Home ఆఫ్ బీట్ పేరు పేరుకో చరిత్ర..

పేరు పేరుకో చరిత్ర..

ఆన్‌లైన్‌లో ఓ కంపెనీని పెట్టాలంటే సులభమే.. కానీ దానికో మాంచి పేరు పెట్టాలంటేనే వస్తుంది తంటా.. ఆ పేరు అందరికీ నోటికి వచ్చినట్లుండాలి. ప్రతి ఒక్కరికి గుర్తుండాలి.  ఒక కంపెనీ పేరు పెట్టాలంటే దాని వెనక చాలా కసరత్తే చేయాలి. భారతదేశంలో తమ కంటూ ఒక ప్రత్యేకమై స్థానాన్ని సంపాదించుకున్న కొన్ని ఆన్‌లైన్ సంస్థల పేర్లు ఎలా పెట్టారో తెలుసుకుందాం.

Online-Market

రొటీన్‌కు భిన్నంగా స్నాప్‌డీల్

ఇప్పుడంతా ఆన్‌లైన్ షాపింగే నడుస్తోంది. అలాంటి ఆన్‌లైన్ సంస్థల్లో ముందుంది స్నాప్‌డీల్. దేశంలో బిలియన్ డాలర్ల కంపెనీల్లో ఒకటైన స్నాప్‌డీల్‌కి మంచి గుర్తింపు ఉంది. ఈ సంస్థ పేరు చిన్నదిగా ఉన్నా దీని వేగం మాత్రం చాలా ఎక్కువగా ఉండాలని స్నాప్‌డీల్ అనేపేరు పెట్టారు సంస్థ వ్యవస్థాపకులు రోహిత్, కునాల్. ఈ సంస్థకు పేరు పెట్టాలని చాలా పేర్లను పరిశీలించినా, చివరకు స్నాప్‌డీల్‌ని ఎంచుకున్నారు. సింపుల్‌గా ఉంటూనే, రొటీన్‌కు భిన్నమైన పేరులా ఉందని దీన్ని ఎంచుకున్నారు.

పెప్పర్‌ఫ్రై డాట్‌కామ్…

ఇంటికి కావాల్సిన ఫర్నీచర్‌ను పెప్పర్‌ఫైలో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదేంటి ఈ పేరేదో మసాలా దినుసు లా ఉందే..ఫర్నీచర్ ఏంటి అనుకుంటున్నారా. పెప్పర్‌ఫ్రై డాట్‌కామ్ ఈ పేరుకి ఈ సంస్థ అమ్మే వస్తువులకు ఎలాంటి సంబంధం లేదు. ముంబై కేంద్రంగా ఈ సంస్థ మొదట్లో దుస్తులూ, సౌందర్య సామగ్రి, గృహోపకరణాలు లాంటివి అమ్మేది. తర్వాతి కాలంలో రోజుకో కొత్త సంస్థలు రావడంతో పోటీ పెరిగింది. దాంతో వారికి అత్యధిక ఆదరణ లభిస్తున్న ఫర్నిచర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయినా వారికి పేరుతో ఎలాంటి ఇబ్బంది రాలేదు.

టొమాటో టూ జొమాటో

జొమాటో పేరు వింటేనే చాలు నోట్లో నీళ్లూరతా యి. ఎందుకంటే ప్రసుత్తం ఈ పేరుకి అంతలా క్రేజ్ ఉంది. ఆన్‌లైన్ ద్వారా పలు రకాలైన హోటళ్ల నుంచి నచ్చిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేస్తున్నారు. ఈ సంస్థ పేరు మొదట foodiebay. కానీ 2010లో ఆ పేరుని మార్చాలనుకున్నారు. త మ పేరులో ebay లేకుండా ఆ కొత్త పేరు ఉండాలనుకున్నారు. ఆ సమయంలో టొమాటోలోని మొదటి అక్షరం మార్చి పద ప్రయోగం చేసి జొమాటోగా పెట్టారు. పదంలో ఒక నవ్యత రావడంతోపాటు చాలా సింపుల్‌గా ఉండటంతో ఆ పదాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ ఫొన్‌లో ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని రాత్రి, పగలు .. ఎప్పుడు పడితే అప్పుడు ఆర్డర్ ఇచ్చి ఫుడ్‌ను తెప్పించుకుంటున్నారు.

ఫ్లిప్‌కార్ట్

షూ, వాచ్‌లు, టీ షర్ట్, మొబైల్స్, కంప్యూటర్‌కి సంబంధించిన పరికరాలను కేవలం ఒక్కరోజులోనే ఫ్లిప్‌కార్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ అంటే స్పష్టంగా ఒక అర్థమేమీ లేదు. తమ కంపెనీకి అలానే పేరు పెట్టుకోవాలనుకున్నారు వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్. పేరు ఒకే పదంలా ఉండాలి, ఆ పేరుకి వెంటనే ఇంకో అర్థం లేకుండా ఉండకూడదు, షాపింగ్‌కు సంబంధించినదని తెలియాలి. వీళ్లు స్థాపించిన సంస్థ మొదట పుస్తకాలతో ప్రారంభమైంది. కానీ ‘బుక్ అనే పదం ఉండకూడదు.. ఎందుకంటే భవిష్యత్తులో వారు అమ్మే వస్తువుల్లో వేరేవీ ఉండొచ్చు అనుకున్నారు వ్యవస్థాపకులు… ఇన్నింటి మధ్య పుట్టిందే ఫ్లిప్‌కార్ట్.

మంత్రా టు మింత్రా!

ఫ్యాషన్ ప్రియులు ఆన్‌లైన్‌లో ఎప్పుడూ వెతికేది మింత్రాడాట్‌కామ్. ఆన్‌లైన్ ఫ్యాషన్ దుస్తుల దుకాణం ఇది. దీన్ని మొదలుపెట్టినప్పుడు పదికి పైగా పేర్లను పరిశీలించారట. చివరకు మిగిలిన వాటిలో కొందరు హిందీ పేరు పెడదామనీ ఇంకొందరు ఇంగ్లిష్‌లో ఉండే బావుంటుందనీ అన్నారట.  మధ్యే మార్గంగా మంత్ర అనే సంస్కృత పదాన్నితీసుకుని దాన్ని ఆధునీకరించి మింత్రా గా పెట్టారు. ఈ పేరు ఎంతో పాపులర్ అయ్యింది. ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. ఫ్యాషన్ వస్తువులను ఆర్డర్ పెట్టుకుంటున్నారు.

ఆత్మీయతకు మారుపేరు ఓలా

ఎక్కడికి వెళ్లాలన్నా ఓలా బుక్ చేసుకోవడం ఇప్పుడున్న ఓ పెద్ద ఫెసిలిటీ. క్షణాల్లో మన ముందుంటుంది క్యాబ్. చేరాల్సిన గమ్యానికి క్షేమంగా చేరుస్తుంది. ఓలాలో క్యాబ్, కారు, ఆటోవంటి వాహనాలను బుక్ చేసుకుని ప్రశాంతంగా గమ్యానికి చేరుకుంటున్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ కొత్తగా ఆలోచించి ఓలా అనే పేరు పెట్టాడు. స్పెయిన్‌లో ఓలా అంటే హలో అని అర్థం. ఈ పేరులో ఒక ఆత్మీయత ఉండటమే దానికి కారణం అని అగర్వాల్ అంటున్నాడు.