Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

20 మందికొకరు

engr

ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తిని మార్చిన ఎఐసిటిఇ
కాలేజీల అనుమతి దరఖాస్తు రుసుము లక్ష రూపాయలకు పెంపు

హైదరాబాద్ : ఇంజినీరింగ్ లో విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తిలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఇ) స్వల్పంగా మార్పులు చేసింది. బి.టెక్, ఎంబిఎ కోర్సులలో 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాల నే నిబంధనను 20 మందిగా మార్పు చేశా రు. ఎం.టెక్‌లో విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తిలో ఎలాంటి మార్పు చేయలేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కళాశాలల అనుమతులు, నియమ నిబంధనలకు సంబంధించి ఎఐసిటిఇ సమాచార పుస్తకం (హ్యాండ్ బుక్) విడుదల చేసింది. గత ఏడాదితో పోల్చితే పలు అంశాలలో స్వల్ప మార్పులు చేసింది. డీమ్డ్ టు బి యూనివర్శిటీలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తమ కోర్సులకు ఎఐసిటిఇ అనుమతి తీసుకోవాలి. ఎక్కువ క్యాంపస్‌లు ఉంటే వాటికి విడివిడిగా ప్రత్యేకంగా అనుమతికి దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా అనుమతులకు దరఖాస్తు చేసుకునే కళాశాలలకు రుసుమును రూ. లక్ష వరకు పెంచారు. మెగా, మెట్రో నగరాల్లో గతంలో 1.5 ఎకరాల భూమి ఉండాలనే నిబంధనను ఎఐసిటిఇ తొలగించింది. సీట్ల ఆధారంగా నిర్మాణ ప్రాంతం ఉండాలని స్పష్టం చేసింది. పట్టణాల్లో కళాశాలలకు 2.5 ఎకరాల నుంచి 1.5 ఎకరాలకు, గ్రామీణ ప్రాంతంలో 7.5 ఎకరాల నుంచి 4 ఎకరాలకు తగ్గించారు. భవనాల నిర్మాణానికి పట్టణ ప్రణాళిక విభాగం అనుమతిని తప్పని చేసింది. దరఖాస్తు చేసుకునే ముందే సంబంధిత భవనాలకు అగ్నిపాపక శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెలిపింది. భవనాలు ఉన్న స్థలం మెగా, మెట్రో నగరంలో ఉందా లేక పట్టణ, గ్రామీణ ప్రాంతంలో ఉందా అనే విషయాన్ని సంబంధిత అధికారులు ధృవీకరించాలని పేర్కొంది. బోగస్ అధ్యాపకుల నిరోధించే చర్యల్లో భాగంగా అధ్యాపకుల వివరాలతో ఆధార్, పాన్ నెంబర్లను అనుసంధానం చేయాలని సూచించింది. వీటి ఆధారంగా వారికి ఒక గుర్తింపు సంఖ్యను కేటాయించే అవకాశం ఉంది. దీని వల్ల ఒకే అధ్యాపకుడు వేర్వేరు కళాశాలల్లో పనిచేస్తున్నట్లుగా చూపించుకునే అవకాశం ఉండదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కనీసం 30 శాతం ప్రవేశాలు లేని కళాశాలలపై ఎఐసిటిఇ చర్యలు తీసుకోనుంది. ఐదేళ్లుగా 30 శాతం ప్రవేశాలు లేని కళాశాలల్లో 50 శాతం సీట్లు తగ్గించడంతో పాటు ఐదేళ్లుగా జీరో అడ్మిషన్స్ నమోదైన కళాశాలలను రద్దు చేయనుంది. ప్రతి కళాశాలలో తప్పనిసరిగా యాంటి ర్యాగింగ్ సెల్ ఏర్పాటు చేసి, ర్యాగింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది.

Comments

comments