Home ఎడిటోరియల్ చుక్కలు చూస్తున్న ధరలు

చుక్కలు చూస్తున్న ధరలు

onionధరలు అసాధారణంగా పెరగటాన్ని నిరసిస్తూ సామాన్యప్రజలు అక్టోబర్ 5న దేశవ్యాపితంగా వీధుల్లోకి వచ్చారు. ఆరోజున కందిపప్పు మహారాష్ట్రలో కిలో రూ.200 అమ్ముతున్నది. మిగతా దేశంలో రూ.150 వుంది .ఇప్పుడు కంది, మినప పప్పులు కిలో రూ.180కి చేరాయి. కూరగాయల కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ కిలో రూ.50లకన్నా తక్కువకు లభ్యంకావటం లేదు. ఇక కొద్దినెలలుగా ఎగబాకిన ఉల్లిపాయలు ప్రస్తుతం ఢిల్లీలో రూ.70వద్ద స్థిరపడగా, మిగతా నగరాల్లో నాణ్యత, పాత-కొత్తలనుబట్టి కిలో ధర రూ.50-70మధ్య ఉంది. వంటనూనెలు, ఇంకా అనేక నిత్యజీవితా వసర సరుకుల ధరల్లో మార్పులతో సామాన్యుల కుటుంబ బడ్జెట్‌లు తలకిందులైనాయి. ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు రోజూ ప్రకటించే, ప్రత్యేక కథనాలు ప్రసారం చేసే, ప్రచురించే మీడియా నిత్యజీవితావసర సరకులు ధరలు ఎలా మారుతున్నాయో కనీసం నెలవారీగా నైనా ప్రకటించకపోవటం శోచనీయం.
రిజర్వుబ్యాంక్ గవర్నర్ ప్రభుత్వం, పెట్టుబడిదారులు కోరుకున్నట్లు చాలారోజుల తర్వాత వాణిజ్యబ్యాంకులకు రిజర్వు బ్యాంక్ రుణంగా ఇచ్చే మొత్తంపై వడ్డీరేటును ఏకబిగిన అరశాతం (౦.50 పర్సంటేజి పాయింట్లు) తగ్గించారు. గత 10రోజుల్లో ధరల పెరుగుదలపై దీనిప్రభావం కూడా ఉంది. వడ్డీరేటు తగ్గింపు ప్రభావం నిత్యావసర సరుకులపై ఉంటుందని ఆయనే చెప్పారు. ఉల్లిపాయలు, పప్పుల ధరలు కనీసం 2016 జనవరి దాకా పెరుగుదలలో ఉంటాయని నిర్దిష్టంగా కూడా చెప్పారు. ప్రభుత్వం చేసుకుంటున్న దిగుమతులు మార్కెట్‌కు చేరితే ధరలు తగ్గకపోయినా స్థిరీకరణ పొందవచ్చునని భావించి ఉండవచ్చు. కాని దేశంలో దుర్బిక్ష పరిస్థితులు పప్పుపంటల ఉత్పత్తిని దెబ్బతీసినందున వచ్చే సంవత్సరం కొత్తపంట వచ్చేవరకు పప్పుల ధరలు తగ్గుతాయన్న ఆశలేదు. లభ్యమైన పంటను వ్యాపారులు ఎక్కువ ధరకు కొని నిల్వచేస్తున్నందున పప్పులధరలు ఈ పండగ సీజన్ (దసరా నుంచి సంక్రాంతి)లో కిలో రూ.200తాకినా ఆశ్చర్యపడనవసరం లేదు.
వడ్డీ తగ్గింపును వాణిజ్యబ్యాంకులు రుణ గ్రహీతలకు లభ్యం చేస్తే అది ఎక్కువకాలం మన్నికగల వస్తూత్పత్తి పరిశ్రమలకు ప్రోత్సాహ మిస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ రాజన్ అన్నారు. వడ్డీతగ్గితే రుణం నెలసరి కిస్తీ (ఇఎంఐ) తగ్గుతుంది కాబట్టి ఫ్రిడ్జ్‌లు, ఎయిర్‌కండిషనర్లు, ఇతర విలాసవస్తువుల కొనుగోలు పెరుగుతుందని అంచనా. ఇది సామాన్యులు, మధ్యతరగతులను మరింత అప్పుల పాల్జేస్తుంది. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు వేతనసంఘం నివేదిక అమలు, పారిశ్రామిక కార్మికులకు బోనస్‌లు మార్కెట్‌కు ఊతమిస్తాయని అంచనా. దీన్నలా ఉంచితే వడ్డీరేటు తగ్గింపునుంచి అతి ఎక్కువ లబ్దిపొందేది పెట్టుబడిదారీ వర్గం. ఒకటి, వ్యాపార వ్యయం తగ్గటంవల్ల లాభాలు పెరుగుతాయి. రెండు, పెద్దఎత్తున బ్యాంకులనుంచి అప్పులు తీసుకుని, ఏదోక పేరుతో ఎగనామం పెట్టి వాటిని బ్యాంకులకు ఎన్‌పిఎలుగా మార్చవచ్చు. కొద్ది సంవత్సరాలు ఆ పేరులో ఉన్నాక అవి రద్దు చేయబడుతూ ఉంటాయి. ప్రస్తుతం బ్యాంకుల ఎన్‌పిఎలు రూ.3లక్షల కోట్లకుపైగా ఉన్నాయి.
ప్రభుత్వానికి ఈ విషయం తెలియకకాదు. తెలిసే, ఆర్థిక వ్యవస్థను మందగమనంనుంచి ఉరుకులెత్తించే పేరుతో వడ్డీరేట్ల తగ్గింపుకొరకు కార్పొరేట్లకు వంత పాడింది. ఇదేసమయంలో, పెరుగుతున్న ధరలు, ఆర్థిక సమస్యలపై – ప్రజలు బాధపడుతున్నా-వాటిని చర్చించకుండా చేసేందుకు భావోద్వేగ సమస్యలను చర్చనీయాంశం చేస్తున్నది. దాద్రీలో గోమాంసం పేరుతో ఒక ముస్లిం హత్య గత పదిరోజులుగా దేశవ్యాప్త చర్చనీయాంశమైంది. దాన్ని ఖండించాల్సిందిపోయి, “గోవును చంపిన వారిని చంపండి” వంటి కవ్వింపు ప్రకటనలు వినిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలన్నీ పక్కకుపోయి గోవు అంశం తీవ్రమైన చర్చనీయాంశం చేయబడింది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా నుంచి, మాజీ బిజెపి ఉపముఖ్యమంత్రి సుశీల్ మోడీ వరకు ‘గోమాంస భక్షణ’ గూర్చే మాట్లాడుతున్నారు. బీహార్‌లో 1955 నుంచి గోవధపై నిషేధం ఉంది – మరిచినట్లున్నారు. ప్రజలు – ఓటర్లు పేదరికం, ధరలు, ఇళ్లు, భూమి వంటి కీలక సమస్యలు లేవనెత్తకుండా ఉండేందుకే భావోద్రేకసమస్యలపై గంభీరోపన్యాసాలిస్తున్నారు. రెండు, ప్రధాన కూటములు – ఎన్‌డిఎ, మహాకూటమి- కుల, మత రాజకీయాలకు తోడు పరస్పర ఆరోపణలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కోరకం భావోద్వేగ సమస్యలు రెచ్చగొడుతుంటే ప్రజలు తమ దైనందిన జీవితం గురించి ఆలోచించేదీ, పరిష్కారాలకై పోరాడేది ఎప్పుడు? అందుకనే బీహా ర్ ఎన్నికల్లో ఆరు వామపక్షపార్టీల సంఘటన రెండు కూటములకు వ్యతిరేకంగా ప్రజలను మేల్కొలిపే రాజకీయ ప్రచారంలో మునిగి వున్నాయి. ఇది తక్షణం సీట్ల గెలుపులో ప్రతిఫలించకపోవచ్చు. దీర్ఘకాలికంగా ప్రజలకు, వామపక్షాలకు ప్రయోజనకారి అవుతుంది.