Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

సెన్సెక్స్ హై… గోల్డ్ డౌన్

price of the gold is decreased

37,337 పాయింట్లకు చేరిన సెన్సెక్స్

స్టాక్‌మార్కెట్లు రోజు రోజుకీ మరింత ఉత్సాహంతో దూసు కెళ్తున్నాయి. బుల్ వెనక్కి తిరిగి చూసుకోకుండా రంకెలు వేస్తోంది. మరోవైపు బంగారం ధర మాత్రం దిగొస్తోంది. స్టాక్ మార్కెట్ విషయాని కొస్తే సూచీలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ సూచీ 37 వేల మార్క్‌ను దాటింది. నిఫ్టీ కూడా 11, 283 పాయింట్లకు చేరుకుంది. ఇటు బంగారం ధర 10 గ్రాముల రూ. 190 తగ్గి రూ.30, 740కు చేరింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, దేశీయంగా డిమాండ్ లేకపోవడంతో పసిడి ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ముంబై: కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుండడంతో సెన్సెక్స్, ఇటు నిఫ్టీ సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. గురువారం సరికొత్త శిఖరాలకు చేరిన మార్కెట్ సూచీలు.. శుక్రవారం కూడా అంతకన్నా దూకుడుగా పైపైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 37,369వరకూ దూసుకెళ్లగా, నిఫ్టీ 11,283 వరకు పెరిగిం ది. చివరికి సెన్సెక్స్ 352 పాయింట్లు లాభపడి 37,337వద్ద నిలిచింది. 111 పాయింట్లు జమచేసుకున్న నిఫ్టీ 11,278 వద్ద స్థిరపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 27,661 వద్ద గరిష్ట రికార్డు అందుకుంది. అన్ని రంగాలూ లాభపడగా, ఎఫ్‌ఎంసిజి, మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్, ఆటో 1 నుంచి 2.4- శాతం మధ్య పెరిగాయి. మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీ లు 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1655 లాభపడగా, 969 మాత్రమే నష్టపోయాయి. ప్రధానంగా ఐటిసి 5 శాతం జంప్‌చేయ గా, ఐఒసి, టాటా మోటార్స్, హిందాల్కో, టైటన్, హెచ్‌పిసిఎల్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఐషర్, గెయిల్ 4 నుంచి -2 శాతం మధ్య పెరిగాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం నగదు విభాగంలో రూ. 2,453 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌చేశారు. అలాగే దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ.2716 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.

దిగొస్తున్న బంగారం ధర
శుక్రవారం 10 గ్రాముల పసిడి ధర రూ. 190 తగ్గడంతో రూ. 30,740కు చేరింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, దేశీయంగా డిమాండ్ ఆశించిన మేరకు లేకపోవడంతో బంగారం ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. అంతర్జాతీయంగా ఔన్స్ పసిడి ధర 0.73 శాతం తగ్గి 1,222 డాలర్లకు చేరింది. నగల వ్యాపారుల నుంచి పసిడికి డిమాండ్ తగ్గడం, అదే సమయంలో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం వంటివి బులియన్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ. 230 తగ్గి రూ. 39,200కు చేరింది. కాగా డాలర్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో, విలువైన మెటల్ బంగారానికి డిమాండ్ పడిపోతుందని, ఈ కారణంగానే బంగారం ధరలు తగ్గుతున్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 190 చొప్పున తగ్గి, రూ.30,740గా, రూ.30,590గా నమోదైంది. గత రెండు రోజుల్లో కూడా బంగారం ధరలు స్వల్పంగా 90 రూపాయలే పెరిగాయి.

22శాతం పెరిగిన బంగారం దిగుమతులు
గత ఆర్థిక సంవత్సరం(201718)లో 33.65 బిలియన్ డాలర్ల పసిడిని భారత్ దిగుమతి చేసుకుంది. గతేడాలో దేశంలో బంగారం దిగుమతులు 22 శాతం పెరిగాయి. 201617 ఆర్థిక సంవత్సరంలో ఈ దిగుమతులు 27.51బిలియన్ డాలర్లుగా ఉండగా, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 31.7 బిలయన్ డాలర్ల పసిడిని దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ వివరాలను వెల్లడించింది. పసిడి దిగుమతులు పెరగడంతో గతేడాది దేశీయ వాణిజ్య లోటు 157 బిలియన్ డాలర్లకు పెరిగిందని గణాంకాలు తెలిపాయి. ప్రపంచంలో భారత్ అత్యధికంగా పసిడిని దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఉంది. ప్రతి ఏడాది దేశంలోకి 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి అవుతుంది. అయితే ఇది వాణిజ్యలోటుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా దీనిపై దృష్టిపెట్టింది. మరోవైపు నగలు, వజ్రాల ఎగుమతులు పెంచాలంటే బంగారంపై ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటం వల్ల అవి దేశీయ ఎగుమతులపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని పారిశ్రామిక నిపుణులు భావిస్తున్నారు.

Comments

comments