Home ఎడిటోరియల్ ఒఎన్‌జిసి బంగారు బాతు కోత!

ఒఎన్‌జిసి బంగారు బాతు కోత!

edit

ఇటీవలి దాకా పెద్దగా రుణ లేకుండా మనుగడ సాగిస్తున్న భారత చమురు సహజ వాయువుల కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) ‘మోడీనామిక్స్’లో భాగంగా అప్పులబాట పట్టింది. 2017 18లో వ్యయానికి, రాబడికి మధ్య పెరుగుతున్న అంతరాన్ని పూడ్చడానికి లాభా లు గడిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ (పిఎస్‌యు)లను వాడుకోవాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. జిఎస్‌టి (సరుకులు, సేవల పన్ను) వసూళ్లు క్షీణించడంతో ఈ అంతరం పెరుగుతోంది. అందుచేత ప్రభుత్వ యాజమాన్యంలోని రెండు అతిపెద్ద పిఎస్‌యులలో పరిష్కారాన్ని కేంద్రం వెతుక్కొంది. ఒఎన్‌జిసి, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్) సంస్థలు రెంటికీ ప్రభుత్వం సొంత దారు కాబట్టి హెచ్‌పిసిఎల్‌లోని 51శాతం ప్రభుత్వ వాటాను ఒఎన్‌జిసికి అమ్మి, అలా వచ్చే రూ.37,000 కోట్లను కేంద్రం ఖాతాకి బదిలీ చేయాలి అని పథకం వేసింది.
దీనితో ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ లక్షం కంటే అధికంగా కేంద్రానికి డబ్బు సమకూరుతుంది. అయితే ఇంతటి భారీ లావాదేవీ సులభంగా అవుతుందా అన్న ప్రశ్న ఇక్కడ కేంద్రానికి అప్రస్తుతం. అనేక పిఎస్‌యులనుంచి చిన్నచిన్న వాటాలను అమ్మడం ఏం లాభం? ఈ ఆర్థిక పిల్లిమొగ్గల వల్ల ఇంతవరకూ పెద్దగా అప్పుల భారం మోయని ఒఎన్‌జిసి తప్పనిసరిగా మార్కెట్ నుంచి రుణ సేకరణకు దిగవలసి వస్తుంది. హెచ్‌పిసిఎల్ స్వాధీనం ప్రతిపాదన నిజం చేయడానికి అది రుణాలబాట పడుతుంది. ఒక అపసవ్య లావాదేవీవల్ల ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లో ఓఎన్‌జిసికి కలిగిన తీద్ర నష్టానికి ఇది అదనం కానుంది. అధికారికంగా గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ (జిఎస్‌పిసి)లో 80 శాతం వాటాను ప్రభుత్వ పోరువల్ల 2017ఆగస్టులో ఒఎన్‌జిసి కొన్నది.
ఇది ఆ సంస్థకు చెందిన రూ.7,738కోట్ల రూపాయల విలువైన కెజి బేసిన్ బ్లాకు. ఆ బ్లాకు నుంచి ఉత్పత్తి ప్రారంభించలేని పరిస్థితిలో ఉన్న జిఎస్‌పిసిని బయటపడేయడానికి ఒఎన్‌జిసి చేత జిఎస్‌పిసిలో వాటాను కొనిపించారు. ఆ బేసిన్‌లో ఆ సంస్థ ఆసరికే రూ. 20,000కోట్లు ఖర్చు పెట్టి ఉంది. ఈ స్థితిలో జిఎస్‌పిసి సంక్లిష్టమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుంది. పిఎస్‌యు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను కూడా బకాయి పడింది. అప్పుడు కూడా మోడీ బుర్రలో ఒఎన్‌జిసి అనే ‘పాడి ఆవు’ మెదిలింది. జిఎస్‌పిసిని గట్టెక్కించడానికిగాని, కేంద్రాన్ని ద్రవ్యలోటు నుంచి బయటపడేయడానికి గాని మోడీ చెయ్యి ఒఎన్‌జిసి పై పడుతోంది. ఆయన ప్రభుత్వం పాలిట ఒఎన్‌జిసి ‘కామధేనువు’ అయ్యింది. పైన పేర్కొన్న రెండు సందర్భాల్లోనూ కేంద్రంగాని, గుజరాత్ ప్రభుత్వంగాని నేరుగా మార్కెట్ నుంచి రుణాలు తీసుకుని ఉండవచ్చు.
ఆ డబ్బుతో కేంద్రప్రభుత్వం, జిఎస్‌పిసి ద్రవ్యలోటు పూడ్చవచ్చు. అయితే ఆ ఆర్థిక అంతరాలను పూడ్చడానికి ఒఎన్‌జిసిని బలిపెట్టారు. జిఎస్‌పిసి తన పెట్టుబడి ధనాన్ని చమురు బ్లాకులో దుర్వినియోగపర్చినందుకు నేషనల్ ఆడిటర్ (కాగ్) ఆ సంస్థను 2005లో తీవ్రంగా విమర్శించింది. అప్పుడు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జిఎస్‌పిసికి చెందిన కెజి బేసిన్‌లో 20 ట్రిలియన్ ఘనపుటడుగుల (టిసిఎఫ్) సహజ వాయువు ఉన్నట్లు అప్పట్లో మోడీ ప్రకటించారు. అయితే ఆయన చెప్పిన మోతాదు కంటే చాలా తక్కువ స్థాయిలో అక్కడ వాయు నిక్షేపం ఉన్నట్లు ఇప్పుడు బయటపడింది. అందుచేత జిఎస్‌పిసిని డబ్బున్న ఒఎన్‌జిసిలో కలిపేశారు. సంస్థ నిధులు, రుణంగా సేకరించిన మొత్తంతో హెచ్‌పిసిఎల్ వాటా కొనుగోలు పూర్తి చేస్తామని ఒఎన్‌జిసి చైర్మన్ శశి శంకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు భర్తీ చేయడానికి ఒఎన్‌జిసి ఎందుకు రుణాలు తీసుకోవాలి? గత వారం ఒఎన్‌జిసి హెచ్‌పిసిఎల్ విలీనానికి ప్రభుత్వామోదం లభించిన తర్వాత ఆ సంస్థల రుణ పరిమితిని రూ.25,000కోట్ల నుంచి రూ.35,000 కోట్లకు (40శాతం) పెంచడానికి ఒఎన్‌జిసి బోర్డు అంగీకరించినట్లు యాజమాన్యం తెలిపింది. తమ వద్ద ఉన్న రూ. 12,000 కోట్లు 13,000 కోట్ల నగదును ముందుగా వాడుతామని తర్వాత ఒఎన్‌జిసికి ఐఒసి (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్), గెయిల్ ఇండియాలోగల వాటాల జోలికి పెడతామని, రుణం తీసుకోవడం ఆఖరున చేస్తామని సంస్థ తెలిపింది.
అయితే ఈ వరుస మారే అవకాశం కూడా ఉందని శంకర్ తెలిపారు. తాము కంపెనీలలోని వాటాలను నిరాశతో అమ్ముకోవడం లేదు కనుక వరుస క్రమం మారవచ్చని చెప్పారు. తక్కువ వడ్డీ రేట్లకు రూ.50,000కోట్ల రుణానికి అవకాశాలు వస్తున్నాయని కూడా చెప్పారు. ఇలా వచ్చే రుణాలు విదేశీ కరెన్సీ లేదా స్థానిక కరెన్సీలో ఉండవచ్చని తెలిపారు. ఒఎన్‌జిసి చేత ఏమి చేయిస్తారో మార్కెట్‌కే తెలుసు. గత 6 నెలలలో ముడి చమురు ధరలు 40శాతం పెరిగాయి. అందుచేత ఒఎన్‌జిసి ఖజానాలో చాలా నగదు ఉంది. హెచ్‌పిసిఎల్ 51 శాతం వాటాల కొనుగోలు వల్ల ఈ డబ్బంతా ఇప్పుడు కేంద్రానికి బదిలీ కావడం తథ్యం.
స్టాక్ మార్కెట్ ఈ పరిణామంతో ఉత్సాహపడడం లేదు. ఎందుకంటే ఒఎన్‌జిసి తన పరపతిని చాలా వరకు కోల్పోయిందని దానికి తెలుసు. ఒఎన్‌జిసియే కాకుండా ఏడాదిగా పలు ప్రభుత్వ రంగ సంస్థల విలీనం ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. ఐఒసి, ఆయిల్ ఇండియా, గెయిల్ ఇండియాలలో వాటాల బదిలీ, విలీనం ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. ఆ పరిణామంతో సులభంగా డబ్బు వచ్చిపడుతుందన్న ఆశ లు కేంద్రానికి ఉన్నాయి. ఒక కంపెనీ వాటాను మరొక కంపెనీకి అమ్మడం అనే పద్ధతిలో ఈ లావాదేవీలు ఉంటాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి డోలాయమానంలో కొనసాగుతుండడంతో ఆ చమురు పిఎస్‌యుల బ్యాలెన్స్ షీట్‌లో ఉన్నదాని కంటే ఎక్కువ మొత్తాలు రాబట్టాలని కేంద్రం ప్రయత్నిస్తుందన్న భయాలు వ్యాపిస్తున్నాయి.
మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ నిఘా సంస్థ సెబీకి ఒఎన్‌జిసి చెప్పిన దాని ప్రకారం ఆ సంస్థ రూ.10,000కోట్ల మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి, రూ. 4,460 కోట్ల మేరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, రూ.3000 కోట్ల మేరకు యాక్సిస్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోనుంది. ఈ మేరకు సెబీ నుంచి ఒఎన్‌జిసి కావలసిన అనుమతులను పొందింది. ఈ రుణాలవల్ల ఆయా పిఎస్‌యుల విదేశీ కార్యకలాపాలు కూడా చెడు ప్రభావానికి లోనవుతాయి. ఒఎన్‌జిసి విదేశ్ (ఒవిఎల్) అన్నది ఒఎన్‌జిసికి చెందిన నూరు శాతం అనుబంధ సంస్థ. తన మాతృసంస్థ రుణ రహిత బ్యాలెన్స్ షీట్‌ను ఒవిఎల్ వాడుకొని అంతర్జాతీయ మార్కెట్‌లో చౌకగా నిధులను తెచ్చుకుంటోంది. ఆ నిధులతో విదేశాల్లో చమురు, గ్యాస్ సంస్థల వాటాలను కొంటోంది. ఒఎన్‌జిసి రుణ భారంలో ఇరుక్కొన్న క్షణంలో ఒవిఎల్‌కు నిధులు మరింత ఖరీదు అవుతాయి. అందువల్ల ఆ సంస్థ విదేశాలలో హైడ్రోకార్బన్ సంస్థల వాటాలను సేకరించలేకపోతోంది. ఫలితంగా దేశ ఇంధన భద్రత దెబ్బతింటుంది.ఇలా విలీనాలవల్ల భవిష్యత్తులో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ ఏర్పడి అంతర్జాతీయ పోటీకి తగిన విధంగా కార్యకలాపాలు సాగిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ విధానాలన్నీ బీమా పాలసీల మాదిరిగా భవిష్యత్తు కోసమే అని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదం. * ఎస్.ఎస్.