలను సాగు చేసేందుకు ఇప్పటికే రైతులు నార్లు పోశారు. వర్షాలు పడి నార్లు నాటుడు దశకు రావడంతో ఆయా పొలాలను దున్నుతున్నారు. 1001వరి 2500 క్వింటాళ్లు, 1010 వరి రకం 50 క్వింటాళ్లు, 1061 రకం 300 క్వింటాళ్లు నాటనున్నారు. అదే మాదిరిగా మినుములు 80 క్వింటాళ్లు, కందులు 140 క్వింటాళ్లు, వేరు శనగ 100 క్వింటాళ్లు, బొబ్బర 5 క్వింటాళ్లు, జనుము 200 క్వింటాళ్లు, జీలుగులు 150 క్వింటాళ్లు, పిల్లిపెసర 500 క్వింటాళ్లలో సైతం సాగుచేయనున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఖుషీ… ఖుషీగా ఉన్నారు. వేసవి కాలమంతా ఇళ్లకే పరిమితం అయిన రైతన్నలు వారి వారి పొలాలను సాగు చేసేందుకు కుటుంబ సమేతంగా పశుపక్షాదులతో కలిసి పొలంబాట పడుతూ ఏరువాకా సాగేరే అన్నో రైతన్న అంటూ రాగాలు తీస్తున్నారు. పొలాల్లో ఉన్న చీడపిడలను తొలగించుకునేందుకు అక్కడక్కడ నిప్పు పెడుతూ నేలలో ఉష్ణతత్వాన్ని పెంచుతున్నారు. దీంతో అ ప్రాంతంలో కేంద్రీకృతమైన ఉన్న నాశనకారి పురుగులు చనిపోతాయి. మరో ప్రక్క ఏఏ పంటలు సాగుచేసుకోవాలో ఇప్పటికే ఓ ఆలోచనకు వచ్చినరైతులు ఆయా విత్తనాలు కొనుగోలు చేసి ఇళ్లలో భద్రపరుచుకున్నారు. ప్రభుత్వం ద్వారా సబ్సిడిపై అందించే వాటిని సైతం తీసుకునేందుకు రైతుబంధు ద్వారా వచ్చిన నగదుతో సిద్ధంగా ఉన్నారు. మరో ప్రక్క రైతుబీమా ఉండటంతో రైతలంతా ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.
వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ నేటికి కొందరు రైతులకు రైతుబంధు పథకం అందలేదు. దీనిని రెండో విడతలో కలిపి ఇవ్వనున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏఏ పంటలకు భూమి అనుకూలంగా ఉందో తెలుసుకునేందుకు వ్యవసాయాధికారులు సీజన్‌కు ముందే మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తారు. కానీ సీజన్ ప్రారంభమైన రైతులు పొలాల్లో బిజీబిజీగా ఉన్నప్పటికి ఇంకా కొన్ని ప్రాంతాల్లో మట్టి నమూనాలు పూర్తి స్థాయిలో పరీక్షలు చేయలేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ప్రతీ ఏటా ఒకే రకమైన పంటను సాగు చేయడం ద్వారా భూమి సార దెబ్బతిని దిగుబడులు తగ్గే అవకాశం ఉండటంతో వ్యవసాయాధికారులు మట్టి నమూనాల ఆధారంగా రైతులకు సాగు చేయాల్సిన పంటలపై సూచనలు, సలహాలు అందజేస్తారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో, వాహన సదుపుయాలు విరివిగా ఉన్న ప్రాంతాల్లోకి మాత్రమే వ్యవసాయాధికారులు చేరుకుని మట్టి నమూనాలు సేకరించారని, మారుమూల ప్రాంతాల వైపు కనీసం కెన్నత్తి కూడా చూడలేదని ఆయా ప్రాంతాల రైతులు వాపోతున్నారు

Comments

comments