Home తాజా వార్తలు రవాణా శాఖలో ఆన్‌లైన్ సమస్యలకు చెక్!

రవాణా శాఖలో ఆన్‌లైన్ సమస్యలకు చెక్!

Permanent solution to online issues in transport department

 

శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు
సాంకేతికత అభివృద్ధికి అధికారుల సన్నాహాలు
అవసరాలకు తగినట్లుగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి

మన తెలంగాణ/హైదరాబాద్ : రవాణాశాఖలో ఇటీవల తరచుగా ఆన్‌లైన్ సేవలు నిలిచిపోతున్నాయి. సాంకేతిక సమస్యలే ఇందుకు ప్రధాన కారణమనేది అధికారుల అభిప్రాయం. ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడంతో రాష్ట్రంలో వినియోగదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. గత వారం రాష్ట్ర రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పడిన సమస్యల వల్ల వినియోగదారులను ఎన్ని రకాల అవస్థలకు గురిచేసిందో ప్రత్యక్షంగా చవిచూసిన అధికారులు సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. తరుచూ తలెత్తుతున్న సమస్యల వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సత్వరమే ఆయా సమస్యలను పరిష్కరించి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించడంతో సంబంధిత ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలకు చేపడుతున్నట్లు సమాచారం. దీంతో ఇక నుంచి ఆన్‌లైన్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

అవసరాలకు తగ్గట్లు సాంకేతికత..
రవాణాశాఖలో అవసరాలకు తగినట్టుగా సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దీనిపై కసరత్తును ప్రారంభించారు. ఇప్పటి వరకు విస్తరించిన పౌరసేవలకు అనుగుణంగా సంబంధిత ఉన్నతాధికారులు హార్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ వ్యవస్థల్లో మార్పు చేయకపోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునీకరించకపోవడంతో పాటు అభివృద్ధికి నోచుకోకపోవడం వల్లే సమస్యలు తలెతుతున్నాయని రవాణారం గ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రవాణాశాఖలో పౌరసేవలన్నింటినీ కేంద్రీకృతం చేస్తూ ద్విచక్ర వాహనాన్ని మొదలుకొని మూడు చక్రాల వాహనాలకు సంబంధించిన సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాకముందు వరకు రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆర్టీఏ కార్యాలయాల్లో అందజేసే పౌర సేవలన్నింటినీ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి అందజేసే విధంగా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్, చిరునామా మార్పు, యాజమాన్య మార్పు, పర్మిట్ల జారీ, పన్నువసూళ్లు వంటి అన్ని రకాల కార్యకలాపాల డేటా ప్రధాన కార్యాలయం నుంచి ప్రాంతీయ కార్యాలయాల కు అందుతుంది. పౌరసేవల అమలును ఏకీకృతం చేసే విధంగా తెచ్చిన ఈ సాంకేతిక పరిజ్ఞానం రవాణాశాఖలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేని రోజుల్లోనే ఆర్టీఏలో ఆన్‌సేవలు అందుబాటు లోకి వచ్చాయి. దళారులను నియంత్రించేందుకు ఇది కొంతవరకు దోహ దం చేస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

లక్ష్యం గొప్పదే కానీ..
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలకగకుం డా అన్ని రకాల సేవలను అందించాలనే ప్రధాన లక్షం. ప్రభుత్వం చేసిన ఈ లక్ష్యం చాలా గొప్పదే అయినా ఆచరణలోనే మాత్రం అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, తాత్కాలిక, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు వంటి కొన్ని పరిమితమైన సర్వీసుల కోసం ఏకీకృతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం 63 సర్వీసులతో పాటు రెండు సర్వర్లను ఏర్పాటు చేశారు. 2010 నుంచి ఇప్పటి వరకు సుమారు 63 రకాల పౌరసేవలను ఆన్‌లైన్ ద్వారా అందజేస్తున్నారు. ఆర్టీఏ నుంచి ఎలాంటి సర్వీసు కావాలన్నా ఇప్పుడు ఆన్‌లైన్‌లో స్లాట్ నమోదు చేసుకోవలసిందే. అప్పట్లో రాష్ట్రవ్యాప్తం గా 60 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు వాహనాల సంఖ్య కోటి దాటింది. దీంతో రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలోనే కేవలం 2 సర్వర్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్కటి 40 టెర్రాబైట్(టీబీ)ల సామర్థ్యంతో పనిచేస్తోంది.

వాటిపైన పడుతున్న భారం అంతకు రెట్టింపుగానే ఉంది. ఈ సర్వర్ల సామర్థ్యాన్ని 80 టీబీ నుంచి 150 టీబీకి పెంచాలని అధికారులు ప్రతిపాదించారు, సర్వర్ల సామర్థ్యం పెంపుతోపాటు సాంకేతిక సేవలను మరింత పటిష్టం చేయడం, పాత కంఫ్యూటర్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం తదితర అన్ని రకాల సాంకేతిక అవసరాల కోసం రూ.26 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ, రవాణాశాఖలో సాంకేతిక, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో తాత్కలికంగా వీటికి బ్రేక్ పడుతుంది. దీంతో సాంకేతిక సమస్యను అధిగమించేందుకు సంబంధిత ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ సమస్యల రోజురోజుకు మరింత పెచ్చుమీరుతుండడంతో సాంకేతిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రవాణావాఖ అవసరమైన చర్యలకు శ్రీకారం చుడుతోంది.

వారంలో రెండు సార్లు..
రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ సర్వర్లు గత సోమవారం పూర్తిగా నిలిచిపోయాయి. పౌరసేవలు స్తంభించాయి. రవాణాశాఖ వెబ్‌సైట్ కూడా పనిచేయలేదు. దీంతో ఆర్‌టిఏ న్రధాన కార్యాలయంగా ఉన్న ఖైరతాబాద్‌లోని కార్యాలయంలోనే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ రకాల పౌరసేవల కోసం స్లాట్‌లు బుక్ చేసుకొని ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చిన వేలాది మంది వినియోగదారులు గంటల తరబడి అక్కడే పడిగాపులు కాయాల్పిన దుస్థితి నెలకొంది. తమ పనులను పూర్తిగా మానుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచిచూసినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. దీంతో వారంతా తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. సోమవారం కోసం స్లాట్‌లు నమోదు చేసుకున్న వాళ్లు మంగళవారం తిరిగి అదే సమయాల్లో ఆర్టీఏ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు. కేవలం వారంరోజుల వ్యవధిలో రెండుసార్లు రవాణా కార్యకలాపాలు ఆగిపోవడం గమనార్హం.

Permanent solution to online issues in transport department