జ్యోతినగర్ : తెలంగాణలోని అతి పెద్ద పారిశ్రామిక కేంద్రమైన రామగుండంలో ఇఎస్ఐ వంద పడకల ఆసుపత్రిని వెంటనే చేపట్టాలని కార్మిక శాఖ కార్యదర్శి హీరాలాల్ సమారియాను ఆర్ టిసి చైర్మన్ స్థానిక ఎంఎల్ఎ సోమారపు సత్యనారాయణ కోరారు. శుక్రవారం హైదరాబాదులో హీరాలాల్ సమారియాను కలిసినట్టు ఆయన వివరించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కొనసాగిన బండారు దత్తాత్రేయ రామగుండంతో పాటు వరంగల్, హైదరాబాద్‌లలో ఇఎస్ఐ వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారని అన్నారు. రామగుండంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఇఎస్ఐ డిస్పెన్సరీలో సరైన సౌకర్యాలు లేవని అత్యధికంగా కార్మికులు కలిగి ఉన్న రామగుండంలో ఇఎస్ఐ వంద పడకల ఆసుపత్రి అత్యవసరం అని అన్నారు. ఇప్పటికే ఎన్టిపిసి సింగరేణి ఎఫ్ సిఐ లాంటి భారి పరిశ్రమలు కలిగి ఉండగా ఎన్టిపిసి మరో 1600 మెగావాట్ల యూనిట్ల విస్తరణ ఆర్ఎస్సిఎల్ ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణం సింగరేణిలో ఒసిపి గనుల విస్తరణ జరుగుతుందని కార్మికులకు సరిపడే అన్ని సౌకర్యాలతో ఇఎస్ఐ 100 పడకల ఆసుపత్రిని నిర్మాణం జరపాలని అన్నారు. ఇందుకు కార్మిక శాఖ కార్యదరిశ హీరాలాల్ సమారియా సానుకూలంగా స్పందించి రామగుండంలో ఏర్పాటు చేసే ఇఎస్ఐ వంద పడకల ఆసుపత్రి కోసం స్థల పరిశీలన కోసం త్వరలో కమిటిని పంపిస్తున్నామని ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలిపారు.